"రస్‌ ఆల్‌ ఖైమా" కోసమే ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి

శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్‌ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. విదేశానికి చెందిన రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ కోసమే ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించిందని విమర్శించారు. దేశీయ కంపెనీతో కలిసి రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని, ఆ కంపెనీ నష్టాలను అధిగమించేందుకు గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిఎం చంద్రబాబుకు ప్రజా సంక్షేమం కంటే పెన్నా, రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీల మనుగడే ముఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్‌ తవ్వకాలు అక్రమమని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అవే విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు మధు బుధవారం ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. బాక్సైట్‌ తవ్వకాలలో చట్టాలను అతిక్రమిస్తు న్నారంటూ గవర్నర్‌కు చంద్రబాబు 2012 ఏప్రిల్‌ 4న రాసిన లేఖ ప్రతిని, మధు తన లేఖతో పాటు జోడించారు.