హిందూ ఫాసిస్టు రాజకీయాలు వేర్వేరు రూపాల్లో ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజాసాహిత్య సృష్టికర్తల మీద, వారి కలల మీద సంకెళ్లను విదిలిస్తోంది. దేశంలోనూ 'సాంస్కృతిక జాతీయవాదం' సృజనరంగాన్ని కత్తుల బోనులోకి నెట్టేస్తున్న వైనం కళ్ళ ముందు విస్తరిస్తున్నది. ఆర్య జాతి సాంస్కృతిక ఆధిపత్యం పేరుతో జర్మనీలో హిట్లర్ సాగించిన మారణకాండకు మరో రూపంగా సదరు మానసిక, భౌతిక హింసను ఇక్కడ ప్రవహింపజేయటానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్) వేర్వేరు రూపాలతో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి 2002లో గోద్రా ముస్లిం మారణకాండ దారిలో నిన్నమొన్నటి దాద్రీ దుర్మార్గ సంఘటన దాకా అనుసరిస్తున్న మతోన్మాద హింసా రాజకీయాలు అసహ్యం గొలుపుతున్నాయి. అందుకే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లోని విశిష్ట సాహిత్యకారులంతా తమకు ప్రభుత్వాలిచ్చిన గుర్తింపును రద్దు చేసుకుంటూ దేశంలో విస్తరిస్తున్న హిందూ జియోనిస్టు రాజకీయాలను నిరసిస్తున్నారు. దేశమంతా విస్తరిస్తున్న ఆధిపత్య సాంస్కృతిక జాతీయవాదం అభ్యుదయ, విప్లవ, అస్తిత్వవాద, లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఇళ్లలోకి సైతం దూరి మీరెటువైపో తేల్చుకోమని పోరు పెడుతున్నది. లేకపోతే, 77 ఏళ్ళ వయస్సు దాటిన కర్ణాటక సాహితీవేత్త, హేతువాది ఎంఎం కల్బుర్గిని కన్నడ సాహిత్య రాజధాని ధార్వాడలో ఆయన ఇంటిలోనే ఎందుకు చంపివేస్తుంది? దేశంలో ఎన్‌డనె అధికారంలోకి వచ్చిన 2014, మే నెల 26 నుంచే మతపర హింస పెట్రేగిపోతున్నదని ఇంటర్వెన్షన్ రెలిజియస్ ఫ్రీడమ్ -2014 ఇచ్చిన నివేదిక మరింత సాక్ష్యంగా నిలుస్తున్నది. మోటివేటెడ్ కిల్లింగ్స్, మతపరమైన అరెస్టులు, అల్లర్లు, గుంపు హత్యలకు పరాకాష్టగా దేశం వర్థిల్లుతున్నది.
సాహిత్యకారులు 'అవార్డులను తిరస్కరించటం రాజకీయ ప్రేరేపిత కార్యక్రమం'గా ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంటున్నది. దాద్రీ దురాగతాన్ని సాక్షాత్తూ ప్రధానే 'యాక్సిడెంట్'గా కొట్టిపారవేయటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్టే. నిరసన వ్యక్తం చేస్తున్న రచయితలను 'జోలా వాలాస్' అంటూ ఎగతాళి చేసే స్థాయికి కేంద్ర మంత్రులు దిగజారారు. అయితే, వీరంటున్నట్టు ఈ రచయితలు 1984లో జరిగిన అల్లర్లలో మూడు వేల మంది సిక్కుల ఊచకోతలు జరిగిన సమయంలో, భోపాల్‌లో యూనియన్ కార్బయిడ్ గ్యాస్ ట్రాజెడీ సమయంలోనూ ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది. చివరికి యూనియన్ కార్బయిడ్ సిఇఒ, ఈ కేసులో అసలు నేరస్తుడు అయిన వారెన్ అండర్సన్‌ను దేశం సరిహద్దులు దాటించటానికి కాంగ్రెస్ పెద్ద నాయకులు చేసిన ప్రయత్నాలు ఎప్పుడైనా ప్రశ్నించదగినవే. ప్రసిద్ధ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై దాడి జరిగిన సమయంలో, ఆమెను కలకత్తా నుంచి పంపించి వేసిన కాలంలో, సల్మాన్ రష్దీపై ఫత్వా విధించిన సమయంలో, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్‌ను దగ్ధం చేసినప్పుడు కూడా వీరిలో కొద్దిమందైనా ఇలాగే వ్యవహరించి ఉండి ఉంటే, ఈనాటి పరిస్థితి ఇంకోలా ఉండేది.
ఇప్పటికి 30 మందికి పైగా రచయితలు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులను, పద్మశ్రీలను తిరస్కరించటం రచయితల ముందున్న కర్తవ్యాలను మరింతగా గుర్తు చేస్తున్నది. కేంద్ర సాహిత్య అకాడమీ 'ఆధిపత్య సాంస్కృతిక అగ్రహారం'గా వ్యవహరించిన విధానంపై అక్టోబర్ 23న జరిగే అకాడమీ అత్యవసర సమావేశం గుర్తించకపోవచ్చుకానీ, ఏకంగా ఇంతమంది రచయితలు 'క్విట్ సాహిత్య అకాడమీ' అనటం మాత్రం సెక్యులరిస్టులకు మంచి సంకేతాలను పంపిస్తున్నది. 88 సంవత్సరాల నయనతార సెహగల్, శశి దేశ్‌పాండేలు ప్రారంభించిన ఈ 'పురస్కారాల తిరస్కరణ' నిరసన తీవ్రరూపం దాల్చటం వధ్యశిల మీద ఉన్న భావప్రకటనా స్వేచ్ఛపై మరింత చర్చను రేకెత్తిస్తోంది. ప్రఖ్యాత పాక్ గాయకుడు గులాం ఆలీ సంగీత కార్యక్రమాన్ని మహారాష్ట్రలో శివసేన అడ్డుకొనటాన్ని గురించి శశి దేశ్‌పాండే అన్న మాటలు మనం బాగా మననం చేసుకోవాలి. 'ఈ దేశం హిందుస్తానీయులందరిదీ. కేవలం హిందువులది మాత్రమే కాదు. హిందుస్తానీయులందరికీ ఇప్పుడు రక్షణ అవసరం. చాలామంది మత మైనార్టీల ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన శశి దేశ్‌పాండే సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ నుంచి తప్పుకున్నారు. కవి, రచయిత కెకె దారువాలా కూడా సాహిత్య అకాడమీ లిటరరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను రాజకీయాలకు కేంద్రబిందువుగా వ్యాఖ్యానించి తప్పుకున్నారు. అకాడమీ అధ్యక్షులు విశ్వనాథ్ ప్రసాద్ త్రిపాఠికి అక్టోబర్ 10న తన పురస్కారాన్ని తిరస్కరిస్తూ లేఖ ఇచ్చారు దారువాలా. ఆ సందర్భంగా 'కల్బుర్గి హత్యకు నిరసనగా తాను అకాడమీ సభ్యత్వం నుంచి తప్పుకుంటున్నానంటూనే, ప్రజలు బీఫ్ తింటే చంపుతారా, పంది మాంసం తింటే దేశం నుంచి వెలేస్తారా? పర్వతాలు దాటుకుంటూ వచ్చిన ఆర్యులు ఇక్కడికొచ్చాక మటర్ పన్నీర్‌ను కనుక్కున్నారా?' అంటూ సవాల్. ముస్లింలు తాము జాతీయవాదులుగా నిరూపించుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితులు దేశంలో పెచ్చరిల్లటం విచారకరమన్నారు. ప్రఖ్యాత కవి, గేయ రచయిత జావెద్ అక్తర్, నసీరుద్దీన్ షాలూ 'దాద్రీ' సంఘటనపై మండిపడుతున్నారు.
