యుద్ధం ఎవరిపైన?

ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా మధ్య ప్రాచ్యంలోని సిరియాలోదురాక్రమణపూరిత యుద్ధానికి తెగబడిన నేపథ్యంలో ప్రధాని నరేందర్‌ మోడీ దుబాయిలోని క్రికెట్‌ స్టేడియం వేదిక నుంచి ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చారు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? అన్న విషయం అలా వుంచితే మోడీ ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, యుద్ధోన్మాది జార్జి డబ్ల్యు బుష్‌ నుంచి ప్రేరణపొందినట్లుగా కనిపిస్తోంది . మోడీ ప్రసంగం నాటి బుష్‌ ప్రసంగానికి నకలుగా కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమా నీవెటు అని బుష్‌ వల్లించిన డైలాగునే ఇప్పుడు మోడీ వల్లెవేశారు. ఆ మాటకొస్తే ఉగ్రవాదంపై యుద్ధం అనే పదం కూడా అమెరికా మాజీ అధ్యక్షులవారు వాడినదే. సెప్టెంబరు 11 దాడులు జరిగిన పన్నెండు గంటల్లోనే బుష్‌ 'ఉగ్రవాదంపై యుద్ధం' ప్రకటించాడు. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై దురాక్రమణపూరిత యుద్ధానికి తెగబడి ఆ దేశాల వనరులపై పట్టు సంపాదించేందుకు అగ్ర రాజ్యం ప్రయత్నించింది. ఇందుకోసం కొన్ని వేల కోట్ల డాలర్లు తగలేసింది. అది గాక దేశ బడ్జెట్‌లో 43 శాతం దాకా ఆంతరంగిక భద్రతకు వెచ్చించింది. ద్రవ్యలోటు భారీగా పెరగడంతో దానిని భర్తీ చేసుకోవడానికి ఈ కాలంలో 55 వేల కోట్ల డాలర్ల మేరకు ప్రజలపై భారాలు మోపింది. యుద్ధం పేరుతో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లను సర్వ నాశనం చేసింది. ఇంత భారీ ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించిన ఆ ఉగ్రవాదంపై యుద్ధం ఉగ్రవాదుల్ని అంతమొందించలేదు సరికదా మరింత మంది ఉగ్రవాదులను తయారు చేసింది. ఇరాక్‌ నుంచి ఉగ్రవాదం సిరియాకు, మధ్య ప్రాచ్యం అంతటికీ వ్యాపించింది. దీని నుంచి గుణపాఠం తీసుకోకుండా బుష్‌ పాడిన పాటనే దుబాయిలో ప్రవాస భారతీయుల ముందు తనదైన శైలిలో మోడీ వాగాడంబరాన్నంతటిని దట్టించి చాలా సమర్థవంతంగా వినిపించారు. పాకిస్తాన్‌ను దృష్లిలో వుంచుకునే ఆయన ఈ ప్రకటన చేశారు. దీనిని కార్పొరేట్‌ ప్రచార బాకాలు ప్రత్యక్ష ప్రసారం చేసి మరింత ప్రాచుర్యం కల్పించాయి. ఉగ్రవాదం అనేది అమానుషమైనది. దానికి మతం లేదు, హద్దుల్లేవు అంటూనే పాకిస్తాన్‌ గురించి అన్యాపదేశంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం అమానుషమైనది, హేయమైనది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా దానిని ఉపేక్షించకూడదు. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావు లేదు. ఉగ్రవాదంపై అందరూ పోరాడాల్సిందే. అయితే, ఉగ్రవాదంపై పోరుకు పిలుపునిస్తున్నదెవరు? వాటి వెనుక ఉన్న శక్తులెవరు అన్నది పరిశీలించాలి. ఆ విధంగా చూసినప్పుడు మోడీ పిలుపునిచ్చిన ఉగ్రవాదంపై పోరు లక్ష్యం పై కొన్ని అనుమానాలు తలెత్తడం సహజం. ఉగ్రవాదంపై పోరు ఉగ్రవాదులను నిర్మూలించడమే కాదు, ఉగ్రవాద మూలాలను పెకలించేదిగా వుండాలి. మోడీ ప్రసంగంలో అ అంశం గురించి ఒక్క ముక్క కూడా లేదు. ఉగ్రవాద మూలాలను విడిచిపెట్టి ఉగ్రవాదంపై యుద్ధం చేయడమంటే నీడతో యుద్ధం చేయడం లాంటిదే. సహజంగానే ఉగ్రవాద మూలాలలపై చర్చ జరగడం పాలకులకు ఇష్టం వుండదు.

