రాజధానిలో లే అవుట్

 

-  సర్కారు సన్నాహాలు
-  విజయదశమి నాటికి తొలిదశ 
-  రైతుల వాటాపై తేల్చని సర్కార్‌ 
-  సీడ్‌ క్యాపిటల్‌పై పర్యవేక్షణ..
-  ప్రత్యేక విభాగానికి యోచన
-  క్రిడా సలహా సంఘం భేటీ
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
          అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన స్థలాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే.. ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో లేఔట్లు వేయడానికి సన్నాహాలు చేస్తోంది. సింగపూర్‌ నుంచి క్యాపిటల్‌ సిటీ, సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్లు అందిన నేపథ్యంలో.. ఇక రాజధాని ప్రాంతంలో లే-ఔట్లను వేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం సమీపిస్తున్నందున గడువు నాటికి కనీసం లేఔట్ల ప్లానింగ్‌ను కొంత మేరకైనా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన తేదీగా నిర్ధారించిన విజయదశమి (అక్టోబర్‌ 22) నాటికి తొలిదశ లే-ఔట్ల ప్లానింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికోసం కన్సల్టెంట్లను నియమించుకోనుంది. లే ఔట్ల ప్లానింగ్‌ బాధ్యతను కూడా మాస్టర్‌ డెవలపర్లకే ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మాస్టర్‌ డెవలపర్‌ను ఎంపిక చేయడంలో స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ప్రభుత్వం అనుసరించనుంది. దీనివల్ల ఏర్పడే జాప్యాన్ని తాత్కాలికంగా కన్సల్టెంట్ల ద్వారా భర్తీ చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. దీనితోపాటు ఉమ్మడి రాజధాని నుంచి కార్యాలయాల తరలింపును సైతం వేగవంతం చేయనుంది.
రాజధాని నిర్మాణంపై ఏర్పాటైన సలహా సంఘం ఆదివారం సచివాలయంలో సమావేశమైంది. మున్సిపల్‌ శాఖ మంత్రి పి నారాయణ దీనికి అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, జీఎంఆర్‌ గ్రూపు సంస్థల ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్‌, నూజివీడు సీడ్స్‌ ఛైర్మన్‌ ఎం ప్రభాకర్‌ రావు, పీపుల్‌ క్యాపిటల్‌ ప్రతినిధి సీహెచ్‌ శ్రీనివాసరాజు దీనికి హాజరయ్యారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సతీష్‌చంద్ర, క్రిడా కమిషనర్‌ శ్రీకాంత్‌ నాగులపల్లి, మున్సిపల్‌ శాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి రెండోదశలో సింగపూర్‌ నుంచి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ అందిన తరువాత ఈ కమిటీ భేటీ కావడం ఇదే తొలిసారి. క్యాపిటల్‌ రీజియన్‌ మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌పై ఈ కమిటీలో చర్చించారు. ఈ రెండు మాస్టర్‌ ప్లాన్లల్లో చేపట్టాల్సిన మార్పులు చేర్పుల అంశం ప్రస్తావనకు వచ్చింది.
సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అమరావతి నిర్మాణానికి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. లే ఔట్లను వేసిన తరువాత అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు పరిహారంగా అందజేయాలని చెప్పారు.