మురికివాడల్లో సమస్యల తిష్ట సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నగరంలో మురికివాడల్లో సమస్యలు తిష్ట వేశాయని, టిడిపి తన ఎన్నికల వాగ్దానాలు మరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. 24వ తేదీ వరకు నగరంలో సిపిఎం నిర్వహించే పాదయాత్రలు ఆదివారం సంగడిగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్‌ వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో పాశం రామారావు మాట్లాడుతూ టిడిపి తన మ్యానిఫెస్టోలో పేదలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇస్తామని రెండున్నరేళ్ల పరిపాలనలో ఒక్క సెంటు కూడా పంపిణీ చేయలేదన్నారు. నగరంలో 35 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల సమస్య ఉందన్నారు. మరో 5 వేల కుటుంబాలు రైల్వే ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారని, ఆయా స్థలాలకు పట్టాలు మంజూరు చేసి, కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. గుంటూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా నెలాఖరు వరకు 26 బృందాలు పాదయాత్రలు చేస్తున్నాయన్నారు. నల్లధనాన్ని రప్పించటంలో విఫమవటంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు పెద్ద నోట్లు రద్దు చేశారని, దీనివల్ల ఒరిగేదీ లేదన్నారు. బడాబాబులకు ముందుగానే నోట్ల రద్దు సమాచారం అందచేయటంతో వారంతా జాగ్రత్త పడ్డారని, సామాన్యులే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగర శివారు కాలనీల్లో మురుగు కాల్వలు, రోడ్లు, తాగునీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో మెగా వాటర్‌ ప్రాజెక్ట్‌ పూర్తికాకపోగా గుంతలు మాత్రం మిగిలాయని ఎద్దేవా చేశారు.