రైతులకు న్యాయం చేయాలి..

పంచగ్రామాల భూసమస్యపై టిడిపి ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. కేబినెట్‌ ప్రకటనతో కేవలం 12149 మందికే ఉపశమనం లభిస్తుందని, మరింత ఉదారంగా వ్యవహరించి జిఒ జారీ చేస్తే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరగుతుందన్నారు. 60 గజాల లోపు వరకు ఉన్న నివాసాలను మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరించి, మిగిలిన వాటిని వర్గీకరించి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అక్కడితో ఆగకుండా 61 నుంచి 300 గజాల వరకు 1998 నాటి భూ విలువలో 70 శాతం డబ్బులపై 9 శాతం వడ్డీ కట్టాలని ప్రకటించడం సబబు కాదన్నారు. సోమవారం ఉదయం విశాఖ జిల్లా సిపిఎం కార్యాలయంలో నగర కార్యదర్శి బి.గంగారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వంద గజాల వరకు ఉన్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఖాళీ స్థలాలు, సొసైటీ భూములు, రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములనుక్రమబద్దీకరించాలన్నారు. అప్పుడే పంచగ్రామాల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు. అలా కాకుండా కేబినెట్‌లో ప్రకటించిన విధంగా ముందుకు వెళితే కేవలం ప్రజల నుంచి డబ్బు గుంజుకుని ఖజానా నింపుకోడానికే అని సిపిఎం భావిస్తోందన్నారు. ఈ సమస్యను సృష్టించింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలను, మరమ్మతులను అడ్డుకుందన్నారు. 20 ఏళ్లుగా పంచగ్రామాల ప్రజలను హింసించారన్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా అసమగ్రంగా పరిష్కరించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసముంటున్న వారిని అక్రమణదారులుగా పేర్కొనడాన్ని తప్పుపట్టారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కుని రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, డాక్యుమెంట్లు కలిగిన వారిని మళ్లీ ఇప్పుడు మార్కెట్‌ విలువతో పాటు వడ్డీ కట్టాలని చెప్పడం దారుణమన్నారు. అసలు ఈ భూములు ప్రభుత్వ భూములేనని తెలిపారు. 1996 వరకు లేని సమస్యను సృష్టించిన ఆనాటి టిడిపి ప్రభుత్వం 2000 సంవత్సరంలో 508 జిఓ జారీ చేసి డబ్బులు చెల్లించి ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. 2008 దేవస్థానం చేసిన సర్వే తప్పుల తడక అని సిపిఎం నగర కార్యదర్శి బి.గంగారావు అన్నారు. అదే ప్రాంతాల్లో మరో 5 లేదా 6 వేల మంది నివాసదారులు ఉన్నారన్నారు. విసిగిపోయిన ప్రజలు ఎలాగైనా రెగ్యులర్‌ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని, వారి బలహీనతను ఆసరా చేసుకుని డబ్బులు గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.