రాష్ట్రం పట్ల ఎందుకీ వివక్ష?

మొన్నటికి మొన్న రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం, నిన్న జనరల్‌ బడ్జెట్‌లోనూ అదే తీరున వ్యవహరించింది. రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకింత వివక్ష? రాష్ట్రంలో వున్నది తన మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమానా? లేక ఆంధ్రప్రదేశ్‌ అంటే ఖాతరులేనితనమా? కేంద్రం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఒక ఎత్తు అయితే, ఇది అన్యాయమని తెలిసినా నోరు మెదపకుండా మిన్నకుండిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత మరో ఎత్తు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి తరువాత మాట్లాడతానని చెప్పడం శోచనీయం. ఇప్పుడు ప్రశ్నించకుండా తరువాత ఎప్పుడో మాట్లాడి ఉపయోగమేమిటి? దేశంలోకెల్లా అత్యంత సమర్థతకలిగిన ముఖ్యమంత్రినని తనకు తానే భుజకీర్తులు తగిలించుకునే చంద్రబాబు ఈ విషయంలో ఎందుకింతఅసమర్థంగా వ్యవహరిస్తున్నట్లు? బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీస్తే చెలిమి ఎక్కడ చెడిపోతుందోనని భయపడుతున్నట్లుంది. ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని ఎవరూ కోరడం లేదు. విభజన చట్టంలోను, విభజన సందర్భంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారు. దీనిపై తటపటాయించాల్సిన పనే లేదు. విభజన సందర్భంగా నవ్యాంధ్ర ప్రదేశ్‌కు అయిదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆనాటి ప్రభుత్వం అంటే కాదు, పది సంవత్సరాలు ఇవ్వాల్సిందేనని బిజెపి పట్టుబట్టింది. ఆ తరువాత ఎన్నికల ప్రచార సందర్భంగా నరేంద్ర మోడీ ఈ ప్రత్యేక హోదా గురించి లెక్కలేనన్ని సార్లు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని గోదారిలో కలిపేశారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి రెవిన్యూ లోటు భర్తీ వరకు అన్నింటా ఇదే వరస. ఎంతో ఆశగా ఎదురుచూసిన విశాఖ రైల్వే జోన్‌పై రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపింది. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా గురించి జైట్లీ బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేము అంతకన్నా బ్రహ్మాండమైన ప్యాకేజీని ఇస్తామని ఇంతవరకు ఇస్తూ వచ్చిన హామీని కూడా విస్మరించారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణానికి నాలుగు వేల కోట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఈ బడ్జెట్‌లో వంద కోట్లు మాత్రమే విదిలించింది. 18 వేల కోట్ల వ్యయం కాగల ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు వంద కోట్లు ఏమూలకు సరిపోతాయి? ఈ తీరున నిధులు కేటాయింపు వుంటే ఆ ప్రాజెక్టు వందేళ్లయినా పూర్తికాదు. గంగా నది ప్రక్షాళనకు 16,010 కోట్లు కేటాయించిన కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకు ఏదో భిక్ష వేసినట్లుగా ఇచ్చింది. ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన అమరావతి నిర్మాణం ఊసే లేదు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు మూడు లక్షలిచ్చి కేంద్రం మనల్ని వెక్కిరించింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 6,770 కోట్లు. మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఎయిమ్స్‌కు ఈ బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయిస్తే ఒట్టు. గిరిజన యూనివర్సిటీ, పెట్రోలియం వర్శిటీలకు కూడా అరకొర కేటాయింపులతోనే సరి. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టే, ముఖ్యమంత్రి మోడీ చుట్టూ గత రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. అయినా కేంద్రం అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి మంత్రిపదవులు వెలగబెడుతున్న తెలుగుదేశం నేతలు దీని గురించి నోరు విప్పకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరామని చెప్పిన చంద్రబాబు రాష్ట్రానికి సాధించింది ఏమిటి? కేంద్రానికి కోపం వస్తుందని చెప్పి హెచ్‌సియు, జెఎన్‌యులపై ఆరెస్సెస్‌, బిజెపి దాడులపై దేశమంతా ఆందోళన వ్యక్తం చేసినా తెలుగుదేశం మాత్రం బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులపై దాడి చేస్తుంటే దీనిపై ఇంకా మౌనం వహించడం వివేకమనిపించుకోదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్లిప్త వైఖరి విడనాడాలి. విభజన చట్ట హామీలను, కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాను రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అన్ని రాజకీయపార్టీలను కలుపుకుని కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. అదే సమయంలో పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎన్డీయే ప్రభుత్వంతో చెలిమికన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అని చంద్రబాబు ప్రభుత్వం నిజంగా భావిస్తే ఈ అన్యాయంపై అమీతుమీకి సిద్ధం కావాలి. ఆ పని చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇంకేమి చెప్పినా రాష్ట్ర ప్రజలు విశ్వసించరు.