80 సంవత్సరాల పంజాబీ రచయిత్రి దిలీప్ కౌర్ తివానా తన పద్మశ్రీని తిరస్కరించారు. కన్నడ రచయిత ప్రొఫెసర్ రహమత్ తారికారి, అస్సామ్‌కు చెందిన ప్రముఖ రచయిత, జర్నలిస్టు హోమన్ బోరైగన్, కృష్ణ శోభిత్, అరుణ్ జోషియా, కొంకణి రచయిత ఎన్ శివదాస్, రచయిత, పరిశోధకుడైన డాక్టర్ అరవింద్ మలగట్ట, ముంబాయికి చెందిన ఉర్దూ నవలా రచయిత రహమాన్ అబ్బాస్, మళయాళ కథా రచయిత, కవి కె సచ్చిదానందన్, కథా రచయిత పికె పరక్కడవులు, ప్రఖ్యాత రచయితలు గురుబచన్ బుల్లర్, పంజాబ్‌కు చెందిన అజ్మీర్ సింగ్ అలుకా, ఆత్మాజిత్ సింగ్, భాటిండా, తారా జోసఫ్, ఉదరు ప్రకాష్, బలదేవ్ సింగ్, అశోక్ వాజ్‌పేయిలు, భటిండా, అలుకా, కాశ్మీరీ సాహిత్య పరిశోధకులు అద్‌బీ, మర్‌కాజ్ కామరాజ్‌బు, కవి విమర్శకులు ఆదిల్ జస్సావాలా, హిందీ రచయితలు మంగలేస్ దర్బారత్, రాజేష్ జోషి, శ్రీనాథ్, వార్యమ్ సంధు, జిఎన్ రంగనాథరావు, ఖయాల్, ఉదరు ప్రకాష్, గుజరాత్‌కు చెందిన జిఎన్ డెవీ, అమన్‌సేధ్, అబ్బాస్, వడోదరకు చెందిన గణేశ్ దేవ్, కెనడాలో స్థిరపడిన రచయిత వార్యమ్ సంధు, కేరళకు చెందిన కవులు, రచయితలు కె సచ్చిదానందన్, పికె పరక్కడు, కెఎస్ రవికుమార్, మళయాళ రచయిత సారా జోసఫ్, న్యూఢిల్లీ లలిత అకాడమీ అధిపతి అశోక్ వాజ్‌పేయి, కాశ్మీరీ రచయితలు గులాంనబీ ఖాయల్‌లు తమ అవార్డులు తిరిగిచ్చేశారు. త్వరలో గోవాకు చెందిన ప్రఖ్యాత రచయితలు మరో 30 మంది కూడా రాజీనామాలు చేయబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. బెంగాలీ రచయితలు నరేంద్ర నాథ్ చక్రవర్తి, శిరీషేందు ముఖోపాధ్యాయ, సమరేష్ మజుందార్ ఇప్పటికే పురస్కారం తిరస్కరించగా, శంభా ఘోష్ సిద్ధంగా ఉన్నారు. అయితే, సాహిత్య అకాడమీ యంగ్ రైటర్ అవార్డు పొందిన మందార కాంత్ సేన్ దాద్రీ ఘటనను నిరసిస్తూ అవార్డును తిరిగి ఇచ్చేయటం అభినందనీయం. రాజస్థాన్ రచయిత నంద భరద్వాజ్ అవార్డును తిరస్కరిస్తూ తనకిచ్చిన రూ.50 వేల నగదును కూడా చెక్ రూపంలో పంపారు. బుకర్‌ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ, మాత్రం 'లిబర్టీ ఈజ్ మై ఓన్లీ పార్టీ'అంటూ స్వేచ్ఛ హరించిన చోట రచయితలు ఎలా ఉండగలుగుతారు అని ప్రశ్నిస్తున్నారు.
ఎటొచ్చీ తెలుగు రచయితల నుంచే ప్రతిస్పందన తక్కువగా ఉంది. బహుజన రాజకీయాలను, సంస్కృతీ విశిష్టతను, అస్తిత్వ చైతన్యాన్ని ప్రకటించేవారంతా ఈ రచయితలకు అండగా ఉండాలని కోరుతున్నాం. అదే క్రమంలో బాబ్రీ నుంచి దాద్రీ దాకా విస్తరించిన హిందూ జియోనిస్టు రాజకీయాలను నిరసించే కవులు, రచయితలు, సాహితీవేత్తలతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి నిరసన స్వరం వినిపించేందుకు సంసిద్ధం కావాలని కోరుతున్నాం.
- డాక్టర్ నూకతోటి రవికుమార్
(వ్యాసకర్త బహుజన రచయితల వేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్)