మరో వంచన..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామీణ భారత ప్రజానీకం ఆర్థికంగా చితికి శల్యమైపోతోంది. పెద్ద నోట్ల రద్దు ఆకస్మిక నిర్ణయానికి నల్లధనం, ఉగ్రవాదం రూపుమాపడమే లక్ష్యమని చెబుతున్న పాలకులు అటువైపు గురి పెట్టకుండా బడుగు జీవులపై సర్జికల్‌ దాడులు చేస్తుండటం దారుణం. ఇప్పటికే ముందస్తు ప్రణాళికేదీ లేకుండా రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేయడం మూలాన భారతావని పీకల్లోతు చిల్లర కష్టాల్లో మునిగి మూలుగుతుంటే అది చాలదన్నట్టు బ్యాంకుల్లోనూ పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేయడం వంచనకు పాల్పడటమే. బ్యాంకుల ముందు తీరిన బారులు స్మశానం వరకు సాగిపోతుంటే మోడీ సర్కార్‌ మాత్రం కళ్లున్నా చూడలేని కబోదిలా నటిస్తోంది. ప్రజలంతా తమ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హాయిగా నిద్రపోతున్నారని, నల్లధనులే క్యూల్లో ఉన్నారనీ..సొంత సర్వేలను సాకుగా చూపోతోంది. నియంత పోకడలను నిలదీస్తూ సభాసాక్షిగా వాస్తవాలపై నిగ్గుతేలుద్దాం రండి అని ప్రతిపక్షాలు గొంతెత్తి పిలుస్తున్నా మోడీ గారి మనసు కరగడం లేదు. సభకు వచ్చింది లేదు..వచ్చినా చర్చలో పాల్గొనే పాపాన పోలేదు. 
బ్యాంకుల్లో నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నిరంకుశమైనది. అర్థరహితమైనది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన సందర్భంలో డిసెంబరు 30 వరకు అన్ని బ్యాంకుల్లోనూ రూ.500, రూ.1000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చని వాగ్దానం చేసిన ప్రధాని కొన్ని రోజుల వ్యవధిలోనే 'మార్పిడి, గీర్పిడి ఇక కుదరదు.. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవా ల్సిందే' అంటూ షరతులు పెట్టడం నయవంచన కాక మరేంటి. శతాధిక కోట్ల మంది ప్రజానీకంతో ముడిపడిన అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవహారంలో ప్రభుత్వాధినేత చేసిన వాగ్ధానాన్నే ఇలా రోజుల వ్యవధిలోనే అదే ప్రభుత్వం భంగపర్చడమంటే భారతావనికి అంతకంటే దౌర్భాగ్యమేముం టుంది. నవంబరు 8న అత్యంత గాంభీర్యస్వరంతో నోట్ల రద్దు ద్వారా నల్లధనులను ఏరిపారేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి సామాన్య జనాలకి చుక్కలు చూపిస్తున్నారే మినహా నల్లధనాన్ని వెలికితీసిందేమీలేదు. 
నోట్ల రద్దు ప్రారంభంలో నాలుగు వేల రూపాయిలకే నగదు మార్పిడిని పరిమితం చేసిన మోడీ సర్కార్‌ దానిని తర్వాత రూ.2500 కుదించింది. వాస్తవానికి నవంబరు 25 తర్వాత నోట్ల మార్పిడి చేసుకునే పరిమితిని పెంచుతామని మోడీ వాగ్దానం చేశారు. ప్రధానితో పాటు రిజర్వుబ్యాంకు నవంబరు 11న విడుదల చేసిన పత్రికా ప్రకటనల్లోనూ దాదాపు 50 రోజుల వరకు అంటే డిసెంబరు 30 వరకు పాత పెద్ద నోట్ల మార్పిడికి వీలుకల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన హామీని, రిజర్వుబ్యాంకు వాగ్దానాన్ని తుంగలో తొక్కేశారు. సాక్ష్యాత్తూ దేశ ప్రధానమంత్రి, దేశ కేంద్ర బ్యాంకు ఇలా నయవంచనకు పాల్పడితే భారతావని ఎవ్వరిపై విశ్వాసం ఉంచుకోవాలి? గ్యారెంటీ, ప్రామిసరీ క్లాజులో రిజర్వుబ్యాంకు గవర్నరుగా చేసే సంతకానికి కూడా మోడీ సర్కార్‌ ఏలుబడిలో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడుతోందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ జన్‌ధన్‌ ఖాతాల గణాంకాలెలా ఉన్నా..బ్యాంకు ఖాతాల్లోనే గ్రామీణ భారతం ఇంకా వెనుకబడి ఉంది. అసలు బ్యాకింగ్‌ సేవలే అందుబాటులో లేని గ్రామాలూ ఉన్నాయి. భౌగోళికపరంగా చూస్తే కొండ ప్రాంతాల్లో 90 శాతానికి బ్యాంకింగ్‌ సేవలు సుదూర స్వప్నమే. దేశంలో 86 శాతం పైగా లావాదేవీలన్నీ నగదు లావాదేవీలే. ఇవన్నీ మర్చిపోయి పాలకులు ప్లాస్టిక్‌ మనీ అంటూ ప్రయివేటు 'పే'టిఎంల ప్రకటనల్లో దర్శనమివ్వడం సిగ్గుచేటు. ప్రజల అవస్థలను ఏమాత్రమూ పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై అభాండాలేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగిపోతా మనుకుంటే పాలకులకు ఎదురయ్యేది ప్రజానిరసనే. 
ఇప్పటికైనా ఢిల్లీ కోటల్లో కూర్చోని ప్రజలపై సర్జికల్‌ దాడులు చేయడం మాని అసలు నల్లధనులను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తగినంత మొత్తంలో కొత్త నగదు అందుబాటులోకి తెచ్చేవరకు ప్రత్యామ్నాయంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సేవల్లో పాత నోట్లను అనుమతించాలి. జాతీయ బ్యాంకులతో పాటు గ్రామీణ, జిల్లా సహాకార బ్యాంకుల్లో నగదు మార్పిడికి అనుమతించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. మోడీ ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు అటు సభలోనూ, ఇటు ప్రజాబాహుళ్యంలోనూ ఉద్యమబాట పట్టడం అభినందనీయం. ఈ నెల 28న ప్రతిపక్షాలు చేపట్టనున్న దేశవ్యాప్త ఆందోళనల్లో పాల్గొని దిగ్విజయం చేయడం ద్వారా మోడీ సర్కార్‌ కళ్లు తెరిపించడం ప్రజలందరి బాధ్యత.