భారత్ ''భిన్నత్వంలో ఏకత్వం'' ఉన్న దేశం. మన గొప్పతనానికి, ప్రజల ప్రశాంత జీవనానికి అదే కారణం. భిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కతుల మధ్య భాసిల్లిన భారతీయతకు ఇప్పుడు భంగం వాటిల్లింది. ''రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాక పోతే అది చెడుగా మారు తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచి వారైతే మంచిదిగా మారుతుంది'' అని డాక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం భారత దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. లౌకికవాదానికి నిఘంటువులు ''ఈ భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికం కాని, మతాతీతమైన'' అనే అర్థాలనిచ్చాయి. ఎఆర్ బ్లాక్ షీల్డ్ నిర్వచించినట్లు లౌకికవాదమంటే మత స్వేచ్ఛ, హేతువాదం, భౌతికవాదం, మానవతావాదాల పట్ల సహనం, గౌరవం. ''లౌకిక దేశం తన పౌరులకు మత స్వేచ్ఛనిస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఒక మతానికి చెందదు. మతంలో జోక్యం చేసుకోదు. మతాన్ని ప్రోత్సహించదు'' అని డొనాల్డ్ యూజిన్ స్మిత్ లౌకిక దేశాన్ని నిర్వచించారు. అయితే ''భారత రాజ్యాంగంలో మనదని చెప్పుకోదగ్గ అంశమే లేదు. మనుస్మతి ప్రపంచ సమ్మతిని, ప్రశంసలను పొందింది. యాదచ్ఛిక విధేయతను, అనుగుణ్యతను సంపాదించింది'' అని గోల్వాల్కర్ అన్నారు. అందుకేనేమో రాజ్యాంగంలోని అధికరణ 1(1) భారత దేశం రాష్ట్రాల సమాఖ్య, 19(1) భావ ప్రకటనా స్వేచ్ఛ, 25(1) మత స్వేచ్ఛ, 51(1)(హెచ్) శాస్త్రీయ దక్పథం లాంటి అనేక అధికరణలను గోల్వాల్కరీయుల ప్రభుత్వం అనేక సందర్భాల్లో ధిక్కరించింది. రాజ్యాంగ తిరస్కారం ప్రజాస్వామ్యానికి, భారత ప్రజానీకానికి తీరని అవమానం.
రాజ్యంలో మతం
'సత్యశోధనలకు దొరకని, జ్ఞానేంద్రియాల అనుభవాలకు అందని భావాలతో అనుసంధానం, పునరనుసంధానం కలిగించేది మతం' అని భావవాదులంటారు. నిజానికి మతం అంటే 'అభిప్రాయం' అని అర్థం. జ్ఞానం వికసించని రోజుల్లో, మూఢ విశ్వాసాలు ప్రజల జీవితాలలో విడదీయరాని భాగమైన దినాలలో ఏర్పడిన విశ్వాసాల విధానమే మతం. తర్వాతి రోజుల్లో జ్ఞానం అబ్బిన, అసలు సంగతులు అవగతమైన మతాధిపతులు, రాజులు, ధనాఢ్యులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి మతాన్ని ఆసరా చేసుకున్నారు. సామాన్యులను, శూద్రులను, స్త్రీలను మత గ్రంథాలకు దూరంగా ఉంచారు. ''రాజకీయాల, సామాజికాంశాల, భావోద్వేగాల దోపిడీ సాధనంగా మతాన్ని విశ్వవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ మతాన్ని ఏదో ఒక 'నిగూఢ ఉద్దేశం'తో ఆచరిస్తున్నారు'' అని శాంతినికేతన్‌లోని స్వామి వివేకానంద శిష్యుడు మార్టిన్ కాంప్ చెన్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ''ప్రవర్తన, ఆలోచనల రక్షణ'' మంత్రిత్వ శాఖ(!?) ద్వారా తన ''భారతీయ సంస్కతి''ని అమలు చేయాలని ఆలోచిస్తున్నది. ఈ పేరుతో హిందూ సంస్కతిని రుద్దడం, అగ్రవర్ణ, పెట్టుబడిదారీ, బహుళ జాతి సంస్థల దోపిడీలకు అడ్డంకులను తొలగించి, కొనసాగించుకునే అవకాశాలను మెరుగుపరచడం అసలు ఉద్దేశం.
మతంతో రాజకీయం...
