రబీ సాగేనా

రబీని ఏటా నీటి కొరత వెంటాడుతోంది. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడ టంతోపాటు, రైతులను గందరగోళ ప్రకటనలతో అయోమయానికి గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 4.09 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం రెండు నెలల క్రితం ప్రకటించింది. నెల రోజుల తర్వాత '3.49 లక్షల ఎకరాలకే నీరిస్తాం. 60 వేల ఎకరాలకు నీరివ్వలేం' అని ప్రకటించింది. ఈనెల 8న కాకినాడ వచ్చిన ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు రబీలో పూర్తి ఆయకట్టుకు నీరిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రబీలో ఉభయగోదావరి జిల్లాల్లో 8.69 లక్షల ఎకరాలకు సాగునీరందించాలంటే 80 టిఎంసిల నీరు అవసరం. సీలేరు నుంచి 42 టిఎంసిల నీటిని తీసుకొచ్చినప్పటికీ మరో 38 టిఎంసిలు అవసరం ఉంది. రబీలో పూర్తి ఆయకట్టుకు నీరివ్వలేమని, తూర్పులో 2 లక్షలు, పశ్చిమలో 2 లక్షల ఎకరాలకు నీరివ్వగలమని నీటిపారుదలశాఖ రెండు నెలల క్రితమే స్పష్టం చేసింది. గోదావరి ఎగువ ప్రాంతంలో స్వయం జలవృద్ధి భారీగా తగ్గడంతో ఉభయగోదావరి జిల్లాల్లో రబీకి నీటి గండం పొంచి ఉందని తేల్చింది. రబీ సీజన్‌లో గోదావరి స్వయం జలవృద్ధి 25 టిఎంసిలు ఉంటుందని మొదట్లో అంచనా వేశారు. ప్రస్తుతం భారీగా స్వయం జలవృద్ధి తగ్గుతుండటంతో గోదావరిలో 10 టిఎంసిల కంటే ఎక్కువ నీరు ఉండదని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. సీలేరు ద్వారా 42 టిఎంసీల నీటిని మళ్లించినప్పటికీ నీటి కొరత తప్పదని ముందుగానే చెప్పింది. రబీనాట్లు ముమ్మరమైన నేపథ్యంలో రబీలో 60 వేల ఎకరాలకు సాగునీరందించలేమని జిల్లా యంత్రాంగం తేల్చి చెప్పింది. తూర్పు, మధ్య డెల్టాలతోపాటు పిబిసి పరిధిలో రైతులు అపరాల సాగుకు సిద్ధం కావాలని కోరింది. సాగునీటి కొరత నేపథ్యంలో తూర్పు డెల్టాలో 27 వేల ఎకరాల్లోనూ, మధ్య డెల్టాలో 17 వేల ఎకరాల్లోనూ, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పిబిసి) పరిధిలో 16 వేల ఎకరాల్లోనూ అపరాల సాగుకు రైతులు సిద్ధం కావాలని కోరుతోంది. రబీ సాగుచేయాలా? అపరాల సాగుకు సన్నద్ధం కావాలా? అని రైతులు అయోమయంలో ఉన్న తరుణంలో శుక్రవారం కాకినాడ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రబీలో పూర్తి ఆయకట్టుకు సాగునీరందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
దీంతో రైతులు మరింత అయోమయానికి గురయ్యారు. సిఎం ప్రకటించిన విధంగా పూర్తి ఆయకట్టుకు నీరందుతుందా?, లేక కలెక్టర్‌ ప్రకటించిన విధంగా 60 వేల ఎకరాలకు సాగునీటి కొరత ఉంటుందా? అనేది రైతులకు అర్థం కావడంలేదు. రబీ నీటిపై జిల్లా యంత్రాంగం, జలవనరులశాఖ స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు.