మొక్కుబడి సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు మాటల యుద్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది మినహా ప్రజోపయోగ చర్చలు, తదుపరి కార్యాచరణకు ఎలాంటి స్థానం లేకపోవడం దారుణం. విపక్షానికి అవకాశమివ్వడం, విపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానాలివ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేయడం ప్రజాస్వామ్యంలో అధికారపక్ష కనీస బాధ్యత. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా స్ఫూర్తిని మరచిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారపక్షం ఎదురు దాడికి దిగితే వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యలపై సజావు చర్చ వైపు దారి మళ్లించాల్సిన విపక్షమూ దానికి భిన్నంగా వ్యవహరిస్తుండటంతో పుణ్యకాలం కాస్తా దూషణల పర్వానికే సరిపోయింది. ఫలితంగా అత్యంత విలువైన శాసనసభా కాలం, ప్రజాధనం వృథా అయ్యింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఎన్ని రాళ్లు విసురుకున్నా, భిన్నాభిప్రాయాలున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానం చేయడం మినహా ఒరిగిందేమీ లేదు. ఆ తీర్మాన సందర్భంగానూ ఫలవంతమైన చర్చకు బదులుగా వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది.
సమయాన్ని వృథా చేయడంలో అధికార ప్రతిపక్షాలు పోటీ పడ్డాయన్నది జగద్విదితం. కీలకస్థానంలో ఉన్న సిఎం సైతం సుదీర్ఘ ప్రసంగాలతో చర్వితచరణంగా చెప్పిందే చెప్పి కాల హరణానికి కారణమయ్యారు. గతాన్ని తవ్వుకుంటూ నిందారోపణలు చేసుకోవడం మీద, అల్పమైన అంశాలను వేలెత్తి చూపించుకోవడం మీద ఇరు పక్షాలూ కేంద్రీకరించాయి. వైఎస్‌ చిత్ర పటాన్ని అసెంబ్లీ లాంజ్‌లోంచి తొలగించడానికి సంబంధించి సుదీర్ఘ వాగ్యుద్ధం జరగడమే అందుకు మచ్చు తునక. ఏతావాతా ఈ ఐదు రోజుల్లో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కరువు, రాష్ట్ర ప్రజలకు అన్నంపెట్టే రైతన్నల ఆత్మహత్యలు, సామాన్యులకు ఊపిరి సలపనివ్వని ధరలు అన్నీ మరుగున పడిపోయాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రత్యేక హోదాపై సభ తీర్మానం చేసినా అధికార ప్రతిపక్షాల అసలు స్వరూపం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. రాష్ట్ర ప్రత్యేక హోదాకు సంబంధించి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూనే హోదా కంటే ప్యాకేజీ మేలని, హోదాతోనే అన్ని సమస్యలు తీరిపోవని సన్నాయి నొక్కులు నొక్కారే కానీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షం సైతం అదే మార్గంలో నడిచింది. 'హోదా'పై కేంద్రం అనుసరిస్తున్న మౌనంపైగానీ, బిజెపి నాన్చుడు వైఖరిపైగానీ ఒక్క మాట అనలేదు. అలాంటిది ఇవి రెండూ కలిసి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయడానికి కారణం భూ సేకరణపై ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకత, ప్రజా సంఘాల పోరాటాలు, ప్రతిపక్షాల ఒత్తిడే. ఈ కారణంగానే అమరావతిలో భూ సేకరణ బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. సోంపేటలోనూ అదే పరిస్థితి. దాంతో ఆత్మరక్షణలో పడిన రాష్ట్ర ప్రభుత్వం మరో దారి లేక అనివార్యంగా తీర్మానాన్ని తేవాల్సి వచ్చింది. సభ వెలుపల అనుకున్నది సాధించలేకపోవడంతో... సభ లోపల ఎదురుదాడి వ్యూహాన్ని అనుసరించింది. ప్రతిపక్షం దాన్ని గుర్తించి తిప్పికొట్టడంలో వెనకబడిపోయింది. ఇహ పట్టిసీమను ప్రభుత్వం సమర్థించుకుంటే ఈ విషయంలో ప్రతిపక్ష గందరగోళం బైటపడింది. ఇన్ని సమస్యల మధ్యన కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపి పబ్బం గడుపుకోవడం మరో వికృతాంశం.
ఒకేరోజు తొమ్మిది బిల్లులు ప్రవేశపెట్టడమే కాక ఆమోదింపజేసుకుని రికార్డు సృష్టించిన ఘనత అధికార పక్షానిది. కొన్ని బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడం విచిత్రం. చర్చ లేకుండా సభ ఆమోదించిన ఈ తీర్మానాల్లో కార్మిక చట్టాల సవరణ బిల్లు కూడా ఉండడం అత్యంత విచారకరం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేపట్టిన మరునాడే అదే తరహా బిల్లుకు సభ ఆమోద ముద్ర వేయడం ఘోరం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘటనలన్నీ ఏలికలకు అత్యంత సాధారణ అంశాలుగా కనిపించడం మాత్రం అమానవీయం. ఇటీవల పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన అమాయకులుగానీ, ఎలుకలు కొరికి ప్రాణాలు పోగొట్టుకొన్న పసివాడుగానీ, ర్యాగింగ్‌ కారణంగా చనిపోయిన రిషితేశ్వరిగానీ పాలకుల రాతి హృదయాలను కరిగించలేదు. బాధితులను ఆదుకోవడానికి ఆపన్నహస్తం అందించాల్సిన శాసనసభ పరుష పదజాలానికి వేదికైన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ తరహా వ్యాఖ్యలు ప్రజలకు అణు మాత్రం మేలు చేకూర్చని ప్రేలాపనలే. సమావేశాలు జరుగుతున్న తీరుపై పదే పదే విమర్శలు వస్తున్నా ఖాతరు చేయని ధోరణి ఏమాత్రం మంచిది కాదు. సభాపతి స్థానం కూడా విమర్శలకు గురికావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి దోహదం చేయదు. ఇప్పటికైనా ఉభయపక్షాలూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. భవిష్యత్తులోనైనా ఈ తరహా ధోరణి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికార విపక్షాలు వ్యవహరించాలి.