మార్గదర్శి కొరటాల..

               భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యన్నారాయణ. ఆనాటి విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన ఎంబి, ఎంహెచ్‌, ఎల్‌బిజిల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేద ప్రజల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. ఆయన రేపల్లె డివిజన్‌ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. చేనేత కార్మికులు కొరటాలను తమ వాడిగా చెప్పుకున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి అసమానమైనది. లంకభూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి పేద ప్రజలను సొసైటీలుగా ఏర్పాటు చేసి భూస్వాముల అధీనంలో లంక భూములను పేదలు సాగుచేసుకునేందుకు అనేక పొరాటాల ద్వారా సుసాధ్యం చేశారు. గుంటూరు జిల్లాలో రైతాంగ ఉద్యమ నాయకులుగా పేద రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. నాగార్జునసాగర్‌ నిర్మాణానికై కమ్యూనిస్టు పార్టీలోని ఇతర నాయకులతో కలిసి అనేక పోరాటాలు నిర్వహించారు.
               రైతాంగ పోరాటాల ఉధృతిని తట్టుకోలేక నాటి కేంద్ర ప్రభుత్వం నాగార్జున సాగర్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఆయన గణనీయమైన కృషిచేశారు. జై ఆంధ్ర, జై తెలంగాణ వేర్పాటువాద ఉద్యమాలను వ్యతిరేకించి పార్టీ నిర్ణయాలను అనుసరించి సమైక్యాంధ్రకై కట్టుబడి పోరటాలు నిర్వహించారు. 1964 లోనూ, 1968 లోనూ కమ్యూనిస్టు ఉద్యమాలు చీలికలు ఏర్పడినప్పుడు జిల్లాలో సిపిఎంను నిలబెట్టేందుకై సైద్ధాంతిక పోరాటం నిర్వహించారు. సమస్యలను అధ్యయనం చేయడంలో ఆయన శైలే ప్రత్యేకమైనది. గుంటూరు ఘంటారావం పేరుతో సిపిఐ(యం) గుంటూరు జిల్లా నాయకత్వం 40 రోజులపాటు 1,906 కిమీ దూరం పాదయాత్ర చేసి ముగింపు సందర్భంగా మార్చి 2న గుంటూరులో జరిపిన బహిరంగ సభలో చేసిన ఉపన్యాసమే ఆయన ఆఖరి ఉపన్యాసం కావడం విచారకరం.
నేను ఇంటర్మీడియెట్‌ చదువుతున్న రోజుల్లో 1971లో మొట్ట మొదటిసారి గుంటూరులోని సిపిఎం ఆఫీసులో కొరటాలను కలిశాను. ఆ తరువాత ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ ఆయనను అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవాడిని. ఒకసారి చెప్పిన విషయాన్ని ఆయన మరచిపోయేవారు కాదు. విద్యార్థులను, యువకులను ఉద్యమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించేవారు. నేటి యువతరానికి ఆయన ఆదర్శప్రాయుడు.
1989 జనవరిలో సిపిఎం అఖిల భారత మహాసభ విజయవాడలో జరిగింది. గుంటూరు నుంచి 30 మంది కార్యకర్తలం వాలంటీర్లుగా విజయవాడ వెళ్ళాము. కొరటాల, పరుచూరి నాగేశ్వరావు వంట విభాగం ఇన్‌ఛార్జీలుగా ఉన్నారు. మమ్మల్ని వంట విభాగంలో పనిచేయమన్నారు. కొరటాల డైరెక్షన్‌లో మేము పని చేశాము. సుందరయ్యగారు తరచుగా వంట విభాగాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. ఆ సందర్భంగా అన్ని రాష్ట్రాల నాయకులను కలిసే అవకాశం మాకు లభించింది. అనేక మంది ప్రతినిధుల నిరాడంబరతను చూసి మేము ఆశ్చర్యపోయాము. వారు మాతో చాలా కలివిడిగా మాట్లాడేవారు. మేము చాలా ఉత్తేజం పొందాము. యువకులు ఎదురైనప్పుడు కొరటాల ఏరాబాబూ, బాగున్నావా, ఏం చేస్తున్నావ్‌ అని భుజం మీద చేయివేసి ఆప్యాయంగా పలుకరించేవారు.
                  రేపల్లె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 1962, 1978లలో రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అనర్గళంగా ఉపన్యసించేవారు. ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నడిపేవారు. విద్యార్థి, యువజన, మహిళా నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని పోరాట పథంలో నడిపేందుకు కృషి చేశారు. వారి వ్యక్తిగత సమ్యలను తెలుసుకుని పరిప్కారం కొరకు అనేక సూచనలు ఇచ్చేవారు. కొరటాల కలిసినప్పుడల్లా గుంటూరు ఉద్యమ వివరాలు తెలుసుకుని జిల్లాలో ఉద్యమం బలపడేందుకు సలహాలిచ్చేవారు. రాష్ట్రంలో సిపిఎం బలపడేందుకు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి గైడెన్స్‌ ఇచ్చేవారు. ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దారు. లోటుపాట్లను సరిచేసుకునేందుకు సలహాలు ఇచ్చేవారు. తాను కేన్సర్‌తో మరణిస్తానని తెలిసి కూడా కొంచెమన్నా విచారించక తనను పరామర్శించటానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు ఉద్యమాల గురించి సూచనలు ఇస్తుండే వారు. చివరకు ఆ జబ్బుతోనే ఆయన 2006 జులై ఒకటిన కన్నుమూశారు. ఆయన ఏ ఆశయ సాధనకై జీవితాన్ని త్యాగం చేశారో ఆ ఆశయాలను ముందుకు తీసుకు పోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
కొండా రామిరెడ్డి