మొసలి కన్నీరుతో కౌలు రైతులకు ఒరిగేదేంటి?

రైతు ఆత్మహత్యలపై ఎప్పుడూ స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల తెగ బాధపడుతూ మొసలి కన్నీరు బక్కెట్లు బక్కెట్లు కారుస్తున్నారు. అంతేగాక జరుగుతున్న వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో 70 శాతం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు చట్ట ప్రకారం ఇచ్చే విష యాన్ని నిర్దిష్టంగా చర్చించకుండా దాటవేశారు. సెప్టెంబరు నెలలోనే రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది పొగాకు రైతులు ఈ నెలలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత 15 నెలల్లో 164 మంది బలవన్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో ఒక్కరికీ రుణార్హత కార్డు ఇవ్వలేదు. బ్యాంకు రుణాలు అందలేదు. 2011 భూ అధీకృత సాగుదార్ల చట్ట ప్రకారం వీరందరూ అర్హత కలిగిన వారే. వీరికే గనక చట్ట ప్రకారం రుణార్హత కార్డు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇచ్చి ఉంటే అధిక వడ్డీలకు ప్రైవేటు వారి వద్ద అప్పు తెచ్చుకునే అవసరం ఉండేది కాదు. ఈ రోజు ఆత్మహత్య చేసుకోకుండా ప్రాణాలతో ఉండేవారు. వారి కుటుంబాలు వీధిపాలు కాకుండా ఉండేవి.
రైతుల ఆత్మహత్యలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే కారణం. తెలుగు దేశాన్ని అధికారానికి తెస్తే చట్ట ప్రకారం రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ రుణార్హత కార్డులు (ఎల్‌ఇసి) ఇచ్చి రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రతి కౌలు రైతుకూ లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణం ఇస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. అంతేగాక డాక్టరు స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, అప్పులన్నీ రద్దుచేసి రుణ విముక్తులను చేస్తామని చెప్పారు. అధికారానికి వచ్చిన టిడిపి ప్రభుత్వం గత 15 నెలల కాలంలో కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో వాస్తవంగా భూములను సాగుచేస్తూ అన్ని రకాల పంటలు పండిస్తున్నది కౌలు రైతులేనన్నది అందరికీ తెలిసిందే. దళితులు, వెనుకబడిన తరగతులు, ఇతరులలో పేదవారు కౌలు రైతులుగా ఉన్నారు. వీరికి స్వంత వనరులు లేవు. పెట్టుబడుల కోసం ఇతరులపై ఆధారపడి సాగుచేయాలి. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం రూ.49,755 కోట్ల పంట రుణాలు ఇవ్వగా 70 శాతం భూమిని సాగుచేస్తున్న కౌలు రైతులకు ఇచ్చింది కేవలం రూ.62 కోట్లు మాత్రమే. 2015-16 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 133.97 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టి రూ.69,549 కోట్లు పంట రుణాలు కేటాయించింది. నేటికి ఖరీప్‌ సీజన్‌ అయిపోయి రబీ సీజన్‌ వచ్చింది. ఇప్పటికి రాష్ట్రంలో కౌలు రైతులకు ఇచ్చింది రూ.45 కోట్లు మాత్రమే. గత అక్టోబరులో హుదూద్‌ తుపాన్‌ దాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కౌలు రైతులు పంటలు కోల్పోతే నష్టపరిహారం భూమి సాగు చేయనివారికి ఇచ్చారు. పంట వేసిన కౌలు రైతులు పంటకు కౌలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వారివద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చే ఈ కాలంలో కౌలు రైతులు పంటలు పండించారు. దీంతో కౌలు రైతులకు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చివుంటే ఉత్పత్తి ఖర్చులు తగ్గేవి.
ఈ కాలంలో గిట్టుబాటు ధరలు కాదు గదా కనీస మద్దతు ధరలు కూడా రైతులకు వచ్చేటట్లు ఈ ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయలేదు. గత సంవత్సరం ధాన్యం 75 కిలోల బస్తా కనీస మద్దతు ధర రూ.1,050 కాగా రైతులు రూ.700 నుంచి రూ.900 లోపు అమ్ముకున్నారు. పత్తి క్వింటా రూ.4,050 కాగా రైతులు రూ,2,500 నుంచి రూ.3,500 మధ్య అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. పామాయిల్‌, చెరకు, మొక్కజొన్న, పొగాకు పంటలను తక్కువ ధరకు వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా కొంటున్నా ప్రభుత్వానికి చలనం లేదు. రుణ మాఫీలో కూడా కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జీవో 174 ప్రకారం రాష్ట్రంలో రుణ అర్హత కార్డులు, జెయల్‌జిల ద్వారా గతంలో రుణాలు పొందిన కౌలు రైతులందరి రుణాలూ రద్దు కావాలి. రాష్ట్రంలో 2.25 లక్షల మంది కౌలు రైతులకు రూ.574 కోట్ల రుణాలున్నాయి. వీరందరూ రూ.50 వేల లోపు అప్పులున్నవారే. మొదటి దఫాలోనే వీరందరి అప్పు రద్దు కావాలి. కానీ మొదటి దఫాలో కేవలం 5 శాతం కౌలు రైతుల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. ఇప్పటికి సగం మందికి మాత్రమే రద్దయ్యాయి. రుణమాఫీలో తాత్సారం వల్ల గత రెండు సంవత్సరాలుగా కౌలు రైతులకు పంట రుణాలు రాలేదు. పూర్తిగా ప్రైవేటు వారి మీద ఆధారపడి పంటలు పండించాల్సిన దుస్థితి ఏర్పడింది. 2011లో నాటి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కౌలు రైతుల కోసం ''భూ అధీకృత సాగుదార్ల చట్టం-2011'' తెచ్చింది. ఆ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వమే భూ యజ మానుల ప్రమేయం లేకుండా కౌలు రైతుల గురించి వారికి రుణార్హత కార్డులిచ్చి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకు రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కౌలు రైతు వేసిన పంట హామీపై కౌలు రైతు స్వంత పూచీకత్తుపై బ్యాంకు రుణాలు ఇవ్వాలి. భూ యజమాని హక్కులకు ఏ మాత్రం భంగం కలుగకుండా కౌలు రైతులకు పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, బీమా, నష్టపరిహారాలు, మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని చాలా స్పష్టంగా చట్టంలో పేర్కొనబడింది. ఈ చట్టం అమలుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో స్టేకహేోల్డర్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ఉంది. ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని తాను అధికారంలోకి వస్తే కౌలు రైతులకు న్యాయం చేస్తానని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలపై గతంలో నియమించబడిన ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ కమిషన్‌, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులలో రాష్ట్రంలో కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్న విషయాన్ని, వారికి అన్ని హక్కులూ కల్పించాల్సిన అవసరాన్ని చెప్పాయి. 2011 ఆగస్టులో రిజర్వ్‌ బ్యాంకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు ఈ క్రింద విధంగా మార్గదర్శకాలు ఇచ్చింది. 2011 భూ అధీకృత చట్టం ప్రకారం ప్రతి కౌలు రైతుకు లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పించాలని, కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా బ్యాంకులే అవసరమైన పెట్టుబడి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా కౌలు రైతులకు అవకాశాలుంటే చంద్రబాబు ఏనాడూ కౌలు రైతులపై దృష్టి పెట్టలేదు. కౌలు రైతు సంఘం తరపున అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసి చర్చించటానికి ప్రయత్నం చేశాం. కానీ ఏనాడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యవసాయ మంత్రిని నాలుగుసార్లు కలిసి కౌలు రైతులకు కార్డులు, రుణాలు, ఇతరములు ఇవ్వాలని కోరాం. అయినా మంత్రిమండలిలోనూ, బ్యాంకర్ల కమిటీలోనూ చర్చించిన దాఖలాలు లేవు. చంద్రబాబు అధికారానికి వచ్చాక రైతుల ఆత్మహత్యలపై స్పందించలేదు. సెప్టెంబరు 16న పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం అమర్నిగూడెం గ్రామ పొగాకు రైతు సింహాద్రి వెంకటేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ''నీవు రైతుల కోసం ఏమీ చేయడం లేదు. నీ రక్షణ కోసం రూ.5.5 కోట్లు ఖర్చు పెట్టి బస్సు ఏర్పాటు చేసుకున్నావు. రైతుకు ఏ రక్షణా కల్పించలేదు. ఒక్కో బ్యారన్‌కు రూ.9 లక్షలు ఇస్తే బ్యారన్‌ను పడగొట్టి పొగాకు సాగు మానుకుంటాం. ఇవన్నీ చేయాలి. లేకపోతే రైతులందరి కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను'' అని చంద్రబాబుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి చంద్రబాబు స్పందించలేదు. ఆ ఉత్తరం పత్రికలలో ప్రచురణ అయ్యింది. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా సమాధానం రాకపోవడంతో సెప్టెంబరు 22న ఆ రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
ఇప్పుడు చంద్రబాబు ఆత్మహత్యలపై మాట్లాడుతున్నారు. కానీ ఆత్మహత్యలకు గల కారణాలు దాటవేస్తున్నారు. వాస్తవంగా కౌలు రైతుకు చట్ట ప్రకారం అన్ని హక్కులూ కల్పించి ఉంటే కౌలు రైతులు చనిపోయే వారు కాదు. ఆయన తప్పిదం వల్లనే ఇవన్నీ జరిగాయి. తన తప్పు ప్రజలకు తెలియకుండా ఉండటానికి చట్టాన్ని వక్రీకరించటం, బ్యాంకులు, ఇతరులపై నెపం వేస్తున్నారు. రబీ సీజన్‌లోనైనా కౌలు రైతులందరికీ రుణార్హత కార్డులు, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలివ్వాలి. కౌలు రైతుల రుణాలన్నీ వెంటనే పూర్తిగా రద్దు చేసి తిరిగి వారికి రుణాలు ఇవ్వాలి. కరువుకు తమ పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. తిరిగి పంటలు వేసుకోవడానికి విత్తనాలు, రుణాలు ఇవ్వాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటానికి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి.
- నాగబోయిన రంగరావు 
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం కార్యదర్శి)