మాజీ సైనికోద్యోగులకు అండగా సిపిఎం

 'ఒక ర్యాంక్‌కి ఒక పెన్షన్‌' అంటూ మాజీ సైనికోద్యోగులు చేస్తున్న సుదీర్ఘ డిమాండ్‌కు తమ పూర్తి మద్దతు, సంఘీభావం ఎల్లప్పుడూ వుంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. గత నెల 14వ తేది నుండి ఇక్కడ జంతర్‌మంతర్‌ వద్ద వారు చేస్తున్న ధర్నాకి, నిరవధిక రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఏచూరి ఒక లేఖ రాశారు. ఈ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత కోసం సాయుధ బలగాలు ఎనలేని త్యాగాలు చేశాయని ఆయన ఆ లేఖలో కొనియాడారు. ఒక ర్యాంక్‌ ఒక పెన్షన్‌ డిమాండ్‌ చేసినపుడు మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సూత్రప్రాయంగా సమర్ధించాయని, సిపిఎం కూడా చట్టబద్ధమైన ఈ డిమాండ్‌కు మద్దతును పునరుద్ఘాటిస్తూనే వచ్చిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామంటూ ఎన్నికలకు ముందు బిజెపి నిర్దిష్టంగా హామీలు కూడా ఇచ్చిందన్నారు. వాస్తవానికి ఆనాడు ప్రధాని అభ్యర్ధి అయిన నరేంద్ర మోడీ హర్యానాలో మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే డిమాండ్‌ను అమలు చేస్తామని గట్టిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ వివిధ వర్గాలకు ఇచ్చిన అనేకానేక ఎన్నికల హామీల్లానే ఇది కూడా వెనుకబడిపోయిందని ఆ లేఖ పేర్కొంది. దాంతో తమ చట్టబద్ధమైన డిమాండ్‌ పరిష్కరించుకునేందుకు గానూ వారు ఆందోళనకు దిగారని లేఖ తెలిపింది. ఈ సమయంలో వారికి తమ పార్టీ పూర్తి మద్దతును ఇస్తోందని, వారి ఆందోళనకు సంఘీభావాన్ని తెలియచేస్తోందని ఏచూరి తెలిపారు. ఈ డిమాండ్‌ను సాకారం చేసే దిశగా పార్లమెంట్‌ లోపల, వెలుపల పోరాడతామని, వారికి అండగా నిలుస్తామని ఏచూరి హామీ ఇచ్చారు.