మోడీ అచ్చేదిన్ భ్రమే: ఏచూరి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మంచి రోజులు ఒట్టి భ్రమేనని, అచ్చేదిన్‌ సూచనలే కానరావడం లేదని సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరీ విమర్శించారు. మతోన్మాద బిజెపితో పాటు కార్పొరేట్‌ సేవలో తరిస్తున్న జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌లను ఎన్నికల్లో ఓడించాలని కోరారు. మోడీ అశ్వమేధ యాగ గుర్రాన్ని కట్టి వేయగల సత్తా బీహార్‌ ప్రజలకుందని ఏచూరి చెప్పారు. రామాయణం చివరిభాగంలో రాముడి అశ్వమేధ గుర్రాన్ని లవకుశులు నిలువరించారని, అదే విధంగా మోడీ అశ్వమేధ గుర్రాన్ని రైతులు, కార్మికులు నిలువరిస్తారని తెలిపారు. వామపక్షాల సంయుక్త ఆధ్వర్యంలో జన్‌ రాజనీతి కన్వెన్షన్‌ పేరిట పాట్నాలో నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరీ ప్రసంగించారు. త్రిభుజంలో మూడు కోణాలున్నట్టు ప్రస్తుత ఎన్నికల్లో మూడు కోణాలు బీహార్‌ ప్రజల ముందున్నాయని చెప్పారు. ఒక కోణం మతతత్వ బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్డీయేదని ఇది దుశ్శాసన రాజకీయాలు చేస్తున్నదన్నారు. మహాకూటమికి చెందిన జెడి(యూ), ఆర్‌జెడి, కాంగ్రెస్‌ల కూటమి సింహాసన్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. వీరికి ప్రత్యామ్నాయంగా మూడో కోణంగా లెఫ్ట్‌ పార్టీలు అవతరించాయని చెప్పారు.