
- కౌలు పరిహారం, పెన్షన్ల కోసం రాస్తారోకో, అరెస్టు
- పలువురికి స్వల్పగాయాలు, దుర్భాషలాడిన సిఐ
- మీడియాపై ఆంక్షలు, పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
రాజధానిలో అసైన్డ్, సీలింగు భూములకు పరిహారం, నిరుపేదలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వాలని తుళ్లూరులో మంగళవారం రాస్తారోకోకు దిగిన పేదలపై పోలీసులు ప్రతాపం చూపారు. వారిని నడిరోడ్డుపై ఈడ్చి పారేశారు. నాయకులను మాట్లాడనివ్వకుండా మైకు లాగేసుకున్నారు. సిఐ హనుమంతరావు నాయకులను, పేదలను పరుష పదజాలంతో దూషించారు. ఏరు..ఏంట్రా మీకు నోరు పెరిగింది... అంటూ దళితులపై బెదిరింపులకు ది.గారు. వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మీడియా ప్రతినిధులను బయటకు నెట్టేసి గేట్లు వేసేశారు. ఈ విషయం తెలుసుకున్న పేదలు పెద్దఎత్తున తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంభం ఆనంద కుమార్, బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కంతేటి బ్రహ్మయ్య, టిడిపి ఎస్‌సి విభాగ నాయకులు పేరం అశోక్ సాంబయ్య సిపిఎం నేతలకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. ఇకముందు ఎవరైనా నోరెత్తితే ఇదే గతి పడుతుందంటూ సిఐ హెచ్చరిస్తున్నారని, భయపడేది లేదని సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్ సిహెచ్.బాబూరావు హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో పలు గ్రామాల్లో అసైన్డ్, సీలింగు భూములకు పరిహారమివ్వలేదు. ఆ భూమి ఉందనే పేరుతో పెన్షనూ ఇవ్వడం లేదు. సీలింగు భూమిలో కొద్దిమంది లబ్ధిదారులున్నారు. వారికీ పరిహారం ఇవ్వలేదు. దీనిపై నెలల తరబడి ఆందోళన చేస్తున్న దళితులు, పేదలు సహనం నశించి, సిపిఎం ఆధ్వర్యాన తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు అర్‌అండ్‌బి రహదారిపై రాస్తారోకోకు దిగారు. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన విరమించాలని నాయకులను కోరారు. తాము చేస్తున్న ఆందోళనలో న్యాయముందని, సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే చేస్తున్నామని సిపిఎం నాయకులు బాబూరావు చెబుతుండగా, మీ న్యాయంతో మాకు పనిలేదంటూ నాయకులను లాగి పడేశారు. అరెస్టు చేసి జీపుల్లో ఎక్కించారు. స్థానిక మహిళలు, పేదలు, దళితులు జీపులకు అడ్డం పడ్డారు. వారినీ ఈడ్చేశారు. బాబూరావు, రవి, సుజానమ్మ, చిలకమ్మ, బెజ్జం మాధవరావులకు గాయాలయ్యాయి. అరెస్టుల గురించి తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు మధ్యాహ్నానికి పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్, తాడేపల్లి డివిజన్ కార్యదర్శి డి.వెంకటరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. అరెస్టయిన వారిలో బాబూరావుతోపాటు, రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్, జె.వీర్లంకయ్య, పీరం బాబు, బెజ్జం మాధవరావు, మేకల సుజానమ్మ, పులి చిలకమ్మ తదితరులున్నారు.
న్యాయం చేయమంటే అరెస్టులా : బాబూరావు
రాజధాని నిర్మాణంలో ఉపాధి కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని కోరితే ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందని ఇదెంతవరకు న్యాయమని సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్ సిహెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా పనులు లేక పేదలు, ముఖ్యంగా దళితులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని పశ్నించారు. పేదలు రాస్తారోకోకు దిగితే అరెస్టులు చేసి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల భూములు లాక్కుని, వారినే అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
నేడు క్రిడా కార్యాలయం ముట్టడి
రాజధాని ప్రాంతంలో ఎసైన్డ్, సీలింగ్ లబ్దిదారులకు కౌలు చెక్కులు ఇవ్వాలని, డ్వాక్రా రుణాలు ఒకేసారి లక్షరూపాయాలు రద్దు చేయాలని కోరుతూ బుధవారం సిఆర్‌డిఏ కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్ సిహెచ్.బాబూరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ముట్టడి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.