మన విద్యారంగం పయనమెటు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే కాదు, ఏదేశమేగినా ఎందు కాలిడినా మన రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా చదువుతున్నాం. టీవీల్లో గంటల తరబడి వింటున్నాం. అభివృద్ధి అనగానే ఆయన చెప్పేది సింగపూర్‌, జపాన్‌ల గురించి. ఈ మధ్య చైనా గురించి కూడా చెబుతున్నారు. మన రాష్ట్రాన్ని సింగపూర్‌లాగా, జపాన్‌, చైనాల్లాగా అభివృద్ధి చెస్తాననే ముందు ఏ జాతి అయినా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన, కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ అత్యంత కీలక విషయం. విద్యాభివృద్ధి జరక్కుండా ఏ దేశమూ, జాతీ అభివృద్ధి కాలేదు. సింగపూర్‌, జపాన్‌, చైనాలతో సహా. మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూడా కీలకం విద్యాభివృద్ధే. అందులోనూ ప్రాథమిక విద్య అభివృద్ధి మరింత కీలకం.
కానీ మన విద్యారంగం పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలోని 28 రాష్ట్రాల్లో 22వ స్థానంలో ఉంది. దేశ సగటు అక్షరాస్యత 74 శాతం అయితే మన రాష్ట్రంలో 67 శాతం ఉంది. ఇటీవల విడుదలైన గ్రామీణ ప్రాంతాల సామాజిక ఆర్థిక కుల గణన-2011 లెక్కల ప్రకారం భారత దేశంలో సగటున 73.44 శాతం మంది గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో 76 శాతం మంది నివసిస్తున్నారు. గ్రామీణ జనాభానే కాదు గ్రామీణ నిరక్షరాస్యత కూడా మన రాష్ట్రంలో అధికంగా ఉంది. దేశంలో నిరక్షరాస్యులు (35.73 శాతం), అక్షరాలు వచ్చినా ప్రాథమిక విద్య కూడా లేనివారు (13.97 శాతం)... మొత్తం 49.70 శాతం ఉన్నారు. అంటే గ్రామాల్లో దాదాపు సగం మంది నిరక్షరాస్యుల కిందే లెక్క. మన రాష్ట్రంలో ఇది మరీ ఎక్కువ. నిరక్షరాస్యులు 37.85 శాతం+ప్రాథమిక స్థాయికి కింద 14.72 శాతం మొత్తం 52.57 శాతం ఉన్నారు. ఇదీ స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటిన తరువాత మన విద్యారంగం దుస్థితి.
రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా, నాలెడ్జ్‌ స్ట్టేట్‌గా చేయాలని చంద్రబాబు అంటుంటారు. దానరమేమిటి? రాష్ట్రంలోని ప్రజలందరినీ విద్యావంతులను చేయడమా, లేక రాష్ట్రాన్ని విద్యా వ్యాపార కేంద్రంగా మార్చడమా? ప్రభుత్వ విద్య నాసిరకంగా ఉంటోంది కాబట్టి విద్య ప్రైవేటీకరించడం మినహా మరోమార్గం లేదని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. దానికనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఆయన శ్రీకారం చుట్టిన ప్రపంచ బ్యాంకు సంస్కరణల్లో భాగంగా విద్యా రంగం నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ప్రారంభమైంది. విద్యారంగానికి నిధుల కేటాయింపు తగ్గించేస్తూ వచ్చారు. దేశ జిడిపిలో 6 శాతం విద్యా రంగానికి కేటాయిస్తేనే మన విద్యారంగ లక్ష్యాలు నెరవేరుతాయని సిఫార్సు చేయబడింది. విద్యకు కేటాయించిన నిధుల్లో కూడా 65 నుంచి 70 శాతం ప్రాథమిక విద్యకు కేటాయించాలి. కానీ ఈ స్థాయిలో ఏనాడూ కేటాయింపులు జరగలేదు. అయితే 1995-96 వరకు క్రమంగా విద్యకు కేటాయింపులు పెంచుతూ 3.8 శాతానికి తెచ్చారు. తరువాత ఈ కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 3 శాతానికి మించడం లేదు. సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావమది. ఆ నిధుల్లో కూడా 50 శాతం కన్నా తక్కువే ప్రాథమిక విద్యకు కేటాయిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు, జాతీయ రికార్డుకన్నా ఘోరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సిన అవసరముంది. మొదటిది, ప్రభుత్వ విద్యారంగం నాసిరకంగా ఉండబట్టే ప్రజలు ప్రైవేటు విద్య వైపు పరుగులు తీస్తున్నారు. కానీ మన ప్రభుత్వ విద్యారంగం నాసిరకంగా ఎందుకుంది? రెండవది, ప్రభుత్వ విద్యకు ప్రయివేటు విద్య ప్రత్యామ్నాయం కాగలుగుతుందా? మన ప్రభుత్వ విద్యారంగం ముఖ్యంగా ప్రాథమిక విద్య నాసిరకంగా ఉందన్న విషయంలో సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాల్లేవు. పాఠాశాలల సంగతి సరేసరి. చాలామంది విద్యార్థులకు చదవను, రాయను రాదు. ఒకవైపు ఇంగ్లీషు మీడియంపై మోజు పెరుగుతుంటే ఈ పాఠశాల్లో చదివే పిల్లలకు ఇంగ్లీషు గగన కుసుమం అవుతోంది. మరోవైపు పిల్లలను చదివించుకోవాలన్న తపన అన్ని తరగతుల తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. అందువల్ల ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో మాన్పించి ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఏటా 1.5 లక్షలమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు విడిచి పెట్టేస్తున్నారని అంచనా. ఇప్పటికి రాష్ట్రంలో దాదాపు 50 శాతం విద్య ప్రైవేటీకరించబడింది. ఇంక మిగిలిన దాన్ని కూడా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.
అస్తవ్యస్థంగా ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామనే పేరుతో ప్రభుత్వం మరింతగా ఉపసంహరిం చుకుని ఆ మేరకు ప్రైవేటు రంగానికి అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది. స్కూళ్ళు, టీచర్లు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉన్నా ఫలితాలు రావడం లేదనే వాదనతో వీటిని కుదించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొదట క్లస్టరైజేషన్‌ ప్రతిపాదన తెచ్చింది. ఆచరణలో ఎదురయ్యే సమస్యలు, వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వెనక్కు తగ్గింది. ఇక రేషనజైలేషన్‌ ప్రక్రియను ఉధృతం చేసింది. పాఠశాలల్లో పిల్లలు తగ్గారన్న పేరుతో 5,000 పాఠశాలలను ఇప్పటికే మూసేసింది. కొన్నిటిని మూయకపోయినప్పటికీ టీచర్లను మరