రూ.కోట్లు తెచ్చినా జాడలేని అభివృద్ధి

భట్టిప్రోలుకు కోట్లాడి రూపాయాలు తెచ్చామని చెబుతున్నా అభివృద్ధి జాడ మాత్రం లేదని సిపిఎం పాదయాత్ర బృందం పేర్కొంది. ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండల కేంద్రమైన భట్టిప్రోలుతోపాటు అద్దేపల్లి, అక్కివారిపాలెం, పెదపులివర్రు, గొరికపూడి, కోళ్లపాలెం, ఓలేరు గ్రామాల్లో సాగింది. శ్మశాన వాటికలు, నివేశనా స్థలాల సమస్యలు మరీ దుర్భరంగా ఉన్నాయని ఆయా గ్రామాల వారు పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. భట్టిప్రోలు, అద్దేపల్లిలో మురుగునీటి పారుదలకు డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదని, మురుగునీరి రోడ్లపైకి వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు. ఎస్‌టి కాలనీలో ఒక్క ఇంటిలోనే రెండుమూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, కాలనీ పక్కనే నిరుపయోగంగా ఉన్న పంచారయతీ చెరువును కేటాయించాలని కోరారు. అద్దేపల్లి ఎస్‌సి కాలనీ నుండి సర్పంచ్‌, మండల ఉపాధ్యక్షులు, ఇద్దరు వార్డు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నా తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారని, ఏళ్ల తరబడి అనేక సమస్యలు పట్టిపీడిస్తునాయని బృందానికి తమగోడు వెళ్లబోసు కున్నారు. అనంతరం బృందం స్థానిక స్టేట్‌బ్యాంక్‌ వద్దకు వెళ్లి నగుదు మార్పిడి కోసం జనం పడుతున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కౌంటర్లు పెంచాలని కోరగా బ్యాంకర్లు సానుకూలంగా స్పందిం చారు.