నిక్షిప్త నిధుల కోసం మతారాధన మందిరాలపై మతాలతో సంబంధం లేకుండా దాడులు, దోపిడీలు జరిగాయి. ఒక మతస్తులపై మాత్రమే ఆరోపణలు చేయడం రాజకీయమే. షా బానో కేసులో ''ముస్లింలైనా సరే విడాకులిచ్చిన భార్యలకు మనోవర్తి చెల్లించవలసిందేనని'' సుప్రీంకోర్టు 1985 ఏప్రిల్ 23న చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజకీయ ప్రయోజనం కోసం రాజీవ్ గాంధీ చట్టం ద్వారా ఆ తీర్పును రద్దుచేశారు. బాబ్రీ మసీదును కూలుస్తున్నా ఊరకున్న నరసింహారావు, ఆ కేసులో బాధ్యులైన అద్వానీ, ఉమా భారతి, కల్యాణ్ సింగ్‌ను ఊహాత్మకంగా తప్పించిన సంఘ పరివారీయులు, ఉలుకూ పలుకూ లేకుండా మిన్నకుండిన కాంగ్రెసీయులు రాజకీయ చతురులే. బొంబాయి అల్లర్ల ఘటనలో శ్రీకష్ణ కమిటీ నివేదికలను బుట్ట దాఖలు చేయడం, గుజరాత్ మారణకాండలో మంత్రులు, ముఖ్యమంత్రులను తప్పించడం రాజకీయమే. మతవాదులైన అధికారులు, రాజకీయ నాయకులు తమ మతస్తులలో పేదరికాన్ని నిర్మూలించాలని ఎందుకు ప్రయత్నించరు? అలా చేస్తే మతాలయాల దగ్గర ముష్టివాళ్ళుండరు కదా? ప్రతి మతంలోనూ అత్యధికులు అధోగతిలో ఉండటమే అల్ప సంఖ్యాక అధినాయకులకు ఉపయోగం.
పరిపాలనలో మత భావాలు
''విజ్ఞాన శాస్త్రాలను'' బోధించని మదరసాలను, హిందువులు, క్రైస్తవులు మదరసాలలో చదవడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఉర్దూ మాధ్యమ పాఠశాలలను గుజరాత్ ప్రభుత్వం మూసేసింది. హిందూ విద్యార్థులకు కాషాయ రంగు, ముస్లిం విద్యాలయాలలో ఆకుపచ్చ రంగు యూనిఫారాలను కేటాయించింది. లౌకిక విలువలను బోధించే ''జాతీయ పాఠ్యక్రమాన్ని'' ప్రవేశ పెట్టిన పాపానికి ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ పర్వీన్ సింక్లెయిర్‌ను పదవి నుంచి తొలగించారు. ఆమె ప్రవేశపెట్టిన లౌకిక విద్యా విధానానికి మంగళం పాడారు. మహారాష్ట్రలో ప్రజా ఉద్యమ నాయకుడు గోవింద్ పన్సారేను చంపింది హిందూత్వ 'సనాతన సంస్థ' అని సిబిఐ తెలిపింది. దాభోల్కర్, కల్బుర్గి హత్యలు కూడా వీరి చేతి వాటమేనని వారి అనుమానం. మధ్య గోవాలోని బందోరా గ్రామం కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థను గోవా మంత్రి సుధీన్ ధవలీకర్, ఆయన సోదరుడు దీపక్ అన్ని విధాలా సమర్థించి పోషిస్తున్నారు. ఆయన భార్య జ్యోతి, దీపక్ భార్య లత ఈ సంస్థలో ''సాధకులు''. పేదల బలవంతపు మతమార్పిళ్ళు, మత మూఢ విశ్వాసాల ఆచరణలు, పురాణాలను, గాథలను యదార్థాలని ప్రచారంచేయడం, సమాజ ప్రయోజకులను హత్య చేయడం వంటి మార్గాలను సంఘ పరివారీయ ప్రభుత్వం ఆచరిస్తున్నది. సంఘ పరివారీయ అధినాయకుడు మోహన్ భగవత్ ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు హిందువులేనన్నారు. పరమత ప్రార్థనాలయాల జాబితాను తయారు చేసి ఇవి హిందూ దేవాలయాలేనన్నారు. కొన్ని పుస్తకాలను, చిరుచిత్రాలను, సినిమాలను బహిష్కరించారు. ఎవరిని ప్రేమించాలో, పెళ్ళిచేసుకోవాలో ఆదేశించారు. యువతులు, మహిళలు ఫలానా బట్టలే వేసుకోవాలన్నారు. ఫలానా చోట ఫలానా మతస్తులు ఇల్లు కొనరాదు, అద్దెకుండరాదన్నారు. ఏ మతస్తులేమి తినాలో కూడా నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ దాద్రిలో గొడ్డు మాంసం తెచ్చుకున్నాడన్న పుకార్లతో ఒక వ్యక్తిని 2015 సెప్టెంబర్ 27న ఇటుకలతో కొట్టి చంపారు. ఇంతకూ వాళ్ళు గొడ్డు మాంసం తెచ్చుకోనేలేదు.
