రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్‌డిఏ ఏరియా కన్వీనర్ సిహెచ్.బాబూరావు విమర్శించారు. రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. మాస్టర్ డెవలపర్ ఎంపిక అనంతరం నిర్మాణ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పిన ప్రభుత్వం నేరుగా సింగపూర్ ప్రభుత్వంతో ఎలా చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలను భాగస్వామ్య పద్ధతిలో అప్పజెప్పేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల భూములతో వ్యాపారం చేయడానికి మంత్రులెవరని ప్రశ్నించారు. సీడ్ క్యాపిటల్‌లో చేపట్టే నిర్మాణాలకు కేంద్రం సాయం అందిస్తుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని, మరి విదేశీ సాయం ఎందుకన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మొక్కుబడిగా టెండర్లు పిలిచి, అనుకున్న కంపెనీలకు కట్టబెట్టాలనుకుంటున్నారన్నారు. మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వ వాటాగా, విదేశీ కంపెనీలు ఆర్థిక రూపంలో పెట్టుబడులు పెడతాయని, వచ్చిన లాభాలను పంచుకుంటాయని ముఖ్యమంత్రే చెప్పారని, ప్రభుత్వం నేరుగా ఎలా వ్యాపారం చేస్తుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాల భూమి విలువ సుమారు రూ.7500 కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఏ ధరను నిర్ణయించిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించిన విధి విధానాలను వెల్లడించాలని కోరారు.