రాజధాని హామీలన్నీ నీటిమూటలే

ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయని దీనికి ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిదర్శనమని సిపిఎం రాజధాని కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజధానికి భూమి సమీకరణ క్రమంలో వ్యవసాయ కూలీలందరికీ రూ.2500లు పెన్షన్‌ అందిస్తామంటూ పేర్కొన్నారని, కానీ అందరికీ ఆయా పెన్షన్లు అందడంలేదని చెప్పారు. కేజీ టు పిజి ఉచిత విద్యను అమలుచేస్తానని చెప్పిన పాలకులు ఎక్కడ అమలుచేశారంటూ ప్రశ్నించారు. కేవలం మాటల గారడీ తప్పా ఆచరణలో కార్యాచరణ మాత్రం లేదన్నారు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంటర్‌లో 78శాతంతో పాసైన ఒక విద్యార్థినీ పాదయాత్ర బృందం ఎదుట చదువు మానివేయాల్సిన పరిస్థితులను వివరించిన తీరును ఆయన చెప్పారు. రాజధాని భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లకేటాయింపులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని, కొండవీటివాగు ముంపునకు గురయ్యే ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపు తగదని పేర్కొన్నారు. గ్రామ కంఠాల సమస్యను నేటికి తేల్చకపోవడం కారణంగా గ్రామస్తులు ఇంకా ఆందోళనలోనే కొనసాగుతున్నారన్నారు. కృష్ణాయపాలెంలో డంపింగ్‌యార్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించడాన్ని తప్పు పడుతూ గ్రామస్తులంతా పాదయాత్రకు వివరించారు. గ్రామానికి మూడువైపులా శ్మశానవాటికలు వస్తాయంటూ చూపిన ప్లానును, కమ్యూనిటీ హాలు కోసం 15సంవత్సరాల క్రితం తీసుకున్న స్థలంలో నేటికి హాలు నిర్మాణం చేపట్టకుండా దళితుల పట్ల వివక్ష చూపడాన్ని కాలనీవాసులు బృంద సభ్యులకు వివరించారు.