రెండంకెల వృద్ధి సాధ్యమా..!

రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి (డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌) సాధిస్తామనీ, దానికోసం అన్ని ఏర్పాట్లూ చేశామనీ ప్రచార హోరు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తే 'ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు' ఉంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని అరికట్టలేని ప్రభుత్వం మరి రెండంకెల ప్రగతి గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? గడిచిన దశాబ ్దకాలంలో కనీసం 4 శాతం వృద్ధి రేటు సాధించలేక పోయాము. ఇప్పుడు ఏకంగా రెండంకెల ప్రగతి సాధిస్తామని చెబుతున్నారు. దేశంలో 4 శాతం వ్యవసాయ రంగం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకుం టున్నా దానిని కూడా చేరకుండా ఏయేటికాయేడు దిగజారిపోతున్నది. దేశ జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతుంటే వ్యవసాయరంగం అభివృద్ధి మాత్రం 1.1 శాతమే నమోదవుతోంది. 
అధికారంలోకి వచ్చిన వెంటనే, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాం. అభివృద్ధి సాధిస్తాం అని ప్రకటనలు గుప్పించారు. 2013-14 సంవత్సరానికి 120 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా ప్రకటించారు. అయితే, 111 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏకంగా 134 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యల ఉత్పత్తి లక్ష్యంగా ప్రకటించింది. వాస్తవానికి పరిస్థితి గతేడాది కన్నా అధ్వానంగా ఉంది. ఈ నెల 8న విజయవాడలో జరిగిన రైతుసంఘాల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి, అధికారులు రాష్ట్రంలో ఇప్పటివరకూ 28 శాతం అధిక వర్షపాతం నమోదైందనీ, వాతావ రణం అనుకూలంగా ఉందనీ ప్రకటించారు. ఒక వైపు వేసిన విత్తనాలు, మొలిచిన పైర్లు, నారుమళ్ళు నీరు లేక ఎండిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలవుతున్నా రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం 13 శాతం మాత్రమే పంటలు వేశారు. ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టులోనూ పూర్తిస్థాయిలో నీటి నిల్వలు లేవు. పంటలు వేస్తే సాగునీరు అందుతుందా అనే అనుమానం రైతాంగంలో ఉంది. గతేడాది ఉత్పత్తి కన్నా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నా, వాతావరణం అనుకూలంగా ఉందని ప్రకటించారంటేనే ప్రభుత్వ ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయని అర్థమౌతోంది. అలాంటప్పుడు రెండంకెల ప్రగతి సాధించాలంటే ఏం కావాలన్నది కీలక ప్రశ్న. వ్యవసాయ రంగం ఇప్పుడున్న దానికంటే ముందడుగు వేయాలంటే అధిక దిగుబడులు వచ్చే నూతన వంగడాలను ప్రవేశపెట్టాలి. మౌలిక వసతులు కల్పించాలి. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలు, వ్యవసాయ శాఖ నుంచి సలహాలు అందిస్తేనే అధికోత్పత్తి సాధ్యమౌతుంది. రైతులకు వ్యవసాయం మీద ఆసక్తి పెంచేలా పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు కల్పించటం ప్రభుత్వ కనీస బాధ్యత. అప్పుడే వ్యవసాయం ముందడుగు వేస్తుంది. రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది.