ఎందుకంటే ఆ మూలాలు పాలకులు అనుసరించే విధానాల్లో వుంటాయి కాబట్టి. దేశంలో చదువుకున్న ప్రతి యువతి, యువకునికి హుందాతో కూడిన ఉపాధి, ఆత్మ గౌరవంతో జీవించే అవకాశాలు కల్పిస్తే యువత ఎందుకు ఉగ్రవాదంవైపు మొగ్గుతుంది? విదేశీ బడా బహుళజాతి కంపెనీలు దేశ సహజవనరులను కారు చౌకగా కొల్లగొట్టుకుపోవడానికి, దేశంలో అశేష ప్రజానీకం కష్టపడి సృష్టించిన సంపదను కేవలం ఒక శాతం మంది కొల్లగొట్టుకుపోతుంటే దానికి కారణం పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు కాదా? నిజానికి మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారిలో 2 శాతం మంది మాత్రమే మైనార్టీ ముస్లిం యువకులు. 98 శాతం ఉత్రవాద చర్యలు ముస్లిమేతర సెక్షన్ల నుండి జరుగుతున్నాయి. అందువల్ల ఉగ్రవాదం అనగానే పాకిస్తాన్‌వైపు వేలు చూపడం మాత్రమే కాకుండా పాలకుల విధానాలవైపు కూడా దృష్టి సారించాలి. ఇటువంటి ముదనష్టపు విధానాలను ఒకవైపు అనుసరిస్తూ, ఇంకొకవైపు ఆ విధానాలకు వ్యతిరేకంగా వచ్చే ప్రజా పోరాటాలను అణచేందుకు , ఉగ్రవాదులన్న అనుమానంతో అమాయక మైనార్టీ యువకులను ఎన్‌కౌంటర్‌ చేసేందుకే ఈ ఉగ్రవాదంపై పోరు అయితే అది మనకొద్దు. గుజరాత్‌లో ఉగ్రవాదంపై పోరు మోడీ ఏలుబడిలో ఎన్ని వెర్రితలలు వేసిందో చూశాము. పోటా లాంటి రాక్షస చట్టాలను బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చి దానిని ఎలా దుర్వినియోగపరచినదీ దేశమంతా గమనించింది. గత అనుభవాన్ని దృష్టిలో వుంచుకున్నప్పుడు ఉగ్రవాదంపై యుద్ధం అన్న పదం మాటున గుజరాత్‌లో సాగించే దుస్తంత్రం లాంటిది ఏదైనా దాగివుందా అన్న అనుమానం కలగడం సహజం.

ఉగ్రవాదంపై యుద్ధంలో ప్రపంచం ఎటువైపో తేల్చుకోవాలని మోడీ గంభీరంగా ప్రకటించారు. బుష్‌ ఉగ్రవాదంపై యుద్ధాన్ని వ్యతిరేకించేవారంతా ఉగ్రవాద సమర్థకుల కిందే లెక్క అని మాట్లాడగా, మోడీ ఇప్పుడు దానిని కొంచెం సవరించి , ఉగ్రవాదంవైపా, మానవతావాదం వైపా ఎటో తేల్చుకోవాలని కోరారు. మోడీ దృష్టిలో ఉగ్రవాదంపై యుద్ధాన్ని వ్యతిరేకించేవారంతా మానవతకు శత్రువులన్నమాట! మానవత గురించి మోడీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. యూదు దురహంకార ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దురాక్రమణకు తెగబడి, గాజాపై బాంబుల వర్షం కురిపిస్తే దానిపై మౌనం వహించారు ఈ మోడీగారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా ఇరాక్‌పై దండెత్తి ఆ దేశాధినేతను ఉరితీసినా, లిబియాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుణ్ణి కాల్చి చంపినా అదంతా ఉగ్రవాదంపై యుద్ధమేనని మోడీ భావిస్తున్నారా? వీటిపై తన వైఖరేమిటో స్పష్టం చేయకుండా అరబ్‌ గడ్డ మీద నుంచి ఉగ్రవాదంపై యుద్ధం గురించి మాట్లాడి ప్రయోజనమేమిటి? ఈ విధంగా ఉగ్రవాదాంపై పోరాడితే ఉగ్రవాదం సమసిపోవడం మాట అటుంచి మరింతపెరగడానికే దారితీస్తుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని సంకుచిత దృష్టితో కాకుండా సమగ్ర దృష్టితో చూడాలి.