రాజధాని యువత - భరోసా లేని భవిత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన సభలో ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అని ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా భూమినే నమ్ముకున్న 29 గ్రామాల రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ కూలీలు, సంబంధిత ఉత్పత్తితో ముడిబడ్డ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు మొత్తం ప్రజానీకం తమ భూములను, ఉపాధిని, జీవనాన్ని రాజధాని నిర్మాణం కోసం వదులుకొని (బలవంతంగా అయినా) త్యాగం చేశారు. కానీ నేడు అదే ముఖ్యమంత్రి త్యాగాలకు ప్రతిఫలంగా ఇస్తామన్న హామీలు నెరవేర్చమని ఆందోళన చేస్తున్న వారి పట్ల, మా రాజధానిలో మాకు చోటివ్వండని, మా ఇళ్ళను తొలగించొద్దని కోరుతున్న ప్రజల పట్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రజలనే పనికిమాలిన వాళ్లుగా, అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించటం ఆయనకే చెల్లింది. ఈ నేపథ్యంలోనే ''ఆ త్యాగాలకు సమిధలుగా మిగిలి, ప్రపంచ స్థాయి రాజధాని నగరానికి(??) ప్రమిదలుగా వెలిగే'' యువతరం భవిష్యత్‌ అత్యంత కీలకమైన అంశం. యువశక్తిని వినియోగించుకోవటంపైనే ఏ దేశ అభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుందనేది కాదనలేని సత్యం. అందుకే తగ్గిపోతున్న యువ జనాభాను దృష్టిలో ఉంచుకొని చైనా 2016 జనవరి 1 నుంచి ''ఒక్కరే సంతానం''కు స్వస్తి పలికి, రెండో సంతానానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చి యువశక్తిని పెంచుకొనే దిశగా అడుగులేస్తున్నది. మరి ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణానికై స్థానిక యువతను మన ప్రభుత్వం ఎలా వినియోగించుకో బోతున్న దనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న?? సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ నైజం బయటపడనుంది. ప్రజల కోసం రాజధాని అయితే స్థానిక యువ తను వినియోగించు కుంటుంది. కాదు రాజధాని సింగపూర్‌, జపాన్‌, మలేషియా, తదితర విదేశీ కంపెనీల కోసం అయితే స్థానిక యువతను విస్మరిస్తుంది.
రాజధాని 29 గ్రామాల యువతకు ఉపాధి బాధ్యత క్రిడా వహిస్తుందని సిఆర్‌డిఎ చట్టంలో పొందుపరిచారు. అందరికీ ఉద్యోగాలిప్పిస్తామని ల్యాండ్‌పూలింగ్‌ సందర్భంగా మంత్రులు ఊదరగొట్టారు. ఇందుకోసం క్రిడా సర్వే నిర్వహించి 26,000 మంది యువతీయువకులున్నట్లు తేల్చింది. వీరందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇస్తామని, తొలుత 6,000 మందికి శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ద్వారా ప్రయివేటు కంపెనీలతో శిక్షణ ఇప్పిస్తామని, శిక్షణా కాలంలో స్టైఫండ్‌ ఇస్తామని, క్రిడా రాజముద్రతో సరిఫికెట్లు ఇస్తామని, అంతిమంగా శిక్షణ పొందిన వారందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. సామాన్య భవన నిర్మాణ కార్మికుడి నుంచి సివిల్‌ ఇంజనీర్ల వరకూ అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో కోర్సుల వారీ శిక్షణ ఇచ్చి ఉపాధి ఇస్తామని, అందు కోసం గ్రామాల్లో ఇద్దరు చొప్పున ఫెసిలిటేటర్లను క్రిడా, ఐదు గ్రామాలకు ఒకరు చొప్పున కౌన్సిలర్లను ఎపిఎస్‌ఎస్‌డిసి సంయు క్తంగా నియమించాయి. చిన్న పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధికై రూ.25 లక్షల వ్యక్తిగత రుణం మంజూరు చేస్తానని హామీ ఇచ్చింది. క్రిడా ప్రచారాన్ని, ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారుల హామీలను నమ్మి తొలి బ్యాచ్‌గా 113 మంది బిటెక్‌, యంసిఎ విద్యార్థులు ఆరు నెలల శిక్షణకు హాజరయ్యారు. మొదట ఆచార్య నాగార్జున యూని వర్శిటీలో ఇంగ్లీషు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో అందరికీ అవగాహన శిక్షణ ఇచ్చి ''రిషితేశ్వరి'' ఘటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల 21వ శతాబ్దపు గురుకులంలో శిక్షణ ఇచ్చారు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా కోర్సులవారీ శిక్షణ లేకపోవటంతో, కంపెనీలు రాకపోవటంతో విసిగివేసారి గత డిసెంబరు 2న విద్యార్థులు మూకు మ్మడిగా తుళ్ళూరు క్రిడా కార్యాలయానికి వచ్చి తమ నిరసన తెలిపా రు. నిరసన నేపథ్యంలో అధికారులు ప్లేటు ఫిరాయించి క్రిడా ఉద్యోగా లు ఇస్తామని తాము చెప్పలేదని దబాయిస్తూనే ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణలో పొరపాటు దొర్లిందని సాక్షాత్తు గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రాజెక్టు అధికారులు ఒప్పుకున్నారు.
