రాష్ట్రంలో రాహుల్ పర్యటన

 ఆత్మహత్యలకు పాల్పడ్డ అనంతపురం రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అడ్డుకోవటానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుహెచ్చరించారు. హైదరాబాద్‌లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తగిన శాస్తితప్పదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా తమ జాగీరుకాదన్న నిజాన్ని గ్రహించి జాగ్రత్తగా మసులుకోకపోతే పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సొదరుడు ప్రభాకర్‌రెడ్డితీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుందని విహెచ్ హెచ్చరించారు. పార్టీ చంద్రబాబు టిడిపి ప్రజాప్రతినిధులను అదుపుచేయాలని ఆయన సలహా ఇచ్చారు. జాతీయ నాయకుడైన రాహుల్‌గాంధీ దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అన్నారు. రాహుల్ అనంతపురంలో రైతులను పరామర్శించి రైతుల అత్మహత్యలపై పార్లమెంటులోప్రస్తావిస్తే రైతాంగానికి లాభం కలుగుతుందని హనుమంతరావుఅభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నాయకురాలిగా సోనియాగాంధీ గతంలో అనంతపురంలో పర్యటించి ఆత్మహత్యలకు పాల్పడిన రైతుకుటుంబాలను ఆదుకున్నప్పుడు జెసి సోదరులు కాంగ్రెస్‌లోనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. జెసి సోదరుల వల్ల రాహుల్ పర్యటనలో ఏ మాత్రం అపశ్రుతి దొర్లినా అందుకు తెలుగుదేశం అధినేత బాధ్యత వహించటంతో పాటు హైదరాబాద్‌లో ఇబ్బందికర పరిస్థితి తప్పదని ఆయన చెప్పారు. కాగా ఏపిలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు, ప్రతిపక్ష నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు.