రాజధాని భూముల్లో నల్లధనం..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని భూముల లావాదేవీల్లో నల్లధనం వరదలై పారుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ కళ్లుమూసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని గ్రామాలలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు దాదాపు రూ.10వేల కోట్ల నల్లధనం లావాదేవీలు సాగినట్లు హైకోర్టు న్యాయవాది ఒకరు అంచనా వేశారు. వాటిని పరిశీలించాల్సిందిగా ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ (ఇన్వెస్టిగేషన్‌) కు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం... ఎపి ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 30న గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలను క్యాపిటల్‌ సిటీ ఏరియాగా నోటిఫై చేయడానికి ముందునుంచే అక్కడ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 2014 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే రాజధాని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కదలిక ఏర్పడింది. తాడికొండ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోని 20 నోటిఫైడ్‌ గ్రామాలలో 2014 ఆగస్టు ఒకటో తేదీ నుంచి 2015 ఏప్రిల్‌ 15 వరకు 2,482 భూ రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు సాగినట్లు అధికారిక సమాచారం. హైవేకు దూరం, కృష్ణా నదీ తీరానికి సమీపం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఎకరం ధర అధికారికంగానే రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలుగా రిజిస్ట్రేషన్‌ లోనే చూపించారు. కానీ వాస్తవ ధరలు అందుకు 10 రెట్లకు పైగా ఉన్నాయి. ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు కొనుగోళ్లు జరిగాయి. రాజధాని రావడం వల్ల లక్షలు కోట్లకు భూముల ధరలు పెరిగాయని మునిసిపల్‌ శాఖ మంత్రి స్వయంగా పలుమార్లు మీడియాలో బహిరంగంగా ప్రకటించారు. తాడికొండ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి లభించిన వివరాల ఆధారంగా లెక్కిస్తే సెప్టెంబరు 2014 నుంచి 2015 జులై వరకు కనీసం 10 వేల ఎకరాలకు క్రయ విక్రయాలు ఉన్నాయని హైకోర్టు న్యాయవాది రవికుమార్‌ చెబుతున్నారు. ఎకరం రూ. కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ధర పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తులు, కేవలం ఎకరం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు రాజధాని ప్రాంతంలో తన పరిశీలనలో వెల్లడైందని ఆయన స్పష్టం చేశారు. చాలామంది రాజకీయ నాయకులు , బడా వ్యాపారులు బినామీ లావాదేవీలు సాగించి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు. తాను అధ్యయనం చేసిన 8 నెలల కాలంలోనే దాదాపు రూ.10వేల కోట్ల నల్ల ధనం లావాదేవీలు రాజధాని సిటీగా నోటిఫై చేసిన గ్రామాలలో ఉంటాయని ఆయన అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఐటి శాఖకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1000 కోట్లు రిజిస్ట్రేషన్‌ ఫీజు, కేంద్రానికి మరో రూ.1000 కోట్ల్లు ఆదాయ పన్ను నష్టం వాటిల్లి ఉంటుందని ఆయన వివరించారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు మొదట్లో కొందరికి నోటీసులు ఇచ్చినప్పటికీ, బహుశా రాజకీయ జోక్యం వల్ల తర్వాత ఈ లావాదేవీలను పట్టించుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కేవలం తాడికొండ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం లావాదేవీల ఆధారంగా నల్లధనాన్ని అంచనా వేశానని, మొత్తం సిఆర్‌డిఎ పరిధిలోని మిగతా గ్రామాల లావాదేవీలనూ ఐటి అధికారులు పరిశీలిస్తే కనీసం ఈ నల్లధనం రూ.20వేల కోట్లయినా బయటపడుతుందని ఆయన చెప్పారు.