ఇటీవలనే క్రిడా ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అధికారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంవత్సర కాలంలో క్రిడా 11 అంశాల్లో కేవలం 549 మంది యువతకు మాత్రమే శిక్షణ ఇప్పించింది. ఈ లెక్కన తొలిదశలో పేర్కొన్న 6,000 మందికి శిక్షణ ఇవ్వటానికి ఎంతకాలం పడుతుందో? ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా బిటెక్‌ విద్యార్థులకు, మిగిలిన పది అంశాల్లో వివిధ ప్రయివేటు కంపెనీల చేత శిక్షణ ఇప్పించారు. వారిలో ఏ ఒక్కరికీ కనీసం సర్టిఫికెట్‌, స్టైఫండ్‌ ఇవ్వలేదు. ఇక ఉపాధి సంగతి సరేసరి. మగ్గంవర్క్స్‌, హెర్బల్‌ ప్రోడక్ట్స్‌, జూట్‌ బ్యాగుల తయారీ, ల్యాండ్‌ సర్వే, లారీ డ్రైవింగ్‌, లాజిస్టిక్స్‌, బిజినెస్‌ కరస్పాడెంట్స్‌, తదితర కోర్సుల్లో 388 మంది మహిళలు, 161 మంది పురుషులు శిక్షణ పొందారు. శిక్షణ పేరుతో ఐదు నెలలు, అనంతరం రెండు నెలలు మొత్తం ఏడు నెలల విలువైన కాలాన్ని కోల్పోయామని 113 మంది బిటెక్‌ విద్యార్థులు, ఆరు నెలలుగా శిక్షణ పేరుతో ఖాళీగా ఉన్నామని సింగపూర్‌ మోడల్‌లో శిక్షణ పొందిన 22 మంది ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అభ్యర్థులు, గత నాలుగు నెలలుగా జ్యూట్‌ బాగుల పేరుతో కాలక్షేపం చేస్తున్నామని 162 మంది మహిళలు ఆవేదన చెందుతున్నారు. మరో పక్క శిక్షణ ముసుగులో కంపెనీలకు క్రిడా కోట్ల రూపాయలు ముట్టజెపుతున్నది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో శిక్షణ ఇప్పిస్తున్నా ఇంత వరకు కనీసం సరిఫికెట్లు, స్టైఫండ్‌ ఎందుకు ఇవ్వలేదు? కంపెనీలకు ప్లేస్‌మెంటుతో కలిపి డబ్బులు చెల్లిస్తున్నామని అధికారులు నిసిగ్గుగా ప్రకటిస్తున్నా ఇంత వరకు ఒక్కరికీ ఉపాధి ఎందుకు కల్పించలేదు? ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అన్ని అంశాల్లో శిక్షణ పొందిన యువత మొత్తం ''రాజధాని యువజన సంఘం''గా ఏర్పడి రాజకీయాలక తీతంగా ఐక్యంగా ముందుకు కదిలారు. క్రిడా కమిషనర్‌, అదనపు కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులను అనేక దఫాలుగా కలసి వినతులు ఇచ్చి గంటల తరబడి చర్చించారు. పలు రకాలుగా నిరసన తెల్పారు. తుళ్ళూరు, విజయవాడ క్రిడా కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభల్లో, మాస్టర్‌ ప్లాన్‌ అవగాహన సభల్లో అధికారులను నిలదీశారు. మొదటి బ్యాచ్‌ 113 మంది బిటెక్‌ విద్యార్థులకే ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం అందరికీ ఎలా ఇస్తుందని చేసిన ప్రచారం రాజధానిలో వేడిని పుట్టించింది. అనివార్యంగా కంపెనీలను పిలిపించి ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీలు నెలల తరబడి సమయం కోరుతు న్నాయి. ఈ నేపథ్యంలో తగిన ఉద్యోగం లభించేదాకా నిరసన లు, పోరాటాలు ఆగవని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని యువజన సంఘం ప్రతినిధులు గంటపాటు శాసనసభ అంచనాల కమిటీతో చర్చించిన అనంతరం కమిటీ ఛైర్మన్‌ ఉచిత సలహా ఇచ్చారు. ''ఉద్యోగాలు కావాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఆందోళ నలు ఉండకూడదు. కాబట్టి మీ తల్లిదండ్రులను ఒప్పించి రైతుల ప్లాట్లు, గ్రామకంఠాలు, ఇళ్ళ తొలగింపు విషయంలో ఆందోళ నలు జరగకుండా చూడాలి'' అని చెప్పటంతో అభ్యర్థులు మరింత పట్టుదలగా హామీల అమలు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు.
రాజధాని భూములను తమకే కట్టబెట్టాలని సింగపూర్‌ కంపెనీలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాయి. మరొపక్క ఇచ్చి హామీలు అమలు చేయమని యువత కోరుతోంది. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో అటు శిక్షణ, ఇటు ఉపాధి కల్పనలో కీలకపాత్ర వహించిన క్రిడా సోషల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించాకే తిరిగి ఇతర అంశాల్లో శిక్షణ ప్రారంభించాలని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు నిర్ణయించి చేతులెత్తేశారు. క్రిడా శిక్షణ తీసుకోకుండా ఉన్నత చదువులు పూర్తి చేసిన యువత ఉపాధి కోసం గ్రామాలవారీగా ఐక్యమై రూ.25 లక్షల వ్యక్తిగత రుణాలకై నిలదీయనున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రజలకు, అందునా యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
- డి లెనిన్‌ 
(వ్యాసకర్త రాజధాని యువజన సంఘం ఉపాధ్యక్షులు)