
రాష్ట్రంలోని సుమారు 40 వేల మంది జీవనాధారాన్ని దెబ్బతీసే జీవో 279కి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజధాని విజయవాడ నడిబొడ్డున వేలాది మంది కార్మికులు గొంతెత్తి 'మాపొట్టలుగొట్టొద్దు' అంటూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినదించారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్మికులకు బదులు పనినే కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు వీలుగా జారీ అయిన 279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ జీవో 279పై బహిరంగ చర్చ కు టిడిపి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. పేద కార్మికుల వేతనాలు పెంచని ప్రభుత్వం, ఎమ్మెల్యేల జీతాలను ఎలా పెంచుతుందని వైఎస్‌ఆర్‌టియు రాష్ట్ర నాయకులు గౌతంరెడ్డి ప్రశ్నించారు.