రాజధాని మాస్టర్‌ప్లానంతా బూటకం..

రాజధాని నిర్మాణానికి రూపొందించామంటున్న మాస్టర్‌ప్లానంతా బూటకమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌. బాబూరావు విమర్శించారు.విజయవాడ ప్రాంతంలోనే రాజధానంటే అంతా ఆనందపడ్డారని, కానీ ప్రభుత్వ విధానాలను చూసి రాజధాని ఇక్కడెందుకంటూ ప్రజలు మనోవేదన చెందుతున్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్‌డిఎ పరిధిలోని 59 మండలాల భూముల్ని అగ్రికల్చర్‌ ప్రొటెక్షన్‌ జోన్‌గా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోం దన్నారు. గ్రీన్‌ బెల్డ్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికిగాని, ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం గాని కుదరదన్నారు. సిఆర్‌డిఏ పరిధిలోని 16 లక్షల ఎకరాలల్లో 2050 వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఇప్ప టికే ఇళ్ల అద్దెలు పెరిగాయాని, ఇళ్లూ అందుబాటులో లేవని తెలిపారు. వ్యవసాయాన్ని పరిరక్షిస్తామంటూ 55 వేల అటవీ భూముల్ని ఎందుకు డి- నోటిఫై చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో ఎక్కడా లేని విధంగా సిఆర్‌డిఎ పరిధి 5 శాతం ఉండటం గమనార్హమన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే జపాన్‌, సింగపూర్‌ కంపెనీల ప్రతి నిధుల వద్ద భూములు కొనుగోలు చేయాల్సిన దుస్థితి తలెత్తగలదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కార్పొరెట్‌ కంపెనీలకు లాభం కలిగించే విధంగాను, కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగానూ ఉందని దుయ్యబట్టారు. మాస్ట ర్‌ ప్లాన్‌పై సిఆర్‌డిఎ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయా లని, ప్రకటిత జోనల్‌ విధానం మార్చి ప్రభుత్వమే ప్రజలకు గృహాలను నిర్మించాలని బాబూరావు డిమాండ్‌ చేశారు. లేకుంటే సిపిఎం తరఫున ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.