యోగా క్లాసులపై నిషేధం..

 ఓ వైపు భారత దేశం నేతృత్వంలో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొని కొద్ది రోజులు కూడా గడవక ముందే సెంట్రల్ రష్యాలోని నిజ్నెవర్టొవిస్క్ నగరంలో అధికారులు మతపరమైన మూఢత్వం వ్యాప్తిని అరికట్టడం కోసమని చెప్తూ యోగా తరగతులపై నిషేధం విధించారు. పరమ శివుడు మొట్టమొదట పాటించినట్లు భారతీయ పురాణాలు చెప్తున్న కఠినమైన ఆసనాలు కలిగి ఉన్న హఠయోగ తరగతులు నిర్వహిస్తున్న రెండు స్టూడియోలపై అధికారులు ఈ నిషేధాన్ని విధించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా హఠయోగానికి ఎంతో ప్రజాదరణ ఉంది. అంతేకాదు, రష్యాలో జన్మించిన బాలీవుడ్ నటి ఇంద్రాదేవి వందేళ్లకన్నా పూర్వమే పాశ్చాత్య దేశాల్లో ఈ హఠయోగానికి అత్యంత ప్రాచుర్యం కల్పించడం గమనార్హం. నగరంలోని మున్సిపల్ భవనాల్లో యోగా తరగతులను నిర్వహించడాన్ని నిలిపివేయాలని హఠయోగా స్టూడియోలైన ఆరో, ఇంగారాలను అధికారులు ఆదేశించినట్లు రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి. తమ తరగతులు నిర్వహించడానికి ఈ స్టూడియోలు స్టేడియంలు, బహిరంగ సభలు జరిగే హాళ్లను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే యోగా తరగతులు నిర్వహించడానికి మున్సిపల్ భవనాలను ఉపయోగించుకోవడాన్ని నిజ్నెవర్టోవిస్క్ నగర అధికారులు నిషేధించినట్లు, ఈ మేరకు స్టూడియోలకు ఆదేశాలు జారీ చేసినట్లు ‘కొమ్మర్‌శాంట్ బిజినెస్’ అనే దినపత్రిక తెలిపింది. మతపరమైన మూఢత్వం వ్యాప్తి చెందకుండా చూడడం కోసమే ఈ ఆదేశాలను జారీ చేసినట్లు మాస్కో టైమ్స్ పత్రిక తెలిపింది. అంతేకాదు, హఠయోగా మతపరమైన ఆచారాలతో ముడిపడినదని, మతపరమైన మూఢత్వంతో కూడిన విధానమని పేర్కొంటూ అధికారులు వ్యాయామ సంస్కృతి, విద్య విభాగాల అధికారులకు ఒక లేఖ కూడా జారీ చేసారు.