రాజధాని రాజకీయ క్రీడలో చంద్రబాబు..

మిగిలిన విషయాలెలా ఉన్నా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం దీర్ఘ కాల దృష్టితో జరగాల్సిన చారిత్రిక వ్యవహారం. అందులోనూ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రజా రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటికి రెండుసార్లు ప్రకటించి ఉన్నారు. కానీ ఆచరణలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలనూ, ప్రజల్లో పనిచేసే పార్టీలనూ ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోని ఏకపక్ష తతంగంగా నడుస్తున్నది. ఆఖరుకు తన మిత్రపక్షాలనూ, స్వంత పాలకపక్ష ప్రముఖులనూ, ప్రభుత్వ నిర్వహణకు ప్రాణవాయువు లాటి ఉద్యోగ అధికార వర్గాలను కూడా తికమక పెట్టేదిగా మారింది. రాజధానికి ఎంపిక చేసిన అమరావతికి ఏ పార్టీ అభ్యంతర పెట్టకపోయినా అక్కడ జీవించే రైతుల, గ్రామీణ పేదల, శ్రామికుల ఘోషను కూడా పట్టించుకోని విపరీత స్థితి. కాగా పోగా తన షూటింగులు తాను చేసుకుంటూ అడపాదడపా భూ సేకరణ గురించి ట్వీట్లు ఇచ్చే పవన్‌ కళ్యాణ్‌కు(ఆయన ఆ మేరకైనా మాట్లాడ్డం మంచిదే) మాత్రం మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు వరుసగా జవాబులి స్తుంటారు. అమరావతి నగరంలో అపురూప లాభాలు పోగు పోసుకునే అవకాశం అస్మదీయులకు మాత్రమే దక్కాలంటే ఈ గోప్యత తప్పని సరి అని ఆయన భావిస్తున్నారు. 
2013 భూ సేకరణ చట్టం ప్రకారమైతే స్థానికుల అనుమతి, నాలుగు రెట్ల నష్టపరిహారం తప్పని సరి కాబట్టి దాన్ని పక్కన బెట్టి భూ సమీకరణ పేరిట రకరకాల ఒత్తిళ్లు పెట్టి, లేనిపోని ఆశలు చూపించి 30 వేల ఎకరాల వరకూ సంపాదించారు. ఈ లోగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టానికి సవరణలతో ఆర్డినెన్సు తెచ్చింది గనక దాన్ని కూడా ఉపయోగించుకున్నారు. సిపిఎం, వామపక్షాలు, వైసీపీ, రైతు సంఘాలు, స్థానిక వేదికలు ఎన్ని రకాల నిరసనలు తెలిపినా పట్టనట్టు వ్యవహరించారు. అదే పనిగా సింగపూర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్లానులంటూ కొన్ని పట్టుకొచ్చారు. దమ్మిడీ ఖర్చు లేకుండా సామ, దాన, భేద, దండోపాయాలతో సమీకరించిన భూమిలో మూడో వంతు వరకూ అప్పనంగా విదేశీ సంస్థలకు, వాటి బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ ముసుగులో పాలక పక్ష ప్రముఖులూ, వారి సన్నిహితులూ వేల ఎకరాలు ముందస్తుగా కొని పెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం నడపడానికి అవకాశమిచ్చారు.

వాతావరణం తీసుకురావడం కోసం భూమిపూజ అనీ, దున్నడం అనీ, రకరకాల ఈవెంట్లు నిర్వహించారు. ఏతావాతా విజయవాడ, గుంటూరు మధ్యనే గాక ఇంకా సుదూరం వరకూ ఒక భూ మంత్రం ప్రయోగించారు. తీరా రాజధాని ఎక్కడ అంటే ఎక్కడికక్కడ మీదేనన్నట్టు గుంటూరులోనూ, విజయవాడలోనూ, మంగళగిరిలోనూ, తుళ్లూరులోనూ కూడా అదే జపం చేస్తూ భూమి ధరలు, ఇళ్ల అద్దెలు పెరిగిపోవడానికి కారకులైనారు. నిరాశ్రయులూ, నిరుద్యోగులూ అవుతున్న వేలాదిమందికి నిరాశ మిగిల్చారు. వందల ఏళ్లు ఉండే రాజధాని విషయంలో ఇంత అసమగ్రంగా, అప్రజాస్వామికంగా (అనధికారికంగా కూడా) నిర్ణయాలు అమలు చేయడం ఎక్కడా జరిగి ఉండదు. అయోమయం ఉంటేనే అనుకున్నది చేసుకుపో గలమన్న వ్యూహం ప్రకారమే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నా రన్నది స్పష్టం. మరో వైపున రాజధాని తరలింపు సమస్యపైనా ఇదే గందరగోళం కొనసాగించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వారంలోనే పదేళ్లు హైదరాబాదులోనే ఉంటానని ప్రకటించారు. వారానికి రెండు రోజులు విజయవాడ అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌కైనా తెలంగాణలో తెలుగుదేశంను బతికించడం ప్రధాన లక్ష్యంగా పనిచేశారు. ఒక దశలోనైతే ఎపి నాయకులు తమకు అపాయింట్‌మెంట్‌ దొరకడం గగనమైందని వాపోయిన పరిస్థితి. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి దొరికిపోయిన తర్వాత ఇదంతా మారిపోయింది. ఆ అనైతికానికి చెంపలేసుకుని బయిటపడేది పోయి ఫోన్‌ ట్యాపింగ్‌ పేరిట ఎదురుదాడి చేశారు. సెక్షన్‌ 8 కింద పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హడావుడిగా ప్రకటించారు. గవర్నర్‌పైనా ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజ ధానిలో మరో రాష్ట్ర ప్రభుత్వంపై ట్యాపింగు చేస్తే తీవ్రమైన విషయమే. ఫోన్‌ ట్యాపింగ్‌ అంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఎందుకు పసిగట్టలేకపోయారు? రేవంత్‌ కేసుకు ముందే దాన్ని ఎందుకు బయిటపెట్టలేదు? ఇప్పటికైనా తమ దగ్గర ఉన్న సాక్ష్యాలతో సమర్థంగా ముందుకు రాలేకపోవడానికి కారణాలే మిటన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అప్పటి నుంచి వ్యవహారం రెండు రాష్ట్రాల నుంచి రెండు పార్టీలైన తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ తగాదాగా మారిపోయింది.
ఈ దశలో హఠాత్తుగా రాజధానిని ఉన్నపళాన తరలించేస్తామన్నట్టు మాట్లాడ్డం మొదలెట్టారు. ఈ తరలింపు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదనడంలో సందేహం లేదు. అయితే దానికి తగు ప్రణాళిక ఉండాలి. అందరితో చర్చించి వాస్తవికంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగుల, అధికారుల సాధకబాదకాలు, భవనాలు, గృహ వసతి, చదువుల వంటివన్నీ సజావుగా పరిష్కరించాలి. ఇవన్నీ జరగాలంటే ముందుగా సన్నాహం చేసుకోవాలి. అందరికీ ఒక అవగాహన కలిగించి ఉండాలి. అయితే తెలంగాణ రాజకీయాలపై చూపు ఉన్నంత వరకూ చంద్రబాబు ఆ దిశలో ఎలాటి అడుగులూ వేసింది లేదు. ఈ కేసు బెడిసికొట్టిన తర్వాత మాత్రం ఒక్కసారి హడావుడిగా పరుగెత్తాలని పల్లవి ఎత్తుకున్నారు. మరి సెక్షన్‌ 8పై చర్చ ఏమైంది? హైదరాబాదులో కొనసాగేందుకు విభజన చట్టం కల్పించిన అవకాశాన్ని ఐచ్ఛికంగా, అర్థంతరంగా వదులు కోవడం వల్ల పడే ప్రభావాలేమిటన్నది కాస్తయినా ఆలోచించిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా ఈ పేరుతో విజయవాడ పరిసరాలలో ప్రైవేటు భవనాలను ఖరీదైన అద్దెలతో తీసుకోవడం అనివార్యమవుతుంది. ఇక రాజ్యాంగం 371(డి) కింద ఉన్న స్థానికత నిబంధన ఎపికి వచ్చే ఉద్యోగుల పిల్లలకు సమస్యగా మారుతుందనే దానికీ పరిష్కారం ఆలోచించింది లేదు.

తమను బలపర్చే కొందరు ఉద్యోగ నాయకులతో మమ అనిపించుకుంటే సరిపోతుందన్న భావన తప్ప ప్రజాస్వామి కంగా అందరితో చర్చించడం, అఖిలపక్షం వేసి వివరణ ఇవ్వడం అన్న మాటే లేకుండా పోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాల దృష్టి తప్ప రాష్ట్ర విశాల, దీర్ఘకాలిక అవసరాలను బట్టి వాస్తవికంగా ప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు. వివిధ సంస్థల, వ్యవస్థల విభజనకు సంబంధించి ఎడతెగని వివాదాలు వీటికి తోడవుతున్నాయి. విద్యా సంస్థల ప్రవేశాల నుంచి విద్యుత్‌ ఉద్యోగుల తొలగింపు వరకూ దేనిపైనా ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన ప్రతిపాదనలతో తన పాత్ర నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తున్నదనే ఆరోపణల చాటున కాలం గడిచిపోతున్నది. విభజన తర్వాత వివాదాలు అనివార్యమని తెలిసి ముందు జాగ్రత్త పడింది లేదు. ఇప్పుడైనా సమర్థంగా కేంద్రీకరిస్తున్నదీ లేదు.
