ముసుగు తొలగిన చంద్రబాబు..

''ఎట్‌ లాస్ట్‌ ది క్యాట్‌ ఈజ్‌ అవుట్‌ ఆఫ్‌ ది బ్యాగ్‌'' అనేది ఆంగ్ల సామెత. '' పిల్లి చివరికి సంచిలో నుంచి బయటపడింది'', అని దీని అర్థం. నిరంతరం అబద్ధాలు చెబుతూ, ఎదుటి వారిని మోసం చేస్తూ బతికేవారి నిజస్వరూపం బట్టబయలైనప్పుడు ఈ సామెతను ఉదహరి స్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సామెత అతికి నట్లు సరిపో తుంది. రాజధాని భూ సమీకరణకు సంబంధిం చి నిన్నటి వరకు ఆయన చెప్పిన మాటలు, నిన్న చేసిన ప్రకటన చూస్తే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారో స్పష్టమౌతున్నది. ''రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు అమ్ముతామని, ఆ వచ్చే లాభాలను అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి బదలాయి స్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకసారి భూమిని కేటాయించాక దాన్ని ఏంచేసుకోవాలనే హక్కు ఆయా కంపెనీలకే ఇస్తామన్నారు... అక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఎక్కడ కోరుకుంటే అక్కడ మార్కెట్‌ రేటుకు స్థలాలను విక్రయిస్తామని చెప్పారు... కంపెనీలు చేసే అభివృద్ధి, వాటి అవసరాలకు అనుగుణంగా అవసరమైతే మాస్టర్‌ ప్లానులో మార్పులుంటాయని'' తెలిపారు.
రాజధాని నిర్మాణం గురించి ఇప్పటి వరకు చంద్రబాబు చెబుతున్న మాటలకు, ఈ మాటలకు ఏ మాత్రం పొంతన లేదు. రాజధానిని సీడ్‌ క్యాపిటల్‌, క్యాపిటల్‌ సిటీ, క్యాపిటల్‌ రీజియన్‌గా మూడు దశలుగా నిర్మిస్తామని, ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ఇప్పటి వరకు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా 35,000కు పైగా ఎకరాల భూమిని సమీకరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 48 మండలాలు, 11 మునిసిపాలిటీలను రాజధాని పరిధిలోకి తీసుకొచ్చారు. సీడ్‌ క్యాపిటల్‌ 2,000 ఎకరాల్లో ఉంటుందని చెప్పారు. మిగతా ప్రాంతంలో ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు, టూరిస్టు ప్రాంతాలు, పార్కులు, నివాస ప్రాంతాలు, తదితరాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నామని, అందుకు సింగపూర్‌ ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి ఇస్తున్నదని, రాజధాని ప్రాంతంలో ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తామని, అందుకు అడ్డం వచ్చే గ్రామాలను తొలగిస్తామని చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లోని పెరిగిన గ్రామకంఠాల భూమిని కూడా తీసుకుంటామని, లేకపోతే ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలుం డవని అన్నారు. ఆయన, ఆయన మంత్రివర్గంలోని అతిము ఖ్యులు, యంపిలు, యంయల్‌ఎలలో వ్యాపారం చేయటం లో నైపుణ్యం ఉన్న, శతకోటీశ్వరులుగా ఉన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో కలిసి అనేకసార్లు సింగపూర్‌ పర్యటన చేసివచ్చారు. ప్రణాళికాబద్ధంగా రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నదని, ఆ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం జరుగుతుందంటున్నారు. కానీ ఇప్పుడు రాజధాని కోసం సమీకరించిన భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు అమ్ముతానని, కంపెనీలు ఎక్కడకావాలంటే అక్కడే భూమినిస్తామని చెబుతున్నారు. భూమిని కంపెనీ లకు అమ్మిన తర్వాత దాన్ని ఏం చేసుకుంటారనేది వారి ఇష్టమని తెలిపారు. రాజధాని ప్రాంతంలో కంపెనీలు భూమిని వారిష్ట ప్రకారం వినియోగించుకుంటే రాజధాని నిర్మాణం ప్రణాళికాబద్ధంగా ఎలా జరుగుతుంది? ప్రణాళికా బద్ధంగా రాజధాని నిర్మాణం జరగనప్పుడు ప్రణాళిక అం టూ మాటిమటికీ మంత్రులు, వాణిజ్య పుంగవులను వెంట వేసుకొని సింగపూర్‌ వెళ్ళటంలో అర్థం ఏమిటి? తీసుకున్న భూములను అమ్ముకుంటే వచ్చే లాభాలను పంచుకోవటం కోసం తగిన ప్లాన్‌ రూపొందించుకోవటానికి సింగపూర్‌ పర్యటనలు మినహా నిజంగా రాజధానికి ప్రణాళికను రూపొందించటానికే అయితే సింగపూర్‌ వరకు వెళ్ళనవసం లేదు. సింగపూర్‌ రూపొందించే ప్రణాళికను తలదన్నే అద్భుతమైన ప్రణాళికను రూపొందించగల నిపుణులు మన రాష్ట్రంలోనే, మన విజయవాడలోనే ఉన్నారు.
రాజధాని, రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి అంటూ ఇంతకాలం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వ్యాపారం కోసమే భూములు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భూ వ్యాపారంలో రైతులను సమిధలుగా చేసి చంద్రబాబు, ఆయన అనుంగు సహచరులు లాభాలను పంచుకొంటారు.
రాజధాని ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధి కోసం 15 లక్షల ఎకరాలను సేకరిస్తామని చెబుతున్నారు. వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, తదితరాల కోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేస్తానని ప్రకటించి భూ సేకరణకు పూనుకున్నారు. వాస్తవంలో రాష్ట్రంలో వస్తున్న పరిశ్రమలు అతితక్కువగా ఉన్నాయి. అయినా లక్షలాది ఎకరాల భూములను సేకరించటం భూ వ్యాపారం కోసమే కాని పరిశ్రమల కోసం కాదు. వస్తున్న పరిశ్రమలకు కూడా అవసరమైన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ భూమిని సేకరిస్తున్నారు. బందరు పోర్టుకు గతంలో 2,000 ఎకరాలు సరిపోతుందని చెప్పిన తెలుగుదేశం ఇపుడు 31,800 ఎకరాలు సేకరించటానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒక్కసారిగా భూముల అవసరం 15 రెట్లకు మించి పెరిగిందా?
ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు?
నోటిఫికేషన్‌ జారీచేసిన గ్రామాలలోని రైతుల దుస్థితిని పరిశీలిస్తే గుండె తరుక్కుపోతున్నది. భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన గ్రామాలలోని రైతుల గోడు హృదయవిదారకంగా ఉన్నది. తమ భూములను సేకరిస్తామని నోటీసులు జారీచేసినందున తమ పిల్లలకు వచ్చిన పెళ్ళి సంబంధాలు వెనక్కుపోతున్నాయని భోగాపురం విమానాశ్రయ బాధితులు చెప్పారు. గతంలో తాము చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని, తమ భూములు కొనటానికెవరూ ముందుకురావటం లేదని అన్ని చోట్లా బాధితులు గొల్లుమంటున్నారు. తీవ్రంగా అనారోగ్యా నికి గురై ఆస్పత్రులకు వెళ్ళాల్సివచ్చినా అప్పు పుట్టక పోవటంతో వైద్యం చేయించుకోలేకపోతున్నామని బాధితు లు చెబుతున్నారు. ఈ విధమైన ఇబ్బందులు ఒకవైపు కొన సాగుతుండగా, బందరుపోర్టు భూమికి నోటిఫికేషన్‌ విడుదల చేసిన గ్రామాలలో ఒకటైన పెడన మండలం, కాకర్లమూడి గ్రామానికి చెందిన లింగం వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ అవసరాల కోసం ఆయనకు డబ్బులు కావలసి వచ్చాయి. అప్పుకోసం ప్రయ త్నిస్తే గ్రామంలో ఎక్కడా దొరకలేదు. వరి ప్రయత్నంగా తనకున్న పది సెంట్ల భూమిని ఆయన బేరం పెట్టారు. భూ సేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉండటంతో ఆ భూమిని కొనటానికి ఎవరూ ముందుకురాలేదు. ఇటువంటి స్థితిలో దిక్కుతోచని స్థితిలో గురువారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందాడు. ఇది ఆత్మహత్యా? ప్రభుత్వం చేసిన హత్యా? భూ దాహంతో ఉన్న, రైతుల భూములను అక్రమంగా ఆక్రమించుకొని, అమ్ముకొని లాభాలు సంపాదించటానికి పూనుకున్న ప్రభుత్వం ఇటువంటి ఆత్మహత్యలకు బాధ్యత వహించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 
ప్రభుత్వ భూ సేకరణ ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామికాభివృద్ధి కోసం సేకరిస్తానని చెబుతున్నది. ఇలా సేకరించిన భూమిని భూ బ్యాంకులో పెడతామని చెబుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను బట్టి చూస్తే ప్రభుత్వం సేకరించిన భూమిని లాభాల కోసం అమ్ముతుందని స్పష్టం అవుతున్నది. రైతుల భూములను కొల్లగొట్టి, ముఖ్యమంత్రి, ఆయనకు కావలసినవారు వ్యాపారం చేస్తారు. ప్రభుత్వానికి ఆదాయం సంపాదించటం, రాష్ట్రాభివృద్ధి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి లాభాలు తమ జేబులో వేసుకొంటారు. అభివృద్ధి ముసుగులో భూ దోపిడీ చేస్తారు. పిండారీలను మించిన దారుణమైన దోపిడీకి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అందుకోసం నిధులు సమీకరించాలి. ఇందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకోవాలి. మన రాష్ట్రానికి రావలసిన నిధులు, పన్నుల్లో వాటాను రాబట్టటానికి గట్టి ప్రయత్నం చేయాలి. అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేంద్రంతో వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌ అధినాయ కత్వంతో వ్యవహరించే తీరుకన్నా అధ్వానంగా ఉన్నది. ఢిల్లీ వెళ్ళివచ్చి ఏదో సాధించినట్లు ఘనంగా ప్రచారం చేసు కోవటం మినహా అక్కడ ఈయనను ఎవరూ పట్టించు కోవటం లేదని స్పష్టమౌతున్నది. ఇటువంటి స్థితిలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను కదిలించి, ఉద్యమానికి సన్నద్ధం చేయాలి. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను రాష్ట్రంలోనే సమీకరించుకోవాలి. రాష్ట్రంలో వివిధ రంగాలు, ముఖ్యంగా విపరీతమైన లాభా లు సంపాదిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై పన్నులు వేయాలి. ఇసుకను, ఇతర గనులను ప్రభుత్వమే నిర్వహిస్తూ, లాభాలను అభివృద్ధికి వినియోగిం చాలి. వివిధ రకాల అక్రమ వ్యాపారులపై పన్నులు వేస్తే రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. 
ఇటువంటి మార్గాలను వదలివేసి, రాష్ట్రాభివృద్ధి కోసం రైతుల నుంచి భూములు లాక్కొని అమ్ముకొంటామంటే రైతులు, రాష్ట్ర ప్రజలు సహించరు. ఇదే మార్గంలో చంద్రబాబు ముందుకుపోతే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది.

-- ఎ.కోటిరెడ్డి