రూ.14 కోట్ల బకాయిలు చెల్లించండి..

అనంతపురం జిల్లా పాల ఉత్పత్తిదారులకు ఏపి పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. సేకరణ ధర తగ్గింపును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. వరుస కరవులతో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా లో ఆత్మహత్యలు, వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత, పాడి పరిశ్రమ ప్రధాన జీవనా ధారంగా ఉందన్నారు. జిల్లాలో ప్రతి రోజూ ఐదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుందని, వీటిలో 85 వేల లీటర్లను మాత్రమే ఏపి డెయిరీ సేకరిస్తోందని తెలిపారు. మిగిలిన పాలు హైదరాబాద్‌, ఒంగో లు ప్రాంతాలకు ప్రధానంగా ఎగు మతి అవుతున్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పాల మార్కెట్‌ను పెంచు కునేందుకు చర్యలు తీసుకో కపోవడం, రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాల అమ్మకం సంక్షోభంలో పడిందన్నారు.