వీటన్నిటికీ కారణం ప్రభుత్వానికి దీర్ఘకాలిక దృష్టి, ప్రజాస్వామిక పారదర్శకత లేకపోవడమే. రాష్ట్ర పాలన, రాజధాని ప్రతిదీ తమ స్వంత వ్యవహారమైనట్టు భావిస్తున్నారు. మొత్తం మంత్రివర్గం, శాసనసభ్యులు అని గాక కార్పొరేట్‌ బృందం ఒకటి అధినేత చుట్టూ ఉండి చక్రం తిప్పేస్తున్నది. సింగ పూర్‌ దారిలో విదేశీ గుత్త సంస్థల ప్రవేశం పరిస్థితిని ఇంకా క్లిష్టం చేస్తున్నది. ఈ క్రమంలో రావలసిన ప్రత్యేక హోదా రాక పోయినా, కనీస నిధులు విడుదల కాకపోయినా కదలిక ఉండదు. పైగా అడిగినందుకు ప్రతిపక్షాలపై విరుచుకు పడ టం, అరెస్టులు, నిర్బంధాలు, నిందా ప్రచారాలు సర్వసా ధార ణమై పోయాయి. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది పోయి ప్రజలపై బలప్రయోగం, ప్రతిపక్షాల దిగ్బంధనం నిత్యకృత్య మవుతు న్నది. వీటన్నిటి కారణంగా విశ్వాసాన్ని వమ్ముచేసిన వెంకయ్య నాయుడు వంటి కేంద్ర మంత్రులు తాను తప్ప దిక్కులేదన్నట్టు అహంభావ పూరితంగా మాట్లాడుతున్నారు. బీహార్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రానికి రిక్త హస్తం చూపిస్తున్నారు.
విపరీత ప్రచారం చేసుకున్న ప్రధానితో భేటీ ప్రహసనంగా మారిపోగా ఏదో ఒరగబెడతారని ఊరిస్తున్నారు. కేంద్రం కూడా రాజధానిపై తగు నివేదిక రాదంటూనే సమగ్ర చర్చ దాటేస్తున్నది. నిధులు ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకుంటున్నది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సహనాన్ని పరీక్షించడమే. ప్రజాభిప్రాయాన్ని, నిరసనను బేఖాతరు చేసి నల్లేరు మీద బండిలాగా నడిచిపోతుందనుకున్న చంద్రబాబు నాయుడు గతంలో రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించారు. విభజనానంతర క్లిష్ట పరిస్థితిలో కూడా అదే పునరావృతం చేయడం వల్ల మరోసారి అంతకు అనేక రెట్లు ఎదురుదెబ్బ తగిలితే ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు సింగపూర్‌ పాలకులైనా, కేంద్రలోని కమలబాంధవులైనా ఆదుకోగలిగింది ఉండదు.
రాష్ట్ర పాలన, రాజధాని ప్రతిదీ తమ స్వంత వ్యవహారమైనట్టు భావిస్తున్నారు. మొత్తం మంత్రివర్గం, శాసనసభ్యులు అని గాక కార్పొరేట్‌ బృందం ఒకటి అధినేత చుట్టూ ఉండి చక్రం తిప్పేస్తున్నది. సింగపూర్‌ దారిలో విదేశీ గుత్త సంస్థల ప్రవేశం పరిస్థితిని ఇంకా క్లిష్టం చేస్తున్నది. ఈ క్రమంలో రావలసిన ప్రత్యేక హోదా రాకపోయినా, కనీస నిధులు విడుదల కాకపోయినా కదలిక ఉండదు. పైగా అడిగినందుకు ప్రతిపక్షాలపై విరుచుకు పడటం, అరెస్టులు, నిర్బంధాలు, నిందా ప్రచారాలు సర్వసా ధారణమై పోయాయి. కేంద్రంపై 
ఒత్తిడి తేవాల్సింది పోయి ప్రజలపై బలప్రయోగం, ప్రతిపక్షాల దిగ్బంధనం నిత్యకృత్య మవుతున్నది. 
- తెలకపల్లి రవి