మోడీ మౌనంపై కలాల తిరుగుబాటు

తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ద్వారా ప్రముఖ రచయితలు నయనతార సెహగల్‌, అశోక్‌ వాజ్‌పేయి ప్రధాని మోడీ విస్మరించిన రెండు విధులను, బాధ్యతలను గుర్తు చేశారు. ఈ దేశంలో ఒక పౌరునికున్న జీవించే హక్కును పరిరక్షించడం, సృజనాత్మకతకు సంబంధించి కళాకారునికి గల హక్కును పరిరక్షించడం. దేశంలో ఇంత జరుగుతున్నా తమ సహ రచయితలు, సాహిత్య సంస్థలు మౌనం పాటించడం పట్ల కూడా వారు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రత్యేకించి ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని మాత్రమే సంస్కరించాలని రచయిత భావించరాదు. అవసరమైతే నాగరికతా స్ఫూర్తికి సంబంధించి హెచ్చరికల సంకేతాలు కూడా పంపించాలి. సర్వకాల సర్వావస్థలయందూ పరిరక్షకుడిగా ఉండాలి. ఇక్కడ, బిజెపి రెండు రకాల ధోరణులను ప్రదర్శిస్తోంది. ఆనాడు నయనతార సెహగల్‌ దేశంలో అత్యవసర పరిస్థితికి అభ్యంతరం తెలిపినప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ, కానీ ఆమే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాలను ప్రశ్నించినపుడు ఆమెను అప్రతిష్టపాలు చేస్తున్నారు, ఆమె ఉద్దేశాలను అనుమానిస్తున్నారు, తప్పు పడుతున్నారు.
88 ఏళ్ళ వయస్సులో కూడా నయనతార రచనా వ్యాసంగం చేస్తున్నారు. రచనా కళలో నిమగమవడమంటే సత్యానికి నిబద్ధులుగా ఉండడమేనని ఆమె గుర్తు చేస్తున్నారు. రచయితకు అసమ్మతి లేదా అసంతృప్తిని వ్యక్తం చేయడమనేది జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. అసమ్మతి అంటే ధైర్య సాహసాలతో కూడిన చర్య. ఒక అలను ఎదురొడ్డడం. మెజారిటీ రౌడీలతో తలపడడం. అసమ్మతి అంటే ఏకాంతత. ఒకే వాణి మౌనాన్ని బద్దలు కొడుతూ దీటుగా జన సమూహాన్ని ఎదుర్కొనడం. దేశంలో అనేకమంది ఈ అసమ్మతితో ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది. నయనతార సెహగల్‌ నిరసన వ్యక్తం చేసినపుడు కొంతమంది దీన్ని తాత్కాలిక ఆవేశంగా, ప్రకోపంగా పేర్కొంటూ కొట్టిపారేశారు. కొంతమంది ''ఎంపిక చేసుకున్న ఆగ్రహావేశాలు''గా అభివర్ణించారు. అన్యాయం జరుగుతున్న రంగంపై కనీస అవగాహన లేకుండా, దేనికోసం పోరాడుతున్నారో తెలియకుండా కేవలం వృత్తిపరంగా నిరసనలు తెలియచేస్తున్నారని భావించాల్సి వస్తుంది. నెహ్రూ హయాంలో ఆమె లబ్దిదారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ, నెహ్రూ తరానికి చెందిన అనేకమందిలా కాకుండా, ఆమె తన సొంత పేరుతో విజయాలు సాధించగలిగారు. సెహగల్‌ ఆవేశం కేవలం ఆక్రోశం కాదు. సహేతుకమైన అసమ్మతే. నిజమే, తన మనస్సులో ఎంతో వ్యధ చెంది వెలిబుచ్చిన విచారమే ఇది. సహ రచయితలు, విద్యావేత్తలను కాల్చి చంపరాదనుకున్నారు. భారతీయ జనతా పార్టీలో రాజకీయ దిద్దుబాటుకు ఏకైక అంగీకృత రూపం మౌనం కావడంతో ఈ నిరసన వెల్లడైంది.
ఎమర్జెన్సీలో వైఖరి
అయితే, గతంలో, ఇలాంటి సందర్భాల్లో సెహగల్‌ మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో ఆమె నిరసన ఆమెను ఒక సెలబ్రిటీని చేసింది. అరుణ్‌ శౌరి, కులదీప్‌ నయ్యర్‌, జార్జి ఫెర్నాండెజ్‌, రజని కొఠారిలతో కలిసి ఆమె నిరసనలకు ఒక సూత్రప్రాయమైన చట్రపరిధిని సృష్టించారు. అదే స్ఫూర్తితో ఆమె రాసిన నిరసన లేఖను పరిశీలించవచ్చు. రాజ్యాంగంలో కల్పించబడిన హామీల గురించి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రాసిన లేఖను ఉటంకించడం ద్వారా ఆమె తన లేఖను ప్రారంభించారు. ఒక రచయితకు 'అసమ్మతి తెలియచేసే హక్కు' 'జీవించే హక్కు'లో భాగమే. మేధావి జీవితమంటే కేవలం ఆలోచనల జీవితం కాదు, మంచి సమాజానికి కావాల్సిన విలువలు, ఆలోచనలు, ఉద్దేశాలతో కూడిన సూత్రప్రాయమైన చట్రపరిధి. ఇక్కడ భారతీయ సంస్కృతి, వైవిధ్యం సారహీనమవుతున్నాయి, వక్రీకరించబడుతున్నాయి. ఏదో ఒక వ్యక్తిగత సంఘటన ఫలితంగా సెహగల్‌ తన అసమ్మతి వెలిబుచ్చలేదు. మేధో జీవితపు ప్రాముఖ్యతను నాశనం చేసే, సంస్కృతిని నిర్వీర్యం చేయాలని భావించే గ్రూపులు ఒక పద్ధతి ప్రకారం జరిపే దాడి ఫలితంగా ఆమె ఈ నిరసనలకు దిగారు. పేలవమైన విధి విధానాలు, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పాఠ్యాంశాలను తిరగరాసే యత్నాలు, ఎంఎం కల్బుర్గి వంటి హేతువాదులను విచక్షణారహితంగా హత్యలు చేయడం, వీటిల్లో ప్రతి ఒక్కటీ దేనికదే అత్యంత భయంకరమైనదే. అయితే వీటిన్నింటినీ గుదిగుచ్చి చూస్తే సమాజం పట్ల ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే గొడ్డు మాంసం వండాడనే అనుమానంతో ఒక వ్యక్తిని కొట్టి చంపడం వీటిన్నింటికీ పరాకాష్ట.
ఈ మొత్తం కుట్రలో దుష్టులు ఎక్కడున్నారో సాహితీ ప్రముఖులే గుర్తించలేకపోతే ఇక ఎవరు గుర్తిస్తారు? మేధో వర్గ సెన్సార్‌షిప్‌, దానితో పాటే సాంస్కృతిక రంగ సెన్సార్‌షిప్‌, పుస్తకాలపై నిషేధం, చలన చిత్రాలపై నిషేధం, ఆ వెనువెంటనే తినే ఆహారంపై నిషేధాలు, ఇవన్నీ చూస్తుంటే, బలవంతంగా మనపై ఒక విధానాన్ని రుద్దుతున్నారని, మన సమాజాన్ని బెదిరించే క్రమం ఆరంభమైందని ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె వయస్సు 38 లేకా 88 అనేదానితో నిమిత్తం లేదు. 80 ఏళ్ళ ముసలి వయస్సుకు వచ్చాక కోపాలు పనికిరావని లేదా కొన్ని విషయాల్లో స్పష్టత కావాలని కోరడం సరికాదని కొంతమంది భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఉద్దేశాలను అనుమానిస్తున్నారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తన పుస్తకాలకు సంబంధించి ఆమె పొందాల్సిన ప్రయోజనాలు, రాయితీలు ఇప్పటికే పొందారంటూ విమర్శించారు. ఆ రకంగా ఆయన తన వైఖరిని బయటపెట్టుకున్నారు. కానీ, మొదటగా, అవార్డు విలువను ఆయన అర్థం చేసుకోలేదనిపిస్తోంది. అయితే, బిజెపి ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ ధోరణి వెల్లడిస్తోంది.
సెహగల్‌కు సంబంధించినంతవరకు, ఇటీవలి సంఘటనలేమీ అంత సాధారణమైనవి కావు. పైగా చెదురుమదురుగా ఏ ఒక్కటో రెండో కావు, ఇవన్నీ కలిసి ఒక ధోరణిని సృష్టిస్తున్నాయి. పైగా హింసాకాండ జరుగుతున్నా మౌనంగా ఊరుకోవడమంటే పరిస్థితిని మరింత అధ్వానంగా చేయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. సృజనాత్మకతకు, కల్పనాశక్తికి సంరక్షకులుగా ఉన్న అకాడమీలు ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉండడమంటే అవి అసమర్థ సంస్థలుగానే కనిపిస్తాయి. ఆమె తుది ప్రకటన చాలా స్పష్టంగా, హుందాగా, ఆత్మగౌరవంతో కూడినదిగా ఉంది. ''హత్యకు గురైన భారతీయుల స్మృత్యర్థం, అసమ్మతిని హక్కుగా పేర్కొనే భారతీయులందరి తోడ్పాటుతో, పైగా ఇలా అసమ్మతి వెలిబుచ్చేవారు భయాందోళనలతో కూడిన, అనిశ్చితి వాతావరణంలో జీవిస్తున్నారని పేర్కొంటూ నా సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నా'' అని ఆమె ప్రకటించారు.
సాహిత్య సంస్థల పిరికితనం
నయనతార సెహగల్‌ బాటలోనే పయనించి తన అవార్డును వెనక్కి ఇచ్చేసిన అశోక్‌ వాజ్‌పేయి తన చర్యను సమర్థించుకున్నారు. ఏదో కొంతమంది ఆంగ్ల రచయితల క్లబ్‌ నుంచి వచ్చిన స్పందనంగా సెహగల్‌ చర్యను పరిగణించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి ఆవేదన, ఆందోళన ద్విముఖమైనది - పెదవి విప్పని తమ సొంత రచయితలు ఆంగ్లం, హిందీ వర్గంపై గురి పెట్టింది ఒకటి కాగా, పిరికితనంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సాహితీ సంస్థల వైఖరి రెండోది. వారు కేవలం అవార్డును తిరిగి ఇచ్చేయడమే కాదు, మౌనంగా ఉండడమనే నేరంపై ఆత్మగౌరవంతో పోరు సల్పుతున్నారు. ఇది నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన చర్య. ఒకపక్క స్వదేశంలో రచయితలు, సాధారణ పౌరులు హత్యలకు గురవుతుంటే మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులతో గొప్ప చాతుర్యంతో మాట్లాడుతూ, ప్రసంగాలు చేస్తున్న వైఖరిని ఆ లేఖ తీవ్రంగా నిరసించింది. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాల్సిందిగా ప్రధానిని కోరింది. ప్రధాని మోడీ విస్మరిస్తున్న రెండు సామాజిక వైరుధ్యాలను ఇది గుర్తు చేసింది. జీవించే హక్కును పరిరక్షించేందుకు ప్రభుత్వానికి, పౌరునికి మధ్య గల ఒప్పందం మొదటిది కాగా, ఒక రచయిత అకాడమీ అవార్డును ఆమోదించినప్పుడు ఆమె లేదా ఆయన సృజనాత్మక స్ఫూర్తిని, స్వేచ్ఛను ప్రభుత్వం గుర్తించాలన్నది రెండవ అంశం. అసమ్మతివాదులు హత్యకు గురవుతూ, కేవలం అనుమానాలతో అమాయకులను చంపేస్తూ ఉంటే ఈ రెండు అంశాల పట్ల ప్రభుత్వం పట్టీ పట్టనట్లు నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. ఈ రెండు విధులను నిర్వహించడంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నమే సెహగల్‌, వాజ్‌పేయి చేస్తున్నారు.
ప్రధాని మోడీ మౌనం పాటించడానికి తోడు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న హత్యలపై భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలను, పిచ్చి చేష్టలను సమర్థించడం కూడా అవుతుంది. ఇవి చూస్తుంటే వీరు వీధుల్లో వేధించే గూండాలా లేక బాధ్యత కలిగిన రాజకీయ నేతలా అనే అనుమానం వస్తుంది. అశోక్‌ వాజ్‌పేయి ఈ చర్యలను చాలా నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ''వారిని నోరు మూసుకోవాల్సిందిగా ప్రధాని ఎందుకు కోరరు?'' అని ప్రశ్నించారు. మోడీ మౌనం, ఆ వెంటే ఆయన మంత్రుల దారుణమైన చేష్టలు, తర్వాత అకాడమీ ప్రవర్తన, వ్యవహార శైలి ఆ విధంగానే ఉంది. ఈ రకంగా మూడు రకాలుగా - మౌనం, కుమ్మక్కవడం, ఉదాసనీనత - ఇవన్నీ కలిసి ఇప్పటికే అసహనంతో కూడిన వాతావరణాన్ని, భయాందోళనలు, సందేహాలను కలగచేశాయి. ఇటువంటి అనిశ్చితమైన, ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాని పరిస్థితుల గురించే సెహగల్‌, వాజ్‌పేయి మాట్లాడుతున్నారు. సంస్కృతి పట్ల ఒక రచయితకు వుండాల్సిన బాధ్యత గురించి వారు చెబుతున్నారు. ఈ స్వతంత్రత అనేది ఆమె లేదా అతని సృజనాత్మకతలో భాగమే.
''ఒక కళాకారుని స్వేచ్ఛను నిషేధించినపుడు, జీవితం, సాహిత్యం ఒత్తిళ్ళు కూడా అలానే ఉంటాయి.'' అని సెహగల్‌ పేర్కొన్నారు. ఆమె తన రచనా నైపుణ్యంలో భాగంగా ఈ విషయాన్ని గుర్తించారు. వాస్తవానికి, కన్నడ సాహితీవేత్త యుఆర్‌ అనంతమూర్తి చనిపోవడానికి కొద్ది వారాల ముందుగా ఏం రాశారో ఇప్పుడు సెహగల్‌ కూడా అదే మాట్లాడుతున్నారు. మోడీ ఇండియాలో తానున జీవించాలనుకోవడం లేదని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. మోడీ అనుచరుడు గిరిరాజ్‌ సింగ్‌ దీనిపై వెంటనే వ్యాఖ్యానిస్తూ, మోడీ ఇండియాలో ఉండడం ఇష్టం లేనివారు వెంటనే పాకిస్తాన్‌కు రైలెక్కాలని అన్నారు. ఆనాటి ఆ దారుణమైన అసహనాన్నే ప్రతిబింబించేలా ఈనాడు వేలాది గొంతులు పలుకుతున్నాయనేది సుస్పష్టమవుతోంది. భారతదేశ ప్రజాస్వామ్యం, సాంస్కృతిక వైవిధ్యం, లౌకికవాదం గురించి ఇక ఎవరూ మాట్లాడలేని పరిస్థితికి భారత్‌ చేరుకుందని సెహగల్‌ వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రచయిత మౌనం పాటించడమంటే ఎంత మాత్రమూ క్షమించరాని అంశమే.
- - శివ్‌ విశ్వనాథన్‌ 
(హిందూ సౌజన్యంతో)