
దేశంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని సిపిఎం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. హక్కులు కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమీషన్‌లు సూచించిన విధంగా ముస్లింలను ఓబిసిిలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఎం ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం మారి పోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని ఆయన గుర్తు చేశారు. రంగనాథ్ మిశ్రా కమీషన్ సిఫార్సులు అమలు సాధ్యమైనవేనని, పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నిరూపించిందని గుర్తు చేశారు. సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలని నాటి లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం ప్రయత్నిస్తే కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే ముస్లింలకు రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ అమలు చేయడం సాధ్యమేనన్నారు. హక్కుల సాధనకు మైనార్టీలతో కలిసి సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు.