
ప్రభుత్వ రంగ బ్యాంకులకు శఠగోపం పెట్టిన విజయ్ మాల్యాపై రాజ్యసభలో సోమవారం రభస జరిగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలోనే విజయ్ మాల్యా భారీగా బ్యాంకు రుణాలు పొందారన్నారు. గత దశాబ్దంలో విపరీతంగా రుణాలు విజయ్ మాల్యాకు ఎలా లభించాయో కాంగ్రెస్ చెప్పాల్సి ఉందన్నారు.కాంగ్రెస్ స్పందిస్తూ ‘‘మీరు రుణం ఇవ్వండి... నన్ను ఒంటరిగా వదిలేయండి’’ అనే వైఖరిని మాల్యా అనుసరిస్తున్నారని, అందుకే మీడియాతో సహా అందరిపైనా దాడి చేస్తున్నారని విమర్శించింది. ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్‌ను నిలిపేయాలని, లలిత్ మోడీ, విజయ్ మాల్యా కేసుల్లో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లుకౌట్ నోటీసు అంటే ‘‘మీరు చూడండి.... నేను పారిపోతాను’’ అని మోడీ ప్రభుత్వం అనుకుంటోందని ఎద్దేవా చేసింది.