చరిత్ర పుస్తకాలను తమకు అనుకూలంగా మార్చి రాయిస్తున్నారు. ''దైవ'' భాష పేరుతో సంస్క తాన్ని ప్రోత్సహిస్తున్నారు. రామ రాజ్య స్థాపనే తమ లక్ష్యమంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేయాలని, ప్రజలందరికీ ''మతాతీతంగా'' ఒకే పౌర నిబంధనావళిని అమలు చేయాలని, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని ఎన్నికల ప్రణాళికలోనే పొందుపరిచి, ప్రచారం చేసి, ఓట్లు పొంది అధికారం చేపట్టారు. ఘర్ వాపసి, లవ్ జిహాద్, గోరక్ష, దేవాలయ పరిరక్షణ, రోడ్లకు ముస్లింల పేర్లు మార్చి హిందూ మతవాదుల పేర్లు పెట్టడం, గాంధీ హంతకులను దేవుళ్ళుగా కీర్తించి గుళ్ళు కట్టడం మొదలగు ఎన్నో పనులు చేశారు. కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు అనేక సందర్భాల్లో పరమతస్తులను దూషించారు. తమకు ఓటు వేయని వారు అక్రమ సంతానమని, హిందువులు కారని, పాకిస్తాన్‌కు పొమ్మని రెచ్చగొట్టారు. ఆది నుంచి ఆ ''మతానికే'' చెందిన ప్రధాని మౌన వ్రతం పాటించడం ప్రపంచం గమనించింది. గుజరాత్‌లో లేవదీసిన అగ్రవర్ణ రిజర్వేషన్ ఉద్యమం ఈ ఉన్మాదులు నాటిన బీజమేనని విజ్ఞుల అనుమానం. మోహన్ భగవత్ వ్యాఖ్యలు, సంఘ పరివారీయ ''ద్వితీయ ప్రయోగశాల'' రాజస్థాన్‌లో ఈ దిశలో చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించమని కోరడం ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ ప్రక్రియ దేశమంతా వ్యాపించే అపాయముంది. ఇది దళిత, మైనారిటీల మీద దాడి. అగ్రవర్ణ ఆధిపత్య పున్ణప్రతిష్టాపనకు దారి. రాజకీయ, ప్రజాస్వామిక, పౌర స్వేచ్ఛల, హక్కుల హరణం. దేశ సమైక్యత, సమగ్రతలకు పెనుముప్పు. రాజ్యాంగాన్ని అవమానపరచిన ఈ నాయకులకు పాలనార్హతలున్నాయా? ''మన'' మంత్రుల వ్యాఖ్యానాలు రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదాన్ని సమర్థిస్తున్నాయా లేక ఒక మతానికి కొమ్ముకాస్తున్నాయా? తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే ప్రక్రియలలో ఎంత విలువైన జాతి సంపద నష్టమైనా, ఎన్ని నిండు ప్రాణాలు బలయినా వీరికి లెక్కలేదు. ఆలోచన తగ్గితే హింస, అరాచకత్వం పెరుగుతాయి. ఆలోచనను తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రజలను మత్తులో ముంచుతున్నాయి. ఇందుకు ఎంచుకున్న ప్రధాన మార్గాలలో మతం ఒకటి. తరతమ భేదాలతో మతాలన్నీ ఒకటే. మత్తుతో అజ్ఞానం, మూఢత్వం, దానవత్వం విజంభిస్తాయి. రాజ్యంలో మతం రాజ్యమేలితే... రాజ్యం మతోన్మాదానికి మద్దతునిస్తే... అగ్నికి ఆజ్యం తోడై విజంభించినట్లు రాజ్యం మత రాజకీయంతో విశంఖలమైతే మానవ మనుగడ మనగలదా? దీనికి జవాబు, ''మా ఆజ్ఞలను అమలుచేయక పోతే మీకు చావే గతి'' అన్నట్లున్న హింసా, దుర్మార్గాలు రాజ్యమేలుతున్న భారతంలోని ప్రస్తుత పరిస్థితులే.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
(వ్యాసకర్త అఖిల భారత అభ్యుదయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)