'మాన్సాస్‌' భూములు దివీస్‌కు విక్రయంపై న్యాయ విచారణ

మాన్సాస్‌ ట్రస్టు భూములు 99 ఎకరాలు దివీస్‌ లేబొరేటరీకి విక్రయించడంపై న్యాయవిచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్‌పిఆర్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, బీమిలి డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దివీస్‌కు తాకట్టుపెట్టిందని విమర్శించారు. ఇక్కడ ప్రజాభిప్రాయసేకణ నిర్వహించకుండా విస్తరణ నిర్మాణపనులు చేపడుతున్న దివీస్‌కు విజయనగరం జిల్లా జి.చోడవరంలో పేదలు సాగుచేసుకుంటున్న అస్సైన్డ్‌ భూములు 43.18 ఎకరాలు అప్పగిస్తూ ఈ నెల ఒకటిన ప్రభుత్వం జిఒ 43 విడుదల చేసిందని తెలిపారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయని యాజమాన్యంపై చర్య తీసుకోకుండా
ప్రభుత్వం వెనకేసుకొస్తుందన్నారు. రూ.847 కోట్లు నికర లాభాలు ఆర్జించిన దివీస్‌ యాజమాన్యం సిఎస్‌ఆర్‌ నిధులు రెండు శాతంతో భూగర్భ జలాలు కలుషితమైన గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. ఏడువేల మంది ఉద్యోగుల్లో స్థానికులకు ఒక్క శాశ్వత ఉద్యోగం కూడా కల్పించలేదని వివరించారు. దివీస్‌ కాలుష్యం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, ప్రజలు వివిధ రోగాలబారినపడుతున్నారని తెలిపారు. దివీస్‌ యాజమాన్యం వెంటనే విస్తరణ పనులు నిలిపివేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం జెడ్‌పిటిసి సభ్యుడు కోడె అప్పారావు ప్రజలపై తప్పుడు ఫిర్యాదులు చేసి కేసులు పెట్టించి యాజమాన్యానికి సహకరించడం మానుకోవాలని హితవుపలికారు. కంపెనీ యాజమానికి కాపలాదారునిలా వ్యవహరిస్తే బతుకులు పోతున్న ప్రజల ఆగ్రహానికి గురికావాల్సివస్తుందని హెచ్చరించారు.