రైతుల పరిస్థితి దయనీయం..

రాజధానికి భూములిచ్చిన రైతుల జీవనస్థితి మారిపోతోంది. భూములిస్తే అకాశ హర్య్మాలు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తదనుగుణంగా కనీస శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో వారు గేదెలు కాసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాగులేక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. తోటల్లో పిచ్చిచెట్లు మొలిచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. మాగాణుల్లో మోకాళ్ల ఎత్తున గడ్డి మొలిచింది. వాటిని చూసి రైతులు చలించిపోతున్నారు. కొద్దిపాటి మొత్తాన్ని వెచ్చించి రైతులు ఒకటీ లేదా రెండు గేదెలు కొనుగోలు చేసుకున్నారు. సాగు చేసిన పొలాల్లోనే వాటిని మేపుకొంటూ కాలం గడుపుతున్నారు. జరీబు గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సహజంగానే సారవంతమైన నేలలు కావడంతో అక్కడిక పొలాల్లో గడ్డి ఏపుగా పెరిగింది. లింగాయపాలెం సమీపంలో నిమ్మతోటల్లో పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. తుళ్లూరు, వెలగపూడి ప్రాంతాల్లోని మాగాణుల్లో తుంగ విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది సాగుకు అనుమతిస్తే ఈ పాటికి ఒక పంట పూర్తి చేసుకునే వారమని తుళ్లూరు లిఫ్టు కింద పొలాలున్న రైతు జె.శంకరరావు తెలిపారు. 
పూలమ్మిన చోటే...
పూలమ్మినచోటే కట్టెలమ్మే సామెత తమకు అద్దినట్లు సరిపోతుందని, పొలాలు లేనో ళ్లకేకాదు అందరికీ ఇబ్బందులొ స్తున్నాయని మోదులంక పాలేనికి చెందిన రైతు ధనశిరి సాంబశివరావు తెలిపారు. ఈయన రాజధానికి జరీబు ప్రాంతంలో ఉన్న ఎకరం 50 సెంట్ల భూమిని ఇచ్చేశారు. దీంట్లో 50 సెంట్లు అమ్ముకున్నారు. అలా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుని గేదెలు కొనుగోలు చేసుకున్నారు. ఒకప్పుడు గేదెలు కాసేవారిని తాము గదమాయించే వారమని, ఇప్పుడు తమదీ అదే పరిస్థితి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఇప్పుడు విలువే లేదు...
ఇదే గ్రామానికి చెందిన ధనశిరి రాంబాబు రాజధానికి ఎకరం పొలం ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఎకరం అప్పట్లోనే మార్కెట్‌ రేటు రూ.6 కోట్ల వరకూ ఉంది. అంత విలువైన భూమినిచ్చి గేదెలు కాసుకో వడం తప్ప మరేమీ చేయ లేకపోతున్నామని, చేసుకోవడానికీ పనులూ లేవని తెలిపారు. తాము వ్యవసాయం చేసుకున్నప్పుడు గ్రామాల్లో ఉండే విలువ ఇప్పుడు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. 
పచ్చని పొలాల్లో పిిచ్చి మొక్కలు 
పచ్చని పంట పొలాల్లో గడ్డి, పిచ్చి మొక్కలు మొలుస్తుంటే చూడలేకపోతున్నామని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు సుధాకర్‌ చెప్పారు.ఉపాధి కల్పిస్తామంటున్నారని, నర్సరీ దగ్గర కాపలా ఉంటే రోజుకు రూ.185 ఇస్తున్నారని రాజధానికి ఎకరం భూమిచ్చిన మరోరైతు తెలిపారు. గతంలో తాము పొలాలకు ఉదయం 7 గంటలకు కెళ్లి 11.30 గంటలకు ఇంటి కొస్తే రూ.300 వరకూ ఇచ్చేవారని తెలిపారు. 'అట్టాంటిది పొద్దున ఆరుగంటల కొచ్చి సాయంత్రం ఆరు గంటల వరకూ రూ.185 ఇస్తున్నారని తెలిపారు. 
నిద్రగన్నేరు మొక్కల పెంపకం
రాజధాని ప్రాంతాల్లోని నర్సరీల్లో నిద్రగన్నేరు, నేరేడు, పొన్నాయి చెట్లను పెంచుతున్నారు. దీనికిబదులు తమ తోటలనే నర్సరీలుగా మార్చి అభివృద్ధి చేస్తే ఫలసాయమూ వస్తుందని రైతులు చెబుతున్నారు. నిమ్మతోటలున్నచోట వాటిని పెంచాలనీ, ప్రభుత్వం అటవీశాఖ సాయంతో పెడుతున్న చెట్లు చిన్నపాటి గాలొచ్చినా విరిగిపోతాయని, అదో సమస్యగా మారుతుందని వెలగపూడికి చెందిన కౌలు రైతు రాజు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.