రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 
                ఈ వారం రోజులూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ పరస్పర వివాదాలూ, సవాళ్లతోనే నడిచాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పాకాయి. అయితే ఈ మొత్తం తతంగంలో ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్రాల దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన అంశాలేమైనా పరిష్కారం నోచుకున్నది లేదు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల వాగ్ధోరణులు శ్రుతి మించి చివరకు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి చేరాయి. ప్రాజెక్టుల నుంచి శాంతిభద్రతల వరకూ ప్రతిదీ ఎడతెగని ఘర్షణ వాతావరణానికే దారి తీశాయి. మొదటి ఏడాది పూర్తి చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎంతమాత్రం మేలు చేయని అవాంఛనీయ పరిస్థితి ఇది. మొత్తంపైన తెలుగు ప్రజలు సుహృద్భావం నిలబెట్టుకున్నా పాలకులు, పాలక పక్షాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రెచ్చగొట్టడమే ధ్యేయంగా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం.
రాజకీయ ఫిర్యాదులు
                తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం ప్రముఖుడు రేవంత్‌ రెడ్డి ఆంగ్లో-ఇండియన్‌ సభ్యుడైన స్టీఫెన్‌సన్‌ ఇంట్లో నోట్ల కట్టలతో సహా దొరికిపోయిన ఉదంతమే ఈ వారమంతా మీడియాను, ప్రభుత్వాలను ఆక్రమించింది. ఇందులో భాగంగా గత ఆదివారం నాడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టుగా విడుదలైన ఆడియో సిడిలు సంచలనం కలిగించాయి. ఇందుకు రాజకీయంగా సమాధానం ఇచ్చే బదులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను రంగంలోకి దించారు. ముందుగా కమ్యూనికేషన్‌ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఎదురు దాడి చేశారు. ఇది ట్యాపింగ్‌ అని, అతికించిన సంభాషణలనీ వాదించారు. తమ ముఖ్యమంత్రి ఫోన్‌ ట్యాప్‌ చేసే హక్కు ఎవరిచ్చారంటూ దీని అంతు తేలుస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఎపి మంత్రులందరూ ఇదే పల్లవి ఆలపించారు. చివరకు క్యాబినెట్‌ సమావేశం కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తం సమర్థనలోనూ రేవంత్‌ చర్య మంచి చెడ్డలు, ఆయన పట్టుపడిన తీరు వంటివాటిని దాటేయడమే జరిగింది. ఆయన అరెస్టు ఒక కుట్ర అని, చంద్రబాబు సంభాషణల ఆడియో టేపు ట్యాపింగు అని ఈ రెండు అంశాలపైన తెలుగు దేశం ప్రభుత్వం కేంద్రీకరించింది. ఏకంగా 120 మంది ఫోన్లు ట్యాప్‌ చేశారంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని ప్రభృతులను కలిసి కెసిఆర్‌ సర్కారుపై ఫిర్యాదు చేశారు. అంతేగాక విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతలు గవర్నర్‌ నిర్వహించా లని కూడా వాదించారు. ఆ సమయంలోనే ఢిల్లీలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం అందుకు స్పందించకపోగా అంతా బావుందని వ్యాఖ్యానించారు. కేంద్రం కూడా చంద్రబాబు కోరినట్టు జోక్యం చేసుకోవడానికి సిద్ధపడలేదు.
కెసిఆర్‌ ఎదురుదాడి
              ఫిరాయింపులను ప్రోత్సహించడం విషయంలో తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ రెండు పార్టీలూ, వాటి అధినేతలూ కూడా ప్రత్యక్షంగా ప్రమాణాలను ఘోరంగా ఉల్లంఘించారు. ఇందుకు సంబంధించి ఒకరిని ఒకరు అనుకోగల స్థితిలో లేరు. సహజంగానే ఇతర పార్టీలు ఈ రెండు పక్షాల పోకడలనూ విమర్శించాయి. రెండవది మండలి ఎన్నికల ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు, ఆరోపణలు, ఆధారాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఉంది. అయితే స్టీఫెన్‌సన్‌ తమకు ఫిర్యాదు చేశాడు గనక రేవంత్‌ బృందంపైన కేసులు పెట్టామనేది తెలంగాణ ఎసిబి వివరణ. వారికి జ్యుడీషియల్‌ కస్టడీ తర్వాత విచారణ వంటివన్నీ జరిగాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం నేతలు ట్యాపింగ్‌ గురించి మాట్లాడింది లేదు. చంద్రబాబు మాటలు బయిటకు వచ్చాకే ఈ వాదన ముందుకు తెచ్చారు. అసలు న్యాయస్థానానికి ఇవ్వాల్సిన ఆధారాలు ఒక ఛానల్‌కు ఎలా ఇచ్చారన్నది తెలుగుదేశం ఆరోపణ. మీ దాకా వచ్చాకే ట్యాపింగు నేరం కనిపిస్తున్నదా అనేది కెసిఆర్‌ ప్రశ్న. పైగా 120 మంది ఫోన్లు ట్యాప్‌ చేస్తుంటే తెలుసుకోలేనంత అసమర్థతలో ఉందా ఎపి నిఘా విభాగం?
బిజెపి దూరం
            ఆ వాదోపవాదాలు అలా ఉంచితే గుంటూరులో జరిగిన మహాసంకల్ప సభలో చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ ఏకరువు పెట్టి అధికారిక వ్యవహారంగా మార్చారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని సవాళ్లు విసిరారు. ఆ సమయంలోనే నల్గొండ సభలో ఉన్న కెసిఆర్‌ బ్రహ్మ రుద్రాదులు కూడా చంద్రబాబును కాపాడలేరని తీవ్రంగా హెచ్చరించారు. అలా వాతావరణం పూర్తిగా దారి తప్పిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసు నుంచి బయిటపడే ఎత్తుగడగా ఎపి సమస్యలు కొన్ని ముందుకు తెచ్చినా అది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని అందరికీ అర్థమైంది. ఈ విధంగా తెలుగు దేశం ఇరకాటాన్ని ఎపి సమస్యలతో కలగాపులగం చేయడం విమర్శకూ కారణమైంది. ఇందువల్లనే కేంద్రం నుంచి కూడా స్పందన కరువైంది. పైగా ఉభయ రాష్ట్రాలూ వివాదాలు మాని అభివృద్ధిపై కేంద్రీకరించాలని వెంకయ్య నాయుడు వంటి వారు హితవచనాలు పలుకుతున్నారు. ఈ కేసు కారణంగా చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని బిజెపి ప్రముఖులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయినా మరో దారి లేని తెలుగుదేశం ప్రభుత్వం అదే వైఖరి కొనసాగిస్తున్నది. చంద్రబాబును కూడా అరెస్టు చేయడంతో సహా దేనికైనా సిద్ధమేనని టిఆర్‌ఎస్‌ మంత్రులు మాట్లాడుతుంటే దానివల్ల మీ ప్రభుత్వం వెంటనే పడిపోతుందని చంద్రబాబు హెచ్చరిక. ఆయన హైదరాబాదులో తిష్ట వేసి తమ ప్రభుత్వాన్ని కూలగొట్ట డానికి కుట్ర నడుపుతున్నారని టిఆర్‌ఎస్‌ ఆరోపణ. వీటన్నిటితో వాతావరణం పూర్తిగా కలుషితమై పోయింది. తప్పు చేసిన వారెవరిపైనైనా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలనే కోరుకోవాలి. దానికి న్యాయ ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ లోగా సవాళ్ల పర్వం బొత్తిగా రాజకీయ వ్యూహంగానే చూడవలసి ఉంటుంది.
అసందర్భ చర్చ
             తనదాకా వస్తేగాని తెలియదని తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎపి హక్కుల గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. విభజన చట్టాన్ని లోతుగా అధ్యయనం చేసి రావలసినవి రాబట్టకోవడం, సమస్యలు పరిష్కరించు కోవడం ఎపికే ఎక్కువ అవసరం. ఎందుకంటే రాజధాని లేదు, నిధులూ కొరతగానే ఉన్నాయి. కానీ చంద్రబాబు బృందం రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్‌ యాత్రలకే అధికతర ప్రాధాన్యత నిచ్చింది. విభజన తర్వాత కూడా హైదరాబాదుపై పట్టును నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన, అవసరం కూడా. భౌగోళికంగా, రాజ్యాంగపరంగా అది కుదిరే పని కాదు. మరో విషయం ఉన్నంతలో ఎపి ప్రభుత్వ స్థానాన్ని, గౌరవ మర్యాదలను కాపాడటానికి, ఘర్షణలు నివారించడానికి కొన్ని మధ్యంతర నిబంధనలు రూపొందించుకోవచ్చు. సెక్షన్‌ 8 అందుకు ప్రాతిపదికగా ఉపయోగ పడుతుంది. కానీ ఎపి ప్రభుత్వం ఆ విధమైన నిర్మాణాత్మక కసరత్తు జరపడంలో విఫలమైంది. విభజన చట్టంపై ఒక ఉపసంఘం వేసి నిరంతరాయంగా అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకో వలసింది. కానీ జరిగింది వేరు. ప్రతి విషయం లోనూ తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రకటించాకే ఎపి కోర్టుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో మొదట కొన్ని అనుకూలంగా వచ్చినా తర్వాత పరిస్థితి మారింది. వాస్తవానికి కార్మిక శాఖ వివాదం వంటివి వచ్చినపుడే తాము గట్టిగా మనసు పెట్టి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన బాధ్యులొకరు నాతో అన్నారు. విభజనానంతర అవసరాల కోసం సంస్థలను రిజిస్టరు చేయించుకోవడం ఆస్తులు, ఆదాయాల పంపిణీకి ప్రాతిపదిక అయ్యేది. కానీ ఎపికి ఆ ధ్యాసే లేకుండా పోయింది. ఇప్పుడు తమ రాజకీయ వివాదం ముదిరే సరికి ముఖ్యమంత్రి ఒక్కసారిగా సెక్షన్‌ 8 అంటున్నారు. పైగా హైదరాబాదులో ఇళ్ల మీద దాడులు జరిగాయని ఆరోపిస్తున్నారు. కొంత లోలోపల అసమ్మతి, విముఖత వున్నా దాడులు, దౌర్జన్యాలు చేసుకునే స్థితి హైదరాబాదులో లేదా మరెక్కడా లేదు. ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు-ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించు కోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. ఎపి ముఖ్యమంత్రి ఇంటి దగ్గర సిబ్బంది మార్పు, తదితర కథనాలు వచ్చాయి. నిజంగా హైదరాబాదులో వాతావరణం బాగాలేదనుకుంటే, కుట్రలు జరుగుతుంటే అప్పుడు తెలుగుదేశం మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. అంతేగాని అపరాధులుగా దొరికిపోయి అపర ధర్మాలు వల్లిస్తే చెల్లుబాటు కాదు.
మారాల్సిన వైఖరులు
                 అయితే తెలంగాణ ప్రభుత్వం పొరబాటే లేదని కాదు. ఫిరాయింపులను ప్రత్యక్షంగా ప్రోత్సహించడం వారి మొదటి తప్పు. తెలుగుదేశం నాయకులపై ఆధారాలు దొరికితే కోర్టుకు సమర్పించడం గాక తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకోవడం మరో తప్పు. మా దగ్గర టేపులున్నాయని ప్రకటించి విడుదల చేయడం ఇంకా అభ్యంతరకరం. ఈ వ్యూహాత్మక తప్పిదాల వల్లనే ఇప్పుడు చంద్రబాబు ట్యాపింగ్‌ కుట్ర వంటి ఆరోపణలు చేసే అవకాశమేర్పడింది. మరోవైపున ప్రాజెక్టులు, ఇతర సమస్యల విషయంలో పదే పదే ఆంధ్రోళ్లు, ఆంధ్రా నాయకులు అంటూ వారి పీడ ఇంకా పోలేదన్నట్టు మాట్టాడ్డం సరికాదు. మూతి మీద తన్ని ప్రాజెక్టులు కడతామని చెప్పడం ముఖ్యమంత్రి వాడాల్సిన భాష కాదు. మా ప్రాజెక్టులకు అడ్డుపడే వారు పట్టిసీమ విషయంలో మాతో సంప్రదించారా అని కెసిఆర్‌ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పవలసిందే. కానీ ఆ పేరుతో ప్రాజెక్టుల నిర్మాణ సమస్యనే పరస్పర వాదనలకు వేదికగా చేసుకోవడం మంచిది కాదు. తెలుగుదేశం ఏదో తప్పు చేసింది గనక ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలు దెబ్బతినే భాష వాడటం సరికాదు. అలాగే ఎపి కూడా కేంద్రానికి లేఖలు రాసే ముందో, తర్వాతనో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సింది. నోట్ల కట్టల వ్యవహారాన్ని కోర్టుకు వదలిపెట్టి ఇప్పటికైనా అలాటి కృషి చేయాలి తప్ప కక్షగొండి మాటలవల్ల ఎవరికీ మేలు జరగదు. కొన్ని తరగతులలో, కార్యాలయాలలో కనిపించే అలాటి పోకడలు నివారించేందుకు కూడా ఇరు రాష్ట్రాలూ చొరవ చూపించాలి.
 - తెలకపల్లి రవి