రమ్స్‌ఫెల్డ్‌కు జ్ఞానోదయం

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ నిర్దేశానుసారం ఇరాక్‌పై దాడి చేయటం ద్వారా చాలా పెద్ద పొరపాటు జరిగిందని అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రమ్సఫెల్డ్‌ కథనం. 2003లో ఇరాక్‌పై దాడికి ఈ రమ్స్‌ఫెల్డే నాయకత్వం వహించారు. ఇన్నాళ్ళ తరవాత బహిరంగంగా ఇరాక్‌లో అమెరికా చెప్పిన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టింప జేయటానికి బుష్‌గారి నిర్డేశాను సారం యుద్ధం మొదలబెట్టటం పూర్తిగా తప్పని ఆయన ప్రకటిం చారు. ఇరాక్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలనే పేరిట అక్కడి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగించి హత్య చేయటం అర్థం లేని, గందరగోళ చర్యని అన్నారు. లండన్‌ నుంచి వెలువడే 'ద టైమ్స్‌' పత్రికకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో 'నేనొక్కడినే కాదు, అమెరికా పాలనా యంత్రాంగంలో ఇరాక్‌పై దాడి అమెరికాని చాలా జుగుప్సాకరమైన బాటలోకి నెట్టేసిందని భావించేవారు ఇంకా చాలామంది ఉన్నారని ఒప్పుకోక తప్పలేదు. గత జూన్‌ 6 న ద టైమ్స్‌ పత్రిక అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రమ్స్‌ఫెల్డ్‌ ఇంటర్వ్యూను ప్రచురించింది. అమెరికా పాలనా వ్యవస్థలో ఉన్న చాలామందే అప్పుడు తనకు అమెరికా తరహా ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇతర దేశాలకు పనికిరాదని చెప్పారని రమ్స్‌ఫెల్డ్‌ అంగీకరించారు. ఎందుకంటే ఇతర దేశాల చరిత్ర, సంప్రదాయం, వాస్తవ పరిస్థితి దాన్ని ఆమోదించవు. కేవలం ఇరాకే కాదు, పశ్చిమాసియాలో ఇలాంటి అమెరికా మార్కు ప్రజాస్వామ్యం అమ్ముకుని ముందుకు పోవాలనే ప్రణాళిక ఆనాడు బుష్‌గారు వేశారు. కానీ అతని ఈ ప్రణాళిక ఇరాక్‌లో కూలిపోయే పరిస్థితిని సృష్టించింది. ఇంకా చెప్పాలంటే లిబియాలో దేశాధ్యక్షుడు కర్నల్‌ గడాఫీని అధికారం నుంచి తప్పించి, హత్య చేసిన సంఘటన మొత్తం ఆ ప్రాంతంలోనే ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చి పెట్టింది. ఇరాక్‌, లిబియాలో అమెరికా నాయకత్వంలో సైనిక కూటమి దాడికి వ్యతిరేకంగా ప్రపంచమంతా తీవ్ర నిరసన, వ్యతిరేకత వ్యక్తమ యింది. కానీ యుద్ధకోరు అమెరికా నాయకులంతా ఆ నిరసన గళాన్ని పెడ చెవిన పెట్టారు. ఇరాక్‌, లిబియా- రెండు దేశాలను ఆర్థికంగా, సామాజికంగా సర్వనాశనం చేసిన తరువాత ఇప్పుడు వారికి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు వారు ప్రపంచ ప్రజల ముందు ఇరాక్‌, లిబియాపై దాడి పొర పాటైందని ఒప్పుకుంటున్నారు.
కానీ దౌర్భాగ్యమేమంటే ఈ దాడి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుతున్నది అమెరికా కాదు. ఇంకా చెప్పాలంటే అమెరికా పాలకులు నిస్సిగ్గుగా అదే విధానం కొనసాగిస్తున్నారు. తనకు నచ్చిన విధంగా నడవని దేశాలపై కనెర్ర చేస్తూనే ఉంది అమెరికా. ఇరాన్‌పై కూడా తప్పుడు సమాచారం ప్రచారం చేసి అక్కడ దాడి చేయాలని పన్నాగం పన్నుతున్నది. ఇరాక్‌ విషయంలో కూడా ఇలాగే జరిగింది. సద్దాం నిరంకుశుడు, ఇరాక్‌ ప్రజలకు ప్రజాస్వామ్యం లేదు, అమెరికా ఇరాక్‌ ప్రజలకు ప్రజాస్వామ్యం, విముక్తి తిరిగి రుచి చూపిస్తామని హామీ ఇచ్చి అమెరికా సైన్యం బగ్దాద్‌లో ఆనాడు దిగింది. ప్రజాస్వామ్యం ఎక్కడీ విముక్తి రుచి ఎక్కడీ అమెరికా ఇరాక్‌ను అన్ని విధాలా ధ్వంసం చేసేసి జారుకున్నది. ఇరాక్‌ ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. 70 శాతం ప్రజలకు ఉపాధి లేదు. ఆరోగ్య వ్యవస్థ కూలిపోయింది. వివిధ సమూహాల మధ్య ఘర్షణలు నిత్య సంఘటనలు. విద్యుత్తు లేదు, తాగునీరు లేదు, మునిసిపల్‌ సేవలు లేవు. అన్నిటికీ మించి మనిషికి భద్రత లేదు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు పీకల్లోతు అవినీతిలో మునిగి ఉన్నారు. చంపడాలు, హత్యా కాండలు చూసి చూసి ప్రజలు అలవాటు పడిపోతున్నారు. అమెరికా ప్రజాస్వామ్యం, విముక్తి పేరిట ఇరాక్‌ ప్రజలకు దక్కినవి ఇవే. ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది అమెరికా పెద్దలు పదవీ విరమణ తరవాత ఆ కృత్యాలపై కన్నీరు పెడుతున్నారు. ఈ కపట కన్నీరు వల్ల ఇరాక్‌, లిబియా ప్రజలకు ఒరిగేదేమైనా ఉందా? అమెరికా అక్కడ ప్రజా సమూహాల మధ్య రేపిన చిచ్చు చల్లారుతుందా? ప్రస్తుతానికైతే అలాంటి ఆస్కారం ఏమీ కనబడటం లేదు. అమెరికా సామ్రాజ్యవాద దుగ్మతపూరిత స్వభావానికి ఇవి ప్రపంచ ప్రజల ముందున్న తాజా నిదర్శనాలు మాత్రమే.
- వివిఆర్‌