మరో ఆధార్‌ దేనికి..?

రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి. అరకొర లబ్ధితో బతుకీడుస్తున్న పేదలకు ఆ మాత్రం సాయం సైతం దక్కకుండా చేసేవి. ప్రతి ప్రభుత్వ పథ కానికీ, సేవకూ డేటాను అనుసంధానం చేసి బోగస్‌ను ఏరి పారేస్తామనీ, లబ్ధిదారులను నియంత్రిస్తామనీ బహిరంగం గానే ప్రభుత్వం తన విధానంలో స్పష్టం చేసింది. కేంద్ర ఆధార్‌ వివరాలను తీసుకొని, ఆధార్‌ లేని వారి వివరాల సేకరణకు ప్రత్యేక సర్వే చేపట్టి సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరించి డేటాను అందుబాటులో ఉంచుతారట. ఒక్క బటన్‌ నొక్కితే చాలు వ్యక్తుల అన్ని వివరాలూ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయట.

కేంద్ర ఆధార్‌కు అనుసంధానంగా స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డ ిహెచ్‌) పని చేస్తోంది. ఆధార్‌ ఎంత మందికి ఉందో, ఎంత మందికి లేదో అవగాహన లేకుండానే ఎపి ప్రభుత్వం వివిధ వర్గాల పింఛన్లకు, ప్రతిష్టాత్మక రైతుల రుణ మాఫీకి తప్పనిసరి చేసింది. దాంతో అన్ని అర్హతలూ ఉండి ఒక్క ఆధార్‌ లేని కారణంగా పది లక్షల మంది పింఛన్లకు దూరం అయ్యారు. ఏ ఆసరా లేక సర్కారు ఇచ్చే కొద్దిపాటి పింఛన్‌తో నెలలో కొన్ని రోజులైనా పొట్ట నింపుకుంటున్న నిర్భాగ్యుల ఉసురు తీసింది ఆధార్‌. రైతు రుణ మాఫీలో ఆధార్‌ లేదనే నెపంతో 20 లక్షల మంది రైతులను తిరస్కరించారు. అదేంటంటే ఎస్‌ఆర్‌డిహెచ్‌ సాఫ్ట్‌వేర్‌పై నెపం నెట్టి చేతులు దులుపుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఎలా రూపొందిస్తే అలాగే ఫలితం వస్తుంది తప్ప దానికి దివ్యదృష్టి ఏమీ ఉండదు. రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానం పెట్టి లక్షల మందికి రేషన్‌ దూరం చేసింది. ఈ ఫీట్లన్నీ లబ్ధిదారులకు కత్తెర పెట్టి నిధులు మిగుల్చుకునేందుకే. తాజా గుర్తింపు ప్రక్రియ లక్ష్యం కూడా అదే అనుకోకుండా ఉండలేం.
కేంద్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పౌరులందరికీ ఒకటే గుర్తింపు సంఖ్య అని ఆధార్‌ను ప్రారంభించి ఆరు సంవత్సరాలవుతోంది. 2009 జనవరిలో దేశవ్యాప్త ఆధార్‌ నమోదు కోసం ప్రత్యేక ప్రాథికార సంస్థను నెలకొల్పగా ఇప్పటికి 70 శాతం మంది ప్రజలకే నెంబర్‌ కేటాయించారు. కోట్ల మందికి కార్డులు అందలేదు. ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆధార్‌ ఇలా అఘోరిస్తుం డగానే మోడీ ప్రభుత్వం పౌరులకు బహుళార్ద గుర్తింపు కార్డులిస్తామంటోంది. బిజెపి ప్రభుత్వ ఉద్దేశం వేరే ఉంది. ప్రజలను మత పరంగా గుర్తించాలన్న దుర్మార్గ ఎజెండా దానిది. యుపిఎ ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీ సహా పలు పథకాలకు నగదు బదిలీని అమలు చేసి, అందుకు ఆధారే ఆధారమని పేర్కొని ప్రజల నిరసనలతో తల బొప్పి కట్టించుకుంది. కాంగ్రెస్‌ ఓటమికి అదీ ఒక కారణమే. ప్రతి పక్షంలో ఉండగా నగదు బదిలీ, ఆధార్‌లను వ్యతిరేకించిన బిజెపి అధికారంలోకొచ్చాక అదే బాట పట్టింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్‌ నమోదు ప్రక్రియకు అంతూ పొంతూ లేకపోగా ఎపి ప్రభుత్వం కొత్తగా చేపట్టే పౌరుల గుర్తింపు కార్యక్రమం ఎన్నేళ్లు సాగుతుందో ఊహకందదు. కాంగ్రెస్‌ సర్కారు నందన్‌ నిలేకని కోసం ఆధార్‌ ప్రాజెక్టును తీసుకురాగా రాజధాని అమరావతి మొదలుకొని అన్ని మౌలిక సదుపాయాల కల్పనకూ సింగపూర్‌, జపాన్‌ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కోసం ఆర్రులు చాస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి దోచి పెట్టడానికి ప్రత్యేక గుర్తింపు చేపట్టిందో సమయం గడిస్తే గానీ తెలియదు. 
పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడం రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు విఘాతం. కేంద్ర ఆధార్‌లో ఈ వివాదం తలెత్తింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. ఆధార్‌ లేదనే సాకుతో ప్రభుత్వ ప్రయోజనాలను తిరస్కరించొద్దని 2013లో సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు చెప్పింది. ఆధార్‌ నమోదు అనేది స్వచ్ఛందం తప్ప తప్పనిసరి వ్యవహారం కాదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎపి ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. పైగా ప్రతి దానికీ ఆధార్‌ తప్పనిసరంటూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. తాజాగా ప్రకటించిన విధానంలో ప్రజల డేటాను ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. ప్రజల స్థితిగతులు తెలుసుకొనేందుకు పలు సర్వేలు అందు బాటులో ఉన్నాయి. ఎపి రైతుల్లో 92 శాతం మంది రుణ ఊబిలో కూరుకున్నారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని ఎస్సీల్లో 95 శాతం మందికి సెంటు భూమి కూడా లేదని గతంలో వెలుగు, ప్రస్తుత సెర్ప్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆ అంకెలతో రైతులను, దళితులను ఉద్ధరిస్తే సరిపోతుంది. క్రమం తప్పకుండా ప్రణాళికా శాఖ నిర్వహించే సామాజిక, ఆర్థిక గణన, ఐరిస్‌ సహా పలు అధ్యయనాలు సర్కారుకు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా కొన్ని కొలబద్దలతో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నివేదికలు, సర్వేలను బుట్ట దాఖలు చేసి మరొక సర్వే అనడం దేనికి?