భూ పంపిణీ
వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించాలన్నా రాష్ట్రం ముందుకు పోవాలన్నా భూమిలేని వారందరికీ మిగులు భూమి, ప్రభుత్వ భూమి పంపిణీ చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం నిత్యం డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేస్తామని చెపుతుంటుంది. కానీ ఆ కమిషన్‌ చెప్పిన అతి ముఖ్యమైన పేదలకు భూమి పంచాలన్న సిఫార్సును మాత్రం గాలి కొదిలేసింది. రాష్ట్రంలో 73 శాతం కుటుంబాలకు ఏ విధమైన భూమీ లేదని తాజాగా విడుదలైన 'సామాజిక, ఆర్థిక సర్వే' ప్రకటించింది. రాష్ట్రంలో ఏడు విడతలుగా లక్షలాది ఎకరాలు భూమి పేదలకు పంచామని గొప్పలు చెప్పుకుంటున్న తర్వాత కూడా 73 శాతం మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయని సర్వే నిగ్గు తేల్చింది. పేదల చేతికి భూమి ఇవ్వకుండా, వారిని ఉత్పత్తిలో భాగస్వాములను చేయకుండా ఎలా అభివృద్ధి సాధించగలం? దశాబ్దాల తరబడి అటవీ భూములు, అసైన్డ్‌ భూములను వన సంరక్షణ సమితుల పేరుతోనూ, వ్యక్తిగతంగానూ పేదలు సాగుచేసుకొంటున్నారు. ఇప్పుడు పేదలను ఈ భూముల నుంచి పేదలను వెళ్లగొట్టి వాటిని కంపెనీలకూ, బాబాలకూ ఇవ్వటానికి పూనుకొంటోంది. తాజాగా కృష్ణాజిల్లాలో 60 శాతం అటవీ భూముల(85 వేల ఎకరాల)ను డీ నోటిఫై చేసి కంపెనీలకు కట్టబెట్టడానికి అత్యుత్సాహం చూపుతోంది. మరో వైపు రాజధాని నిర్మాణం, విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్ల పేరుతో లక్షలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కొని వ్యవసాయ భూములను పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు మళ్లిస్తున్నారు. ఏ ప్రాజెక్టు కిందా సాగులోకి అదనంగా భూమిని తీసుకు రావటానికి పేదలకు భూమి పంచకుండానూ, పైగా ప్రస్తుతమున్న వ్యవసాయ భూములను కూడా కాజేస్తుంటేనూ వ్యవసాయం ఎలా ముందడుగు వేస్తుంది?
సాగునీటి సౌకర్యం
2004లో జలయజ్ఞం పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికి రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా పూర్తికాని 24 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరో రూ.32 వేల కోట్లు కావాలి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కుడి కాల్వ తవ్వకానికి ఇంకా భూ సేకరణే పూర్తి కాలేదు. ఇవిగాక హంద్రీ నీవా, గాలేరు-నగరి వంటి మధ్యతరహా ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. ఈ బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించారు. ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేము. కోస్తా ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వం నిర్వహణా బాధ్యత నుంచి తప్పుకోవటంతో ఎత్తిపోతల పథకాలు మూలబడుతున్నాయి. సాగునీటి సౌకర్యం పెరగకుండా దిగుబడులు ఎలా పెరుగుతాయో ముఖ్యమంత్రిగారే చెప్పాలి. 
విత్తనాలు-ఎరువులు
విత్తనాలు, ఎరువులు తయారీలో ప్రభుత్వ సంస్థలను మూసివేసి దాన్ని బహుళజాతి సంస్థలకు అప్పగించారు. ప్రతి ఏటా రాష్ట్రంలో సుమారు 2-3 లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఈ నకిలీ విత్తనాల్ని అరికట్టి రైతుకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ విత్తన చట్టాన్ని చేయలేదు. మాన్‌శాంటో కంపెనీ కిలోకు రూ.90 రాయల్టీ రూపంలో వసూలు చేస్తుంటే దాన్ని అడ్డుకొనే ధైర్యమూ, చిత్తశుద్ధీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో 13 పరిశోధనా కేంద్రాలు, వాటి కింద 3 వేల ఎకరాలు భూమీ, శాస్త్రవేత్తలూ ఉన్నారు. అయినా పరిశోధనా కేంద్రాలను మూసివేసి విత్తన తయారీకి ఇతర దేశాల టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు. అవి మన వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఉండటంలేదు. విత్తనాల్లో మాన్‌శాంటో, కార్గిట్‌, సింజెంటా, డూపాంట్‌ వంటి సంస్థలు గుత్తాధిపత్యం కొనసాగుతున్నది.
రుణాలు
సక్రమంగా పంటలు పండించటానికి రైతులకు రుణాలు అవసరం. కానీ రాష్ట్రంలో ఏనాడూ రైతాంగానికి అవసరమైన పంట రుణాలు అందిన చరిత్ర లేదు. చంద్రబాబు రుణమాఫీ పుణ్యమా అని గతంలో ఇచ్చే కొద్దిపాటి రుణాలు కూడా అందకుండా పోయింది. గతేడాది రూ.59 వేల కోట్లు పంట రుణాలు ఇస్తామని చెప్పి 40 శాతం కూడా రుణాలివ్వలేదు. వాస్తవానికి మన రాష్ట్రంలో పంటలు పండించే వారికి (వాస్తవ సాగుదారులకు) రుణాలు అందటంలేదు. రుణమాఫీ పథకం వల్ల బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వటం లేదు. మరో వైపు ప్రభుత్వం మాఫీ చేసిన దాని కంటే రైతులు వడ్డీ రూపంలో ఎక్కువ నష్టపోయారు. రెండు విడతల్లో రూ.7 వేల కోట్లు కేటాయిస్తే రైతులు వడ్డీ కింద రూ.8,700 కోట్లు బ్యాంకులకు చెల్లించారు. 
మార్కెట్‌ - గిట్టుబాటు ధరలు
పండించిన పంటకు మార్కెట్టు, గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతులు మార్కెట్‌లో నష్టపోకుండా ఉండాలంటే మార్కెట్‌ చట్టాలను పటిష్టం చేయాలి. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తిరోగమన మార్గంలో వెళ్తోంది. ఉన్న మార్కెట్లను కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చేయడానికి చట్టాలను మార్పు చేస్తోంది. ఇదే జరిగితే రానున్న కాలంలో వ్యాపారులు చెప్పుచేతల్లోనే మార్కెట్‌ ఉంటుంది. పెట్టుబడికి అదనంగా 50 శాతం (సి2+50) కలిపి మద్దతు ధర నిర్ణయించాలని కమిషన్లు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం ధాన్యానికి రూ.1,450, పత్తికి రూ.4,100 మద్దతు ధరలుగా ప్రకటించింది. కమిషన్లు చెప్పినట్టు పెట్టుబడికి అదనంగా 50 శాతం కాదు కదా ఈ ఏడాది ప్రకటించిన మద్దతు ధరలు కనీసం 20 శాతం కూడా లేవు. కొన్ని రాష్ట్రాల్లో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్‌లు చెల్లిస్తున్నాయి. మన రాష్ట్రంలో అది కూడా నోచుకోలేదు. పెట్టుబడులు గిట్టుబాటవ్వని స్థితిలో ఏ ఉత్సాహంతో రైతులు అధిక ఉత్పత్తి కోసం కృషి చేయాలి? 
రైతు కేంద్రంగా మొదటి హరిత విప్లవం జరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో లోటు నుంచి స్వయం పోషకంగా ఎదిగాము. 1995 నుంచి రైతును విస్మరించి కార్పొరేట్‌ కంపెనీల కేంద్రంగా రెండవ హరిత విప్లవాన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు కట్టబెట్టేలా వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చటం. ఇది వ్యవసాయం కోసం రైతులను ప్రోత్సహించటం కాకుండా ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తోంది. మౌలిక అంశాల్లో మార్పు రాకుండా 'పొలం పిలుస్తోంది', 'చంద్రన్న రేతు క్షేత్రం' వంటి కార్యక్రమాలు ప్రచారానికే తప్ప ఆచరణలో లక్ష్యాలు సాధించలేవు. ఈ పద్ధతిలో రెండంకెల ప్రగతి అసాధ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని గుర్తించి విధానాల్లో మార్పు చేస్తేనే వ్యవసాయంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలనూ, వ్యవసాయ సంక్షోభాన్నీ పక్కదారి పట్టించేందుకే ఈ రెండంకెల ప్రగతి నినాదం అందుకొన్నారని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ప్రత్యామ్నామ విధానాల కోసం రైతాంగ ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదు. ఆ ఉద్యమాలే వ్యవసాయ రంగాన్ని రక్షించుకోగలవు, రైతును కాపాడగలవు.
- జె.ప్రభాకర్‌ 
(వ్యాసకర్త ఎపి రైతు సంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి)