రవాణా కార్మికుల బీమా..ప్రభుత్వ డ్రామా

ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మేడే రోజున రవాణా కార్మికుల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించి, కార్మికుల పక్షాన ఉన్నట్లు పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం ప్రకటన వెనుక కూడా కారణముంది. కార్మికవర్గం తరతరాలుగా పోరాడి, సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేసి కార్పొరేట్‌ సంస్థలు కార్మికులను మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేశాయి. కార్మికులు, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమాను ప్రభుత్వం ప్రకటించింది తప్ప, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కాదు. ఇది కార్మికులకు శాశ్వత పథకం కాదు. ఈ పథకంలో పూర్తిగా అవయవాలు కోల్పోయి అంగవైకల్యంతో ఉన్నవారికి ప్రయోజనం లేదు. సహజ మరణం చెందిన వారికీ ఈ పథకం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదు. బ్యాడ్జీ ఉన్న ట్రాన్స్‌పోర్టు కార్మికులకే ఈ పథకం వర్తిస్తుందని నిబంధనలు విధించడంతో సగానికిపైగా కార్మికులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో అనేక మందికి డ్రైవింగ్‌ వచ్చినా 7వ తరగతి లోపు విద్యార్హత ఉండడంతో నిబంధనల ప్రకారం లైసెన్స్‌ రావడం లేదు. వీరికి ఈ పథకం వర్తించదు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ వర్తించిన కార్మికులకూ దీని నుంచి మినహాయింపు ఇవ్వడంతో, కొద్ది సంఖ్యలో కార్మికులకు పరిమితం చేసి ట్రాన్స్‌పోర్టు కార్మికులందరికీ మేలు చేస్తున్నట్లు ప్రభుత్వం డ్రామా ఆడుతోంది. రాష్ట్రంలో 4.50 లక్షల మంది బ్యాడ్జీ ఉన్న కార్మికులు ఉంటే, జులై నాటికి 1.50 లక్షల మంది కార్మికులను మాత్రమే ఈ పథకం కింద నమోదు చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
డోలాయమానంలో బీమా
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసి వద్ద రూ.75 వేల పాలసీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ వద్ద రూ.4.25 లక్షల పాలసీ తీసుకుంది. మొత్తం రూ.5 లక్షలు ప్రమాదంలో మరణించిన ట్రాన్స్‌పోర్టు కార్మికులకు చెల్లిస్తుంది. శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.75 వేలు చెల్లిస్తుంది. రూ.75 వేలతో శాశ్వత అంగవైకల్య కార్మికుడు తన కుటుంబంతో ఎలా బతకగలడు? సహజ మరణం పొందిన కార్మికులకు రూ.37 వేలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. మరణించిన కార్మికుని కుటుంబం రూ.37 వేలతో ఏ విధంగా బతుకు బండిని నెట్టుకురాగలదో ప్రభుత్వమే చెప్పాలి. బతికున్న కార్మికునికి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనమూ లేదు. అంతేకాకుండా ఈ పాలసీ కాలపరిమితి ఐదేళ్లు మాత్రమే. ఈ బీమా కూడా ఐదేళ్లు కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మేలో విడుదల చేసిన 'కార్మికులకు అండ' అనే పుస్తకంలో ఈ విధంగా పేర్కొంది : మొదటి సంవత్సరం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రెండో సంవత్సరం నుంచి కార్మికుడు రూ.100 చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాలని పేర్కొంది. రెండో సంవత్సరం వచ్చే సరికే ఈ బీమా పథకం అమలు డోలాయమానంలో పడనుంది. కార్మికులు డబ్బు చెల్లిస్తే అది ప్రభుత్వ పథకం ఎలా అవుతుంది? సంపద సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌ నుంచి ఎలాంటి కేటాయింపులూ చేయకుండా, కార్మికుల డబ్బుతో కార్మికుల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రచార ఆర్భాటాలకు పోతోంది.
బీమా పేరుతో భారాలు
రాష్ట్రంలో 81,01,994 మోటారు వాహనాలు ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమా పేరుతో వాహనదారులపైనే పది శాతం సెస్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకంలో పేర్కొంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 1.71 లక్షల వాహనాలకు ఇన్సూరెన్స్‌ నమోదు చేసి, ఈ పేరుతో 81,01,994 మంది వాహనదారులపై భారం వేయడానికి ప్రయత్నిస్తోంది. అంటే ఇది కార్మికుల బీమా కంటే ప్రభుత్వానికి ఆర్థిక ధీమా అంటే బాగుండేది. ఈ పథకం ద్వారా కార్మికులకు వచ్చే ప్రయోజనం కంటే, ప్రభుత్వానికి అదో ఆదాయ వనరుగా వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమా శాశ్వత పథకంగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ పథకం ట్రాన్స్‌పోర్టు కార్మికులందరికీ వర్తించేలా ఉండాలి. మరణించిన కార్మికునికి ఇచ్చే విధంగా పూర్తి అంగవైకల్యం, సహజ మరణానికి ఈ బీమాను వర్తింపజేయాలి. తమిళనాడు ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికులకు రూ.1,000 పింఛన్‌ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.3 వేల పింఛన్‌ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. పింఛన్‌కు అయ్యే బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి. కార్మికులు, వాహనదారులపైన ఎలాంటి భారాలూ వేయరాదు.
ట్రాన్స్‌పోర్టు కార్మికులపై దాడి
బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ట్రాన్స్‌పోర్టు కార్మికులపై దాడికి పూనుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భద్రత పేరుతో నూతన చట్టం ముసుగులో లారీ, ఆటో, జీపు, తదితర డ్రైవర్లపై యుద్ధం ప్రకటించింది. ప్రస్తుతం రోడ్డు రవాణా బిల్లులో అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన డ్రైవర్లందరూ చట్టం చేసిన రెండేళ్ల లోపు కొత్తగా లైసెన్స్‌లు తీసుకోవాలి. ఇందుకోసం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైతేనే కొత్త లైసెన్స్‌ ఇస్తారు. లేకపోతే ఇవ్వరు. రోడ్డు ప్రమాదాలకు కార్మికులను బాధ్యులు చేస్తూ జరిమానాలు, జైలు శిక్షలు, వాహన సీజ్‌లు వంటి కఠిన శిక్షలు ఉన్నాయి. వాహనాలకు కూడా నూతన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా విధిగా మార్పులు చేయించుకోవాలి. లేకుంటే రోడ్లపై తిరిగేందుకు వీల్లేదు. కఠిన సవరణలతో కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కార్మికవర్గం సమైక్యంగా తిప్పికొట్టాలి. కార్మిక, ఉద్యోగుల హక్కులపై జరుగుతున్న దాడికి నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పాలి.
- డి గోవిందరావు 
(వ్యాసకర్త సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి)