రైతు ఉద్ధరణ ఇలాగా?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది పత్తి రైతుకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర. ఇంకేముంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశాం పంట తేవడమే ఆలస్యం అని సర్కారీ పెద్దలు ఆశ పెట్టడంతో నిజమేననుకొని పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లిన రైతులు కొనుగోలు జాడ లేక తెల్లబోతున్నారు. తిరిగి పంటను ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక దళారులకు అయిన కాడికి తెగనమ్ముకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులను రక్షించాల్సిన ప్రభుత్వమే వంచిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక గుండెలు అవిసేలా బోరుమంటున్నారు. రైతులంటే పాలకులకు ఎందుకంత అలుసో అర్థం కాదు. ఊరికి ముందే ఈ నెల 3న ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి పత్తి కొనుగోళ్లపై కొండంత రాగం తీయగా పక్షం రోజులు దాటాక అది లల్లాయి పాటేనని రుజువైంది. రైతులు లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకొని నష్టపోతుండగా రాష్ట్ర వ్యవసాయ పర్యవేక్షణలో భారత పత్తి సంస్థ (సిసిఐ) కొన్నది మూడే మూడు క్వింటాళ్లు. ఈ మాత్రం దానికేనా రైతులకు సాగును లాభసాటి చేస్తామని నిత్యం చంద్రబాబు, మంత్రులు ఏకరువు పెట్టేది? పత్తి రైతుకు 'మద్దతు' కల్పించాల్సింది రాష్ట్ర పరిధిలోని మార్కెటింగ్‌, కేంద్ర పరిధిలోని సిసిఐ. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకొని రైతులను ముంచుతున్నాయి. పత్తి కొనుగోళ్లపై సిసిఐతో మాట్లాడి అన్ని విధాలా సన్నద్ధం కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లుంది. ఒక్కసారిగా రైతుల ఆందోళనలు మిన్నంటిన దరిమిలా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశామని నవంబర్‌ 3న వ్యవసాయ మంత్రి హడావిడి చేసి మళ్లీ కన్నెత్తి చూడలేదు రాష్ట్ర వ్యాప్తంగా 43 కొనుగోలు కేంద్రాలనగా ఇప్పటికి మొదలైనవి పన్నెండు. వాటిలోనూ పత్తి కొనుగోళ్లపై స్పష్టత లేదు. మార్గదర్శకాలు, మౌలిక సదుపాయాలూ లేకుండా సర్కారు వల్లిస్తున్న 'మద్దతు' జపం రైతులను దగా చేయడానికేగా?
గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సిసిఐ పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరగ్గా దానిపై కేంద్ర పరిశోధనా సంస్థ (సిబిఐ) కూపీ లాగగా విస్తుగొల్పే అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సిసిఐ, మార్కెటింగ్‌ లాలూచీపడి రైతులకు సున్నం పెట్టాయి. నాణ్యత పేరుతో సిసిఐ సవాలక్ష కొర్రీలు వేసి దళారులకు రైతులచే పత్తిని అమ్ముకునేలా ప్రోత్సహించింది. ఆ విధంగా రైతుల నుంచి తక్కువ ధరకు దళారులు కొన్న పత్తిని మద్దతు ధరపై రైతుల నుంచి కొన్నట్లు రికార్డులు సృష్టించి రూ.కోట్లు బొక్కారు. ఈ వ్యవహారంలో కేవలం అధికారులదే తప్పంటున్నారుకానీ ప్రభుత్వ 'పెద్ద'ల ప్రమేయం లేకుండా స్కాం అసాధ్యం. మార్కెట్‌ కమిటీ (ఎఎంసి) దగ్గర నుంచి మార్కెటింగ్‌ డైరెక్టరేట్‌ వరకు కుంభకోణం ఆక్టోపస్‌లా విస్తరించడం జరగని పని. సిబిఐ దర్యాప్తుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిందిపోయి పత్తి కొనుగోళ్లపై చివరి వరకు కాలక్షేపం చేస్తోందంటే సహజంగానే అనుమానాలొస్తాయి. నిరుడు అవకతకల నేపథ్యంలో సిసిఐ పత్తి కొనుగోళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది. కేంద్రాలకు పంట తీసుకొచ్చేవారు రైతులో కాదో రాష్ట్రం గుర్తించాలని, ఆధార్‌, పట్టాదార్‌పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌లో చెల్లింపులంది. రాష్ట్ర ఆన్‌లైన్‌ వ్యవస్థ లోపాలపుట్ట అయినప్పుడు సిసిఐ షరతులు దళారులకే లాభిస్తాయి.
కౌలు రైతుల గుర్తింపునకు విధించిన నిబంధనలు మరీ దారుణం. సదరు రైతు ఫలాన వారి భూమిలో పత్తి పండించినట్లు విఆర్‌ఒ ద్రువీకరించాలి. గ్రామాల్లో నేటికీ వేళ్లూనుకున్న భూస్వామ్య, పెత్తందార్ల వ్యవస్థలో సాధ్యమయ్యేపనేనా? పత్తి పండించిన కౌలు రైతు అనివార్యంగా దళారులకు అమ్ముకోమనేగా అర్థం. పంటల సీజనులో మద్దతు ధర సమస్య ఏలినవారికి తెలియందికాదు. రైతులకు ధర ఇప్పించాల్సిన మార్కెటింగ్‌ విభాగం ఎంత దౌర్భాగ్యంగా ఉందో బుధవారంనాటి ఉన్నతస్థాయి భేటీలో వెల్లడైంది. ఏడాదిలో నలుగురు కమిషనర్లను మారిస్తే పని జరుగుతుందా? యథా రాజా తథా సిబ్బంది. కింది నుంచి పైదాకా నిర్లక్ష్యం ఆవహించింది. 
పర్యవేక్షకుల్లేకుండా పర్యవేక్షణా కమిటీలు రైతుల కంటి తుడుపు కోసమే తప్ప రైతుల 'మద్దతు'పై చిత్తశుద్ది ఉండి కాదు. క్షేత్ర స్థాయిలో ఎఎంసిలు అధికార పార్టీకి రాజకీయ పునరావాసాలుగా మారి అక్రమాలకు నిలయాలయ్యాయి. వ్యవస్థను ప్రక్షాళన చేకుండా రైతులకు 'మద్దతు' అనడం మోసగించడమే. గతంతో పోల్చితే ఈసారి ఎపిలో పత్తి విస్తీర్ణం తగ్గింది. సాగు, దిగుబడి తగ్గినప్పుడు రైతులకు ధర రావాలి. కానీ అంతకంతకూ క్షీణించడం దేనికి? క్వింటాలుకు సర్కారు ప్రకటించిన మద్దతు ధర రూ.4,100 కాగా మూడు వేలు రావడం గగనమవుతోంది. తేమ శాతం, ఆధార్‌, రైతుల గుర్తింపు, ఆన్‌లైన్‌ తదితర సిసిఐ కఠిన నిబంధనలు సడలించేలా రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బోనస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు సాకులు చెప్పడం క్షమించరానిది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలదీ. ఆత్మహత్యల్లో పత్తి రైతులవే అత్యధికమని నివేదికలు ఘోషిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు మరింతగా తోడ్పాటునివ్వాలి.