
నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 80 ఏళ్లపైబడి ఉన్న సీనియర్ నాయకులు అనేక మంది ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. పార్టీ నిర్మాణం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎటువంటి ఇబ్బందులు పడ్డారో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే అనేక మంది కమ్యూనిస్టు నాయకులు పోరాటాలు చేపట్టారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తరిమెలనాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం రాజశేఖర్‌రెడ్డి, వికె.ఆదినారాయణరెడ్డి వంటి ఉద్దండులున్నారని చెప్పారు. వారి ఆశయాలను, ఆదర్శాలను, త్యాగాలను మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరాయిదేశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమం సాగిందని చెప్పారు. ఆనాటి సమస్యలే నేటికీ ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్రోద్యమానికి ప్రజలను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న కమ్యూనిస్టు పార్టీలపై ఉందన్నారు. ఆ దిశగా పయనించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ సీనియర్ నాయకులు ఎంవి రమణ, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు పెద్దన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకులు అమర్‌నాథ్ పాల్గొన్నారు.