మున్సిపల్‌ సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు కుట్రలు

 మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమ్మె గురువారానికి ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పోరాటం ఉధృత రూపం దాలుస్తోంది. అయితే సమ్మె డిమాండ్లు పరిష్కరించి, సమ్మెను నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్‌ శాఖా మంత్రి డాక్టర్‌ నారాయణకు 'రాజమండ్రి పుష్కరాలు' లేదంటే జపాన్‌, సింగపూర్‌ల పర్యటనలకే కాలం సరిపోతుంది తప్ప, వేలాది దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల ఆకలి కేకలు పట్టించుకునే తీరికలో లేరు. నగరాలు, పట్టణాలన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. మరోవైపు వర్షాలు తోడవడంతో పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితిలో ''ప్రపంచ మేధావిని' అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యానికి ఏర్పడే ముప్పును దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాల జెఎసి నాయకత్వాన్ని చర్చలకు పిలవకపోవడం, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించేందుకు పూనుకోకపోవడం ఆయనలోని కార్మిక వ్యతిరేకతకు అద్దం పడుతోంది.
కార్మికులు కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదు, చట్టబద్ధమైనవి. ప్రభుత్వాల చేత నియమించబడిన వేతన సవరణ సంఘాల సిఫార్సులు, ఒక కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం రూ.15,000 ఉండాలని ఆరోగ్యవేత్తలు చేసిన సూచనలు మాత్రమే కార్మికులు కోరుతున్నది. అదీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం పర్మినెంట్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఇచ్చిన జీవోలు 46, 47, 48, 49 ప్రకారం, తమకు కూడా వేతనాలు ఇవ్వమనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు కోరుతున్నది.
అందులో గత 9వ పిఆర్‌సి సిఫార్సు చేసిన కనీస వేతనం రూ.6,700 నాటి ప్రభుత్వాలు అమలు చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చిన సందర్భంలో మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు కూడా నెలకు రూ.1,600 వేతనాలు పెంచారు. వీటన్నింటి దృష్యా 10వ వేతన సవరణ సంఘం సిఫార్సులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్‌, కరువు భత్యం (డిఏ) తమకు కూడా వర్తింపజేయమని కార్మికులు కోరుతున్నారు. మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల రాష్ట్ర జెఎసి అడుగుతున్న కనీస వేతనం రూ.15,433 శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయించబడిందే తప్ప, కాకిలెక్కల్తో వేసింది కాదు.
ఆర్థిక మంత్రి యనమల 'తిరకాసు సూత్రం'
మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల రాష్ట్ర జెఎసి నాయకులతో 2015 జులై 11న రాజమండ్రిలో జరిగిన చర్చల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల చిత్రగుప్తుడి లెక్కలతో 'తిమ్మిని బమ్మిని-బమ్మిని తిమ్మిని' చేయాలని ప్రయత్నించారు. ''ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు పిఆర్‌సి వర్తించదు'' అని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. గత 9వ పిఆర్‌సి సందర్భంగా ఇచ్చారు కదా అంటే దానికి మంత్రి నోటి నుంచి మాటలేదు. రాష్ట్రంలోని లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు ఆర్థిక మంత్రి జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్రంలో తొలుత మున్సిపల్‌ కార్మికులు వేతనాల పెంపు కోసం ఉద్యమం ప్రారంభించారు గనుక వారి పోరాటాన్ని దెబ్బతీస్తే ఇతర రంగాల వారికి కూడా మొండి చెయ్యి చూపవచ్చు అనేది ఆర్థిక మంత్రి కుయుక్తులు.
మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు అసలు గవర్నమెంటు మనుషులు కాదు, వీరితో మేము మాట్లాడాల్సిన పని లేదు అంటూ మంత్రి తన నోటి దురుసుతనాన్ని వెళ్లగక్కారు. మున్సిపల్‌ కార్మికులు నిద్రలేచింది మొదలు మరలా నిద్రించే వరకు ఊడిగం చేసేది స్థానిక సంస్థలకు. స్థానిక సంస్థలు గవర్నమెంటులో భాగం కాదా? ఆ స్థానిక సంస్థలలో పనిచేసే కార్మికులు ఎవరి తరఫున పని చేస్తున్నారు? ఈ ప్రభుత్వాల తరఫున కాదా? 'తాము దుమ్ము ధూళి పీల్చుకొని, మురుగు వాసన భరిస్తూ, అనారోగ్యం పాలవుతూ, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నది మున్సిపల్‌ కార్మికులే కదా! వారిని గవర్నమెంటు మనుషులు కాదంటూ అవమానపర్చడం మంత్రి అవివేకానికి నిదర్శనం.
ఆర్థిక మంత్రి జిత్తులు
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు గవర్నమెంటు మనుషులు కాదని చెప్పిన నోటితోనే, 'పుష్కరాలు వచ్చాయి గనుక సమ్మెను విరమించండి' అంటూ కార్మికులకు విన్నపాలు చేశారు. అంతేగాక వేతనాల గురించి ప్రస్తావిస్తూ, తాము బేరాలు ఆడతామంటూ ఇప్పుడిస్తున్న రూ.8,300లకు అదనంగా రూ.1,000 లేదా రూ.2,000 కంటే ఒక్క పైసా కూడా పెంచమంటూనే, మీరు అడిగిన రూ.15,000 అసలు ఇవ్వడం కుదరదన్నారు. తాము బేరగాళ్లమనే వాస్తవాన్ని కార్మికుల దగ్గర మంత్రి ఒప్పుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పాలకులు అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ప్రపంచ బ్యాంకుకు, బహుళజాతి సంస్థలకు కుదువపెట్టే బేరగాళ్ళు కదా!
సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్రలు
మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. చెత్తాచెదారం అంతా ఎక్కడిది అక్కడ పేరుకుపోయి గుట్టలుగుట్టలుగా పోగవుతోంది. డ్రైనేజీ కాల్వలు పారుదల లేక నిలిచిపోతున్నాయి. మంచినీరు, 
విద్యుత్‌ వంటి అత్యవసర సర్వీసులలో పని నిలిచిపోయింది. రోజు రోజుకూ అనేక కొత్త సెక్షన్లలోకి సమ్మె విస్తరిస్తోంది. పర్మినెంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఒకరికొకరు బాసటగా నిలబడ్డారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. దీంతో ఎలాగైనా మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే తలంపుతో సామ, దాన, భేద, దండో పాయాలన్నింటినీ ప్రయోగించేందుకు సిద్ధమైంది.
మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వం మున్సిపల్‌ సమ్మెను అణచివేసేందుకు ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దింపుతున్నది. ఇద్దరు చంద్రులది కార్మికుల విషయంలో ఒకేదారి. కార్మిక పోరాటాలను అణచివేయడమే! నాశనం చేయడమే. సమ్మెలో నుంచి పర్మినెంట్‌ ఉద్యోగులను వెనక్కిలాగేందుకు తొలుత వారిపై బెదిరింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. సమ్మె నుంచి విరమించుకోకపోతే సర్వీస్‌ బ్రేక్‌ అవుతుందని, ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ నష్టపోతారంటూ కమిషనర్లు, ఛైర్మన్‌లు, మేయర్లతో రహస్య సమావేశాలు జరిపి లొంగదీసేందుకు ప్రయత్నిస్తున్నది. పోటీ కార్మికులను తెచ్చి కాంట్రాక్టు కార్మికులను బెదరగొట్టాలని చూస్తున్నది. కొన్ని జిల్లాల్లో ఒక్కో రోజుకు రూ.1,000 ఇస్తామంటున్నారు. మరికొన్ని జిల్లాల్లో నెలకు రూ.10,000 జీతం, పర్మినెంట్‌ చేస్తామంటూ పోటీ కార్మికులను మభ్యపెట్టి తీసుకొచ్చి పనులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నారు. పట్టణాలలో 'సామాజిక' కార్యకర్తలకు ఆశలు చూపిస్తూ వారి ద్వారా డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలను తెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతేగాకుండా పోలీసులను పెద్దఎత్తున రంగంలోకి తెచ్చి వారి అండతో పోటీ కార్మికులతో పని చేయించేందుకు తెగబడుతున్నారు. పోటీ కార్మికులను అడ్డుకొని, వెనక్కి తిప్పిపంపుతున్న కార్మికులను, వారి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు.
పై వాటన్నింటినీ తలదన్నే విధంగా ''తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అనేక చోట్ల వీరంగం చేస్తున్నారు. ఏలూరులో స్థానిక టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలాగా వ్యవహరించి మహిళా కార్మికులపై చేయి చేసుకొని, కులం పేరుతో దూషించాడు. నెల్లూరులో స్థానిక 7వ వార్డు కార్పొరేటర్‌, ఆయన సోదరుడు (శానిటరీ మేస్త్రీతో) తమ అనుచరులతో కలిసి మహిళా కార్మికులను కొట్టడం, అవమానపర్చడం వంటి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల అవరోధాలు సృష్టించినా, సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలను కార్మికులు ఐక్యతతో తిప్పికొడుతున్నారు. అర్ధరాత్రుల్లో సహితం మహిళా కార్మికులు 'గస్తీలు' తిరుగుతూ, సమ్మె విచ్ఛిన్నకులను తరిమికొట్టడం ఈ పోరాటంలో చెప్పుకోదగ్గ విషయం. తెలుగుదేశం శ్రేణుల నిరంకుశ ధోరణులను, దాడులను, దౌర్జన్యాలను ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతున్నారు. ఐక్య పోరాటాలే విజయం సాధించి పెడతాయని విశ్వసిస్తున్నారు.
రాష్ట్రంలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు వేలాది మంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని రోడ్డెక్కి నినదిస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం విచారకరం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో మోడీ 'స్వచ్ఛ భారత్‌'తో స్వరం కలిపిన చంద్రబాబుకు, ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో సమిధలవుతున్న మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల వెతలు తీర్చే తీరిక లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే వారికి కావలసింది ఎర్రతివాచీల మీద నడిచే పెద్ద పెద్ద బడాబాబులు, కార్మికుల రక్తమాంసాలు పీల్చి మదుపుటేనుగుల్లా బలిసిన కోట్లాధిపతులు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పట్ల నిద్రావస్థలో ఉన్న ముఖ్యమంత్రిని మేల్కొల్పాలనే లక్ష్యంతో మున్సిపల్‌ ఉద్యోగుల, కార్మికుల రాష్ట్ర జెఎసి ఈ నెల 17న (శుక్రవారం) విజయవాడ సిఎం క్యాంప్‌ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చింది. దీనితోనైనా ముఖ్యమంత్రి స్పందిస్తారేమో ! వేచిచూద్దాం!!
- కె ఉమామహేశ్వరరావు 
(వ్యాసకర్త ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి)