రైతాంగ సమస్యలను పరిష్కరించాలి

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అనంతపురం (ఉత్తర) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం ప్రారంభమైన 30 గంటల సత్యాగ్రహం మంగళవారం ఉద్రిక్తత నడుమ ముగిసింది. పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లక్ష సంతకాలతో కూడిన రైతుల వినతి పత్రాలను పోలీసులు నేలపాలు చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.పెద్దిరెడ్డి, ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. రైతు సత్యాగ్రహం వేదిక వద్దకు వచ్చి స్వయంగా లక్ష సంతకాల వినతి పత్రాలను అందుకుంటానని పోలీసుల ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ముందుగా సందేశం పంపించారు. కానీ శిబిరం వద్దకు రాకుండానే ఆమె కలెక్టర్‌ కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. దీంతో రైతుల నుంచి సేకరించిన లక్ష సంతకాలను ఆమెకు, కలెక్టరుకు అందజేయడానికి నాయకులు, కార్యకర్తలు లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. నాయకుల వద్దనున్న వినతి పత్రాలను పోలీసులు బలవంతంగా లాగి కింద పడేయడంతో కలెక్టరేట్‌ ప్రాంగణమంతా చెల్లాచెదురుగా ఎగిరి పోయా యి. వాటిని ఏరుతున్న నాయకుల పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. స్టేషన్లకు తరలిం చిన నాయకులు, కార్యకర్తలను అనంతరం విడుదల చేశారు.