మసకబారుతున్న మోడీ ''ప్రభ''

2013, 2014 సంవత్సరాల్లో 'హర, హర మోడీ' నినాదాలు దేశంలో మిన్నంటాయి. బిజెపిపై మోజుకంటే కాంగ్రెస్‌కు పట్టిన బూజు చూసి జనం (31 శాతమే) బిజెపికి ఓటేశారు. 'జనం' అంటే ఏ జనం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంబానీలు, అదానీల గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సంవత్సరంలో మోడీ తిరిగిన 18 దేశాలకూ దేశంలోని పెట్టుబడిదారులను వెంటేసుకుని వెళ్ళారు. ఆస్ట్రేలియా, మంగోలియాకు అదానీని ప్రత్యేకంగా తీసుకెళ్ళారు. అందుకే అనుకుంటా ఆ బృందంలోని సభ్యుల వివరాలు ఇవ్వమని ఆర్‌టిఐ కింద అడిగినా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఏమైనా, ఈ పెట్టుబడిదారుల 'బృందం' ఎన్నికల ముందూ బలపరిచారు. ఇప్పుడూ బలపరుస్తున్నారు. కానీ, వీళ్ళ ప్రతినిధి హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్‌ కేతన్‌ పరేఖ్‌ ''మోడీ ప్రభుత్వం బిజినెస్‌కు అనుకూలమైందే. కానీ (మా కలలు నెరవేడంలో) ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నదో అర్థం కావడం లేదు. మాకు కొద్దికొద్దిగా అసహనం పెరుగుతోంది. మాకు వాగ్దానం చేసిన పద్ధతుల్లో మార్పులు ఎందుకు రావట్లేదో!'' అన్నాడు. మోడీ ప్రభుత్వ సంస్కరణల వేగం నిరాశాజనకంగా ఉందని అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ 'మూడీస్‌' సర్వేలో తేలిందట! కారణం, అనేక ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో ఉండటమేనట! భూ సేకరణ బిల్లు కోసమే ఈ 'బాధ' అని వేరే చెప్పనక్కర్లేదు కదా! పన్లో పనిగా భారతదేశంలోని బహుళ పార్టీ వ్యవస్థ వల్లనే ఈ ఆలస్యం జరుగుతోందని 'మూడీస్‌' తేల్చింది. మన ప్రజాస్వామ్యానికి ఎసరు వస్తోందని గతంలోనే చెప్పుకున్నాం. ఇంత వేగంగా పెట్టుబడిదారీ అనుకూల మార్పులు వస్తున్నా, కార్మిక చట్టాలన్నింటినీ సవరించి పడేస్తున్నా ఆ స్పీడు చాలట్లేదని వారిగోల. ఏమైనా, పెట్టుబడిదారుల కలల పార్టీగా ఇప్పటికీ బిజెపినే ఉంది. పైన చెప్పినవన్నీ చిన్న, చిన్న నసుగుళ్ళు మాత్రమే. ప్రజలను ఖుల్లాగా దోచుకునేందుకు అనుమతులెందుకు ఇవ్వడం లేదన్న అసంతృప్తులే!
మోడీ వెనుక నిలిచిన మరో వర్గం మధ్య తరగతి. ఇది అగ్రకుల డామినేటెడ్‌ది. పేదలంటే వీరికి జనరల్‌గానే ద్వేషం. పేదలు పరిశుభ్రంగా ఉండరని, వారి అపరిశుభ్రతే రోగాలు, రొస్టులు మోసు కొస్తుందని వీళ్ళు నమ్ముతారు. 2014 ఆగస్టు 15న ఎర్రకోట బురుజుల నుంచి మోడీ ప్రకటించిన ''స్వచ్ఛ భారత్‌'' ఈ మధ్య తరగతిని ఉద్దేశించినదే. 83 శాతం ప్రజలు రోజుకు ఇరవై రూపాయలు సంపాదించుకునే ఈ దేశంలో, ఆకలి సూచిక (హంగర్‌ ఇండెక్స్‌) 76 దేశాల్లోనూ 55వ స్థానంలో ఉన్న ఈ దేశంలో పరిశుభ్రత ఉద్యమాల ద్వారానో, ప్రచార కార్యక్రమాల ద్వారానో రాదన్న విషయం మోడీకి, ఆయన ఆంతరంగిక బృందానికి తెలియదనుకోవడం మన భ్రమే! ''స్వచ్ఛ భారత్‌'' అసలు ఉద్దేశం పేదలకు పరిశుభ్రత నేర్పడం కాదు. మధ్యతరగతి ఓట్లపై నజరేనన్న విషయం మరువరాదు.
అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయష! (గురజాడ వారి వెంకాయమ్మ గారు నన్ను క్షమించుగాక!) క్యాంపెయిన్‌ కూడా ఈ మధ్య తరగతిని ఉద్దేశించినదే. వినాయకుడి తలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, రామాయణ కాలంలోనే విమానాలున్నాయని, అణు ఇంధనాన్ని వినియోగించారని చెప్పడం ఈ మధ్య తరగతిలోని అగ్రకుల బ్రాహ్మణాధిక్య సమాజాన్ని నేరుగా అడ్రస్‌ చేయడమే. ఆ ''గతం'' గొప్పతనాన్ని ఆ సెక్షన్ల వారు 'స్వంతం' చేసుకున్నంతగా మన సమాజ దొంతర్లలోని 'క్రింది' ప్రజలు 'ఓన్‌' చేసుకోరు. ఆరెసెస్స్‌కున్న సామాజిక నేపథ్యం కూడా ఇదే. (ఇప్పటివరకు ఆ సంస్థలోని అత్యున్నత పదవి 'సర్‌ సంఫ్‌ు చాలక్‌' మహారాష్ట్రలోని సరస్వతి బ్రాహ్మణులే అధిష్టించారు) వారి వర్గ నేపథ్యం ఇంతకు ముందే చెప్పుకున్నాం.
ఈ మధ్య తరగతికి మరో కోణం కూడా ఉంది. నేడు ఉన్నత చదువులు, అంటే ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఐషియన్లు, ఎంబిఎ/ఎంసిఎలు చేసి నిరుద్యోగులుగా ఉన్నవారు గాని, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉండి సంవత్సరానికి రూ.10-12 లక్షల నుంచి ఒకటి, రెండు కోట్ల వరకు జీతాలు తీసుకునే 'టెక్కీ'ల వరకు (ఐటి సెక్టార్‌) విస్తరించిన ఈ మధ్యతరగతి అగ్రకుల ఆధిపత్యంలోనే ఉంది. వీలైతే, అమెరికాకు ఎగిరిపోయి ''డాలర్ల కలలు'' పండించుకోవాలని వీరి ఆలోచన. మోడీ ప్రభుత్వ, ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే మోడీ స్వంత (అంటే ఆరెసెస్స్‌వారి) విదేశాంగ విధానం చూసి వీరు మురిసిపోతున్నారు. తమ పిల్లలకు ఇంటర్నేషనల్‌ స్కూళ్ళు, తాముండటానికి 60 లక్షల నుంచి కోటి రూపాయల అపార్ట్‌మెంట్లు, విలాసవంతమైన 'టూర్స్‌', ఖరీదైన కార్ల కోసం పరితపించే జనం వీళ్ళు. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల అందుబాటులో కొచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకునే వర్గం ఇది. దీనికి అడ్డుపడే వాళ్ళను, అంటే తమ కలల రథాన్ని తిరగేసే వాళ్ళను (వామపక్షాలను) అసహ్యించుకునే వర్గం, వ్యతిరేకించే వర్గం. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నట్లు మార్కెట్‌ శక్తులను వ్యతిరేకించే వారిని ''రొనాల్డ్‌ రీగన్‌లా శ్వేతాశ్వరూఢుడైన మోడీ ఖతం చేస్తాడ''ని భావించిన వర్గం ఇది. ఈ తరగతి జనంతో మోడీ బృందానికి మరో చుట్టరికం కూడా కలిపే వారథులున్నారు. వీరి గురించి ''గాడ్‌ మార్కెట్‌'' పుస్తకంలో మీరానందా అద్భుతంగా వివరించారు. మాతా అమృతానందమయి ''దైవిక పరిష్వంగం'' (డివైన్‌ హగ్గింగ్‌), శ్రీశ్రీ రవి శంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, మొదట చిన్మయ మిషన్‌ ప్రారంభించి, ఆ తర్వాత 'ఆర్ష విద్య' పేరుతో సేలార్స్‌బర్గ్‌, పెన్సిల్వేనియా (అమెరికా)లో హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్న స్వామి దయానంద సరస్వతి, పతంజలి బాబా రాందేవ్‌ల గురించి ''కొత్త గురువులు'' శీర్షిక కింద 'గాడ్‌ మార్కెట్‌' పుస్తకం వివరిస్తుంది. 2009లో వచ్చిన ఆ పుస్తకంలో మూడు రకాల గురువుల గురించి ఆమె రాశారు. 3వ క్యాటగిరీకి చెందిన బాబా రాందేవ్‌, 2వ క్యాటగిరీలోని శ్రీశ్రీ రవి శంకర్‌లు ఇప్పటికే మోడీని తలకెత్తుకున్నారు. పైన చెప్పిన 'టెక్కీ'లకు వీరు ఆరాధ్య దైవాలు. దీని కొనసాగింపే ''అంతర్జాతీయ యోగా దినం''!
సమాజంలో నోరున్న జనం వీరు. పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. లెటర్స్‌ టు ది ఎడిటర్‌లో రోజూ కన్పడే వాళ్ళు. పదిమందిని ప్రభావితం చేయగల్గిన వారు. వీరిలో కూడా సందేహాలు ప్రారంభమైనాయి. మొదటి కారణం విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెప్పించి పేదలందరికీ తలా లక్షన్నర రూపాయలు అకౌంట్‌లో వేస్తానన్న మోడీ ఊకదంపుడు విన్న వాళ్ళు ఇటీవల అమిత్‌ షా అది ''చునావీ జుమ్లా'' (ఎన్నికల ఎత్తుగడ) అనేసరికి హతాశులయ్యారు. వీరికి సంబంధించింది కాకపోయినా మరో విషయం మనం తెలుసుకుని తీరాలి. మోడీని శతాయుష్మాన్‌ భవ (వందేళ్ళు బ్రతకమని) అని ఆశీర్వదించిన 11.5 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఎందుకో తెల్సా? ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన చూసి! కారణం? సున్నా బ్యాలెన్స్‌తో బ్యాంకు అకౌంట్‌, ఒక లక్ష ప్రమాద బీమా, ఐదు వేల రూపాయల ఓవర్‌ డ్రాప్టు సౌకర్యం! ఇదీ జన్‌ధన్‌ యోజన. విదేశాల నుంచి తీసుకొచ్చిన డబ్బు తమ ఖాతాలలో పడతాయని వీరు ఆశించారు. దాదాపు సంవత్సరం గడిచినా ఏ ప్రయోజనం లేకపోయే సరికి శాపనార్థాలు మొదలెట్టారు.
కాంగ్రెస్‌కు భిన్నంగా, చివరికి వాజ్‌పేరుకి భిన్నంగా తమ 'డ్రీమ్‌ బారు'' భారతదేశంలో పేదరికాన్ని కల్కి అవతారంలో కత్తిదూసి దునుమాడతాడని భావించిన వర్గం ఈ మధ్యతరగతి. ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ఈ మధ్య తరగతి పెదవి విరుపుకు మరో కారణం కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్‌కు భిన్నంగా, స్కాములుండని స్వాముల పాలనగా మోడీ పాలనను ఊహించుకున్నారు. తన సంవత్సర పాలనలో స్కాములే లేవని మోడీ జబ్బలు చరుచుకున్న నాలుగు రోజుల్లో సుష్మా స్వరాజ్‌కు ''లమో స్కాం'' (లలిత్‌ మోడీ స్కాం) బయటి కొచ్చింది. రెండో రోజు వసుంధర రాజే ఇంతకన్నా పెద్ద స్కాంలో ఇరుక్కున్నారు. నేడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావిడ, మూడేళ్ళ క్రితం భారతీయ అధికారులకు తెలియనివ్వకూడదన్న షరతుతో లలిత్‌ మోడీకి వత్తాసు పలకడం ఏమిటన్న ప్రశ్న ఈ మధ్య తరగతి బుద్ధిజీవులను వెంటాడుతోంది. ఈలోగా దివంగత బిజెపి నేత తనయ పంకజ ముండే రూ.206 కోట్ల స్కాంలో ఇరుక్కొంది. ఇప్పటికే వ్యాపం స్కాం (మన రాష్ట్రంలోని ఎమ్‌సెట్‌లాగా)లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, అక్కడి వ్యవస్థ పీకల్లోతు కూరుకుని ఉంది. సాక్షులు, ఆరోపణలెదుర్కొంటున్న వారు 45 మంది హతులయ్యారు. ఆ రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని 'సిట్‌' ఏర్పాటు చేసి పరిశోధన చేయిస్తున్నది.
నిత్యం పత్రికలు చదివే, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్లు చూసే ఈ మధ్యతరగతి ఆలోచనలో పడుతున్నది. సోషల్‌ మీడియా పాత్ర ఇక్కడ ఎన్నో రెట్లుంటుంది. ఈ మధ్యతరగతిలో ముఖ్యమైన భాగం ఉద్యోగస్తులు. సంస్కరణల అమల్లో కాంగ్రెస్‌కు, బిజెపికి తేడాలేదు. ఇన్సూరెన్స్‌, రైల్వే, రక్షణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (ఎఫ్‌డిఐ) పెంచింది మోడీ సర్కారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన పెన్షన్‌ సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంది. కార్మిక చట్టాల సవరణ వంటి అంశాలపై సంఘటిత కార్మికోద్యమం ఇప్పటికే కత్తులు దూస్తున్నది. తమ జీవితాల్లో మెరుగుదల రాక (అచ్ఛేదిన్‌ రాక) అసంఘటిత కార్మికులు ఆందోళనలో ఉన్నారు.
సెప్టెంబర్‌ 2 సమ్మెలో ఈ అసంతృప్తులను ఒక్కటిగా పెనవేద్దాం. ఇప్పటికే చీకటిలో తడుముకుంటున్న వారికి వెలుగు బావుటాలౌదాం. ఫక్తు పెట్టుబడిదారుల కోసం పరితపించే మోడీ పాలనపై సమరశంఖం పూరిద్దాం!
- ఆర్‌ సుధాభాస్కర్‌
(వ్యాసకర్త సిఐటియు జాతీయ కార్యదర్శి)