మోడీ డిజిటల్‌ ఇండియా అంతరార్థమేంటి?

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య జరిపిన అమెరికా పర్యటనలో లాస్‌ ఏంజిల్స్‌లోని సిలికాన్‌ వ్యాలీ సందర్శన మనకంద రకూ తెలిసిందే. అక్కడ ఆయన ప్రత్యేకంగా మూడు ప్రముఖ కంపెనీల (గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా) సిఇఒలతో సమావేశమవ డమే కాకుండా మరో ప్రముఖ కంపెనీ ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాల యాన్ని కూడా సందర్శించారు. ఇది మోడీ అద్భుత విజయంగా మన మీడియా ప్రముఖంగా పేర్కొంది. తను విరమించుకున్న 'ఇంటర్నెట్‌. ఆర్గ్‌' పథకాన్ని డిజిటల్‌ ఇండియా కోసం తిరిగి ప్రారంభిస్తానని మోడీకి ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది. 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వై-ఫై సేవలందిస్తానని గూగుల్‌, భారత దేశంలో ప్రతి గ్రామాన్నీ ఇంటర్నెట్‌ ద్వారా అనుసంధానిస్తానని మైక్రోసాఫ్ట్‌ అంగీక రించడాన్ని మీడియా గొప్పగా కీర్తించింది. కానీ భారత డిజిటల్‌ మార్కెట్‌ను గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌లు సంయుక్తంగా కొల్లగొట్టేందుకు మోడీ ఆమోద ముద్ర వేశారన్న విషయాన్ని మీడియా ప్రజలకు చెప్పలేదు.
చరిత్ర గమనిస్తే ఆంగ్లేయులు భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు నాటి నవాబులు, రాజులు చేతిలో కాసులు గలగలలాడతాయని ఉబ్బిపోయి ఈస్టిండియా కంపెనీని రెండు చేతులతో ఆహ్వానించారు. ఈస్టిండియా కంపెనీ స్థానిక సంస్థలతో పోటీగా డబ్బు సంచులను రుణంగా అందించడం మొదలు పెట్టింది. తన విలాస వస్తువులు అమ్ముకోవడం కోసం ఈ అప్పులు ఇస్తోంది, మనం ఎగ్గొట్టేసినా పర్లేదు అనుకున్నారు మన అమాయక నవా బులు. ఈస్టిండియా కంపెనీ స్వార్థాన్ని గమనించలేక పోయారు. అప్పులు తీర్చలేక తమ జీవితాల్ని, దేశాన్ని ఇంగ్లం డుకు తాకట్టు పెట్టేశారు. మహాసముద్రాలన్నింటినీ కబళిం చడం ద్వారా ఆంగ్లేయులు నాడు రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఎవరైతే డిజిటల్‌ సామ్రాజ్యాన్ని నియంత్రిస్తారో వారే ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోగలుగుతారు. కొన్ని గంటలు మీడియాలో వెలిగిపోవడం కోసం మోడీ మొత్తం భారతదేశాన్ని అమెరికా బహుళజాతి కంపెనీలకు బహుమతిగా కట్ట బెడుతున్నారు. గతంలో 'స్నోడెన్‌' బయటపెట్టిన వాస్తవాలు గమనిస్తే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌లు, టెలికం కంపెనీలైన ఎటిÊటి, వెరిజోన్‌తో కలిసి ఐదు కళ్ళు (అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌). గూఢచర్యం ద్వారా అమె రికా నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఎ)కి సమాచారం సేకరించిన సంగతి విదితమౌతుంది. అంతే కాదు, తమ ఆధీనంలోని కంప్యూటర్‌ డేటా (సమాచారం) మొత్తాన్ని విశ్లేషించుకోవ డానికి, ఆ డేటాను రాబోయే 50 సంవత్సరాల వరకు తమ వద్దే ఉంచుకోవడానికి ఈ బహుళజాతి కంపె నీలు అమెరికా ఎన్‌ఎస్‌ఎకు అవకాశం కల్పించినట్టు స్నోడెన్‌ బహిర్గతపరిచారు. అందువల్ల మనదేశ సమాచా రాన్ని ఈ అమెరికా బహుళజాతి కంపెనీల చేతిలో పెట్టడ మంటే మన ఆర్థిక వనరులు అమెరికాకు హస్తగతం చేయ డమే. మన దేశ భవిష్యత్తును అమెరికాకు సంతర్పణ గావించడమే.
ప్రజా ప్రయోజన అంతర్జాలం
ఇంటర్నెట్‌ ఒక ప్రజా ప్రయోజన వ్యవస్థ అని అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్‌ వాదిస్తూ వస్తోంది. జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ కోసం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఇతర పైవేటు కంపెనీలు నిర్మించుకున్న నెట్‌వర్క్‌ వ్యవస్థలకు ఇది అదనం. భారతీయ రైల్వే ''రైల్‌టెల్‌'' పేరున నిర్మించుకున్న ఫైబర్‌ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌నే వాడుకుని ఉచిత వై-ఫై సేవల పేరుతో గూగుల్‌ ఆ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నానికి మన ప్రధాని వంతపాడుతున్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌లు అందిస్తామంటున్నది చివరి అనుసంధానం - వారథి నిర్మించడం మాత్రమే. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చుచేసి ఏ ఫైబర్‌ వ్యవస్థను నిర్మించుకున్నామో దాన్ని దాదాపుగా ఖర్చులేకుండా లేదా కనీస ఖర్చుతో అనుసంధానం పేరున ఈ మొత్తం వ్యవస్థను కబళించే కుట్ర జరుగుతోంది. ఉచిత సేవల పేరుతో మన ప్రజల వ్యక్తిగత సమాచారం, రక్షణ సమాచారం మొత్తం కొల్లగొట్టే కుట్ర దీని వెనుక దాగివుంది. దీనికి భిన్నంగా చైనా ఏం చేసిందో చూద్దాం! తన మార్కెట్‌ నుంచి గూగుల్‌, ఫేస్‌బుక్‌లను దూరంగా ఉంచింది. ప్రపంచంలోని మొదటి 10 ఐటి కంపెనీలలో మూడు చైనా కంపెనీలున్నాయి (బైడు, టెన్‌సెంట్స్‌, ఆలీబాబా). తన అంతర్గత మార్కెట్లను రక్షించుకుంటూనే చైనా ఈ కంపెనీలను అభివృద్ధిచేసింది. అవి తమ ప్రత్యర్థి కంపెనీలకన్నా మొబైల్‌ ఇంటర్నెట్‌ వ్యాపారంలో ఉత్తమ సేవలు అందించగలుగుతున్నాయి. ప్రస్తుతం బయటి దేశాల్లో కూడా విస్తరించే దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
మోడీ పర్యటనలో ఫేస్‌బుక్‌ టౌన్‌హాల్‌గా పిలవబడే ఫేస్‌బుక్‌ కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ఆ కంపెనీ సిఇఒ జుకెర్‌బెర్గ్‌ను ప్రత్యేకంగా కలిశారు. డిజిటల్‌ ఇండియా లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఫేస్‌బుక్‌ దానికి అంగీక రించడమే కాకుండా ప్రతిఫలంగా భారత ప్రజలు ఫేస్‌బుక్‌ పేజీ రంగు మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. భారత టెలికం అధికారులు ఫేస్‌బుక్‌కు చెందిన ''ఇంటర్నెట్‌.ఆర్గ్‌'' ఆనుపానులను ఆరాతీస్తున్న సందర్భంలో మోడీ, జుకెర్‌బెర్గ్‌ ఉల్లాసంగా సెల్ఫీలు దిగడంలోని ఆంతర్యమేమిటి? భారత టెలికం విధానాలను అతిక్రమిస్తున్న ''ఇంటర్నెట్‌.ఆర్గ్‌'' పద్ధతులను ట్రారు (టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ), డాట్‌ (డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ టెలికం), సిసిఐ (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా)లు పరిశీలిస్తున్న తరుణంలో భారత ప్రధాని అటువంటి హై ప్రొఫైల్‌ సందర్శన భారత కంపెనీలను భ్రష్టు పట్టించడం కాక మరేమిటి?
పేద ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని అంటున్నాడు జుకెర్‌బెర్గ్‌. ఈ ఫేస్‌బుక్‌ ''ఇంటర్నెట్‌.ఆర్గ్‌'' ప్రతిపాదన లేమిటి? ఇంటర్నెట్‌లో దాదాపు 100 కోట్ల వెబ్‌సైట్లున్నాయి. కానీ వాటిలో కొన్నింటినే పేద ప్రజలు వీక్షించాలి. అది కూడా ఫేస్‌బుక్‌ నిర్ణయించిన వాటినే చూడాలి. పేదల ఇంటర్నెట్‌ ద్వారపాలకుడిగా ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తుందట. దీనికోసం నెట్‌ న్యూట్రాలిటీని అతిక్రమించడానికి దానికి అవకాశం ఇవ్వాలట! అదండీ అసలు సంగతి. భారతదేశంలో ''ఇంటర్నెట్‌.ఆర్గ్‌''పై సందేహాలున్నందున దాన్ని కొత్త రూపంలో మనదేశంపై రుద్దేందుకు అదిప్పుడు ''ఉచితసేవలు.ఆర్గ్‌'' (ఫ్రీసర్వీసెస్‌.ఆర్గ్‌)గా రూపాంతరం చెందింది. అంతకంటే ఘోరం ఏమంటే, ప్రభుత్వ సేవలన్నింటికీ ఇది వేదికగా ఉండాలని ఫేస్‌బుక్‌ కోరిక. మరోవిధంగా చెప్పాలంటే 'ఇ-గవర్నెన్స్‌' మొత్తం ఫేస్‌బుక్‌ ద్వారా జరగాలి. అంటే ఎవరైనా ప్రభుత్వ సేవలు పొందాలంటే ఫేస్‌బుక్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలి. మన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో పొందుపరచాలి. అంతేకాదు వారి గూఢచార వ్యవస్థలోకి మన మెషీన్‌ (కంప్యూటర్‌ గాని ఫోన్‌ గాని) చేరి పోతుంది. దాంతో భారతదేశం మొత్తం ఫేస్‌బుక్‌ సర్వసత్తాక రిపబ్లిక్‌ ఉపాంగంగా మారిపోతుంది.
సరుకుగా వాడకందారుల డేటా
ఫేస్‌బుక్‌ తమ యూజర్ల (వాడకం దారుల) వ్యక్తిగత డేటాను ప్రకటనకర్తలకు అమ్ముకుంటోంది. ఎంత సమా చారం అమ్ముకుంటే అంత ఆదాయం పొందుతోంది. ప్రస్తు తం పతీ యూజర్‌ వల్ల రూ.836లు ఫేస్‌బుక్‌ ఆర్జిస్తోంది. 2017 నాటికి ఇది రూ.1,146కు పెరుగుతుందని అంచనా. ఉత్తరార్ధ భాగంలో పెరుగుదల ఆగిపోయినందున ఫేస్‌బుక్‌ ప్రస్తుతం దక్షిణార్ధ భాగం వేపు తన దృష్టి సారించింది. అటువంటి తరుణంలో మోడీ ఫేస్‌బుక్‌ బుట్టలో పడ్డారు. యూజర్ల డేటాయే ఫేస్‌బుక్‌కు కీలక ద్రవ్యం. మనందరి డేటా ప్రస్తుతం దానికి కావాలి. ఫేస్‌బుక్‌ వేదికగా సాగే వెబ్‌సైట్‌ ద్వారా గాని, సేవల ద్వారా గాని యూజర్లందరూ తమ డేటా ను ఫేస్‌బుక్‌తో పంచుకోవాలి. ఈ డేటాను ఫేస్‌బుక్‌ ప్రకటన కర్తలకు అమ్ముకుని ఆదాయం సమకూర్చుకుంటుంది. మరో వైపు యూజర్లపై ఆధిపత్యం చెలాయిస్తుంది. వారందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఈ ఫేస్‌బుక్‌ సేవల వల్ల ఇంటర్నెట్‌ సమాచార స్రవంతిలో యూజర్ల భద్రత పూర్తిగా ఫేస్‌బుక్‌ పరమౌ తుంది. భారత ప్రజానీకం ఇంటర్నెట్లో సమాచారాన్ని ఏవి ధంగా దాచుకుంటున్నారో ఫేస్‌బుక్‌ పసిగట్టాలనుకుంటోంది. మన పాస్‌వర్డ్‌లను ఏ విధంగా దాచుకుంటున్నామో, మన బ్యాంకు ఖాతా లావాదేవీలను ఏవిధంగా నిర్వహిస్తున్నామో మొత్తం సమాచారాన్ని పొంది, వాటిని తను వాడుకోవడానికి అన్ని చట్టాలను ఉల్లంఘిస్తుంది. మనం ఇంటర్నెట్‌ ద్వారా నిర్వహించే లావాదేవీలన్నీ సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఫేస్‌బుక్‌ వేదిక అలాంటి లావాదేవీలను సురక్షితంగా ఉండనివ్వదు. అలాంటి లావాదేవీలన్నీ తన ద్వారా జరగా లని, తను మధ్యవర్తిగా ఉండాలని ఫేస్‌బుక్‌ వాంఛిస్తోంది. ఆ విధంగా డేటా నేరస్థుల చేతుల్లో పడి యూజర్లు దారుణంగా నష్ట పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
రైల్వే స్టేషన్లను గూగుల్‌కు, గ్రామాలను మైక్రోసాఫ్ట్‌కు, పేద ప్రజానీకాన్ని ఫేస్‌బుక్‌కు ధారాదత్తం చేయడం ద్వారా ఆ కంపెనీల వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు యూజర్ల డేటాను మోడీ సంతలో సరుకుగా మారుస్తు న్నారు. అమెరికా బహుళజాతి సంస్థలకు మన వ్యక్తిగత డేటాను అందించడ మంటే అమెరికా గూఢచారి వ్యవస్థ మన డేటాను స్వేచ్ఛగా పొందడానికి, ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అంగీకరించ డమే. భారతదేశాన్ని పాలించడం కంటే మీడియాలో కీర్తి కోసం, తన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసం ప్రధాని మోడీ తాపత్రయ పడుతున్నారు. సంతలో సరుకుగా మారిన వ్యక్తిగత డేటా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌ వలస రాజ్యంగా మార్చడానికి నోరూరించే వంటకంగా రూపొందుతుంది.
- ప్రబీర్‌ పుర్కాయస్థ
(పీపుల్స్‌ డెమోక్రసీ వ్యాసానికి స్వేచ్ఛానువాదం
- జి సుబ్బరాజు, విశాఖ)