రెండేళ్లయినా ఏవీ అభివృద్ధి పనులు

 (విశాఖ రూరల్)            ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదని సిపిఎం జిల్లా నాయకులు జి.కోటేశ్వరరావు విమర్శించారు. నర్సీపట్నంలో డివిజన్‌ స్థాయి సిపిఎం కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు గిట్టుబాటు ధర కల్పించ లేదని, కార్మికులకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేదన్నారు. బ్రాండిక్స్‌ కంపెనీలో కనీస వేతనాలు ఇవ్వాలని, నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. 12 గంటలు పని చేయించుకొని కేవలం రూ.4వేలు మాత్రమే వేతనం ఇస్తుండటంతో బ్రాండిక్స్‌ కార్మికులు ఆందోళనకు దిగారన్నారు. ఈ విషయమై కార్మికశాఖ, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదన్నారు. కష్టపడి పని చేసిన వారికి సాయం అందించని ప్రభుత్వం వేల కోట్ల రాయితీలను కార్పొరేట్‌ సంస్థలకు ఇస్తుందని పేర్కొన్నారు. సిఎం జపాన్‌, సింగపూర్‌ పర్యటనలు చేపట్టడం తప్పా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించ లేదన్నారు.రాజధాని నిర్మాణానికి సమగ్రమైన ప్రణాళిక లేదన్నారు. రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇందుకు రైతుల వద్ద తీసుకున్న భూములకు సబంధించి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రాజధాని ప్రాంతంలో పంటలు పండే భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందన్నారు. జిల్లాలో పంటలు పండించు కోవడానికి సాగునీరు అందని పరిస్థితి నెలకొందని, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిం చ లేదన్నారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధి చేస్తామని చెబుతున్న చంద్రబాబు పేదల సమస్యల పరిష్కారాన్ని విస్మరిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు ఆచరణలో అమలు చేయలేదన్నారు. జిల్లాలో రాబోయే కాలంలో వేల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమల నిర్మాణాలకు భూములను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తహ తహ లాడుతున్నారని విమర్శించారు. ఏడాది దాటుతున్నా టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. బడ్జెట్‌లో కూడా పెట్టుబడిదారుల కే రాయితీలు కేటాయిస్తుందని, మిడ్డేమిల్స్‌, అంగన్వాడీ, ఆశా వంటి పథకాలపై పట్టించు కోలేదన్నారు.డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం ధనవంతులకు కోట్ల రూపాయల రాయితీ ఇస్తుందని విమర్శించారు. అంగన్వాడీ, ఆశ, మిడ్డేమిల్స్‌ ఆందోళన చేపడితే సమ స్యలను పరిష్కరించకుండా అరెస్టులు చేయించడం బాధా కరమన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయ లేదన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కార్మికుల, ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా సమస్యలను పరిష్కరి స్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, స్మార్టు విలేజ్‌లతో పేద ప్రజలకు ఏమి ఉపయోగం అని ప్రశ్నించారు. ప్రపంచ మంతా గర్వపడే విధంగా రాజధాని ఏర్పాటు చేస్తామని వేల కోట్లను ఖర్చు పెట్టటం సరికాదన్నారు. ఈ-పాస్‌ విధానం రాకతో రేషన్‌ డిపోలకు వెళ్లి సరుకులు తెచ్చు కోవాలంటేనే పేదలు భయ పడుతున్నారన్నారు. నర్సీపట్నంలో మే 22, 23 తేదీల్లో సిఐటియు పదవ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందుకు సుమారు 10వేల మంది కార్మికులు సమీకరించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.