రైతు క్షోభ పట్టని సర్కారు..

జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా వాటిని ఏలికలు అలవోకగా తీసుకోవడం దుర్మార్గం. అన్నపూర్ణగా అభివ ర్ణించే ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల బలవన్మరణాలు మరింత ఆందోళన కరం. రాయలసీమలో సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 32 మంది కర్షకులు విధి లేని పరిస్థితుల్లో మరణాన్ని ఆశ్రయించినా ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం సైతం లేకపోవడం దారుణం. సీమలో రైతు ఇంట చావు డప్పు ఇప్పటికిప్పుడు తలెత్తిన ఉత్పాతం కాదు. దశాబ్దంన్నర నుంచీ పరంపర కొనసాగుతూనే ఉంది. టిడిపి, కాంగ్రెస్‌, మళ్లీ టిడిపి పాలక పార్టీలు మారాయి తప్ప పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు సరి కదా అంతకంతకూ దిగజారుతున్నాయి. ఎపిలో 2014లో 160 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఇటీవల నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌ సిఆర్‌బి) వెల్లడించింది. గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం నిలదీయడం, బయట ఇతర విపక్షాల, రైతు సంఘాల ఆందో ళనలు మిన్నంటడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు అప్పటి వరకు చెల్లిస్తున్న రూ.లక్షన్నర ఎక్స్‌గ్రేషియాను రూ.ఐదు లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకట నైతే చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోగా ఇస్తామన్న పరిహారం విషయంలోనూ కనీస మానవత్వం లేకుండా సవాలక్ష ఆంక్ష లు పెట్టి నానా యాతన పెడుతున్నారు. గత సంవత్సరం జూన్‌ 2కు ముందు మర ణిస్తే లక్షన్నరేనట. కేవలం అనంతపురం వారికే ఐదు లక్షలట. సరే, ఆ మేరకైనా ఇచ్చింది లేదు. అనంతపురంలో 120 మంది చనిపోతే ఇప్పటికి పరిహారం చెల్లిం చింది 65 కుటుంబాలకే. ఇదీ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు. పైపెచ్చు ఆత్మహత్యలను గుర్తించడంలో సర్కారు అవలంబిస్తున్న చేష్టలు జగుప్స కలిగిస్తున్నాయి. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, కుటుంబ సభ్యులు, స్థానికులు వీళ్లను వదిలేసి పోలీస్‌ నిఘా వర్గాల సిఫారసుతో ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారంటే అంతకంటే అఘాయిత్యం మరొకటి ఉండదు. 
రైతుల ఆత్మహత్యలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. దేశంలో సంస్కరణలు మొదలైన ఈ పదిహేనేళ్లల్లో వ్యవసాయ సంక్షోభం బాగా ముదిరిపోయింది. 1995 నుంచి 2014 మధ్య మూడు లక్షల మంది కర్షకులు ఆత్మహత్య చేసుకోవడాన్నిబట్టి గ్రామీణ భారతం ఎంత భయానకంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో బిజెపి వచ్చాక రైతుల ఆత్మహత్యలను దాచిపెట్టే దుర్మార్గ విధానానికి తెర తీసింది. 2013లో 11,772గా ఉన్న బలవన్మరణాలను 2014లో 5,650కి తగ్గించేసింది. అంకెల గారడీ తప్ప రైతుల ఆత్మహత్యలు తగ్గింది లేదు. వ్యవసాయ సంబంధం, వ్యవసాయ కార్మికులు, కుటుంబ సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఆర్థిక దివాలా, డ్రగ్స్‌-ఆల్కహాల్‌ వాడకం, ఇతర కారణాలు వంటి కేటగిరీలుగా ఆత్మహత్యలను వర్గీకరించి ఉన్నపళంగా మరణాలను తగ్గించేసి తాము రాగానే వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉందనే తప్పుడు ప్రచారానికి మోడీ సర్కారు ఒడిగట్టింది. ఎన్‌సిఆర్‌బి నివేదికను గమనిస్తే పత్తి పంటను అత్యధికంగా సాగు చేస్తున్న రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. మొత్తం బలవన్మరణాల్లో చిన్న, సన్నకారు రైతులవి 73 శాతం. ఈ ధోరణి వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతుంది. 
వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై ఇప్పటి వరకు దేశంలో 60 కమిటీలు వేశారు. కేంద్రంలో స్వామినాధన్‌, ఉమ్మడి ఎపిలో జయతిఘోష్‌ నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. రైతుల ఆత్మహత్యలపై సిగ్గుపడాల్సింది పోయి తెలంగాణాతో పోల్చుకొని ఎపిలో రైతుల ఆత్మహత్యలను టిడిపి సర్కారు తక్కువ చేయడం తప్పించుకోడానికే. రైతుల ఆత్మహత్యలను తగ్గించడమే కాదు ఒక్కరు కూడా ప్రాణ త్యాగానికి ఒడిగట్టని భారత్‌ను రూపొందించాలని ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు గడ్డి పెట్టినా చంద్రబాబు తీరు మారకపోవడం దుర్మార్గం. అప్పులు, వడ్డీల వల్లనే రైతులు చనిపోతున్నారన్నది నిజం. ప్రభుత్వం సక్రమంగా రుణ మాఫీ చేసి ఉంటే రైతులెందుకు మరణశయ్య ఎక్కుతారు? ఆత్మహత్యలు అంతకంతకూ ఎందుకు పెరుగుతాయి? ఇప్పటి వరకు పత్తి రైతులకే పరిమితమైన ఆత్మహత్యలు పొగాకు, వేరుశనగ, చెరకునకు విస్తరించడం ఆందోళనకరం. రైతులను విస్మరించి ప్రాధమికరంగ మిషన్‌, రెండంకెల వృద్ధి సాధ్యమా? పెరుగుతున్న అప్పులు, చేతికిరాని పంట, గిట్టుబాటు ధరలు లేమి, ప్రకృతి వైపరీత్యాలు వీటన్నింటినీ మించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలు రైతుల బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకుండా రైతుల ఉద్ధరణ గురించి మాట్లాడటం మోసగించడానికే. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం ఎంత మాత్రం కాదు. ప్రభుత్వాలను మార్చేందుకు ఉద్యమించడమే రైతుల ముందున్న ఏకైక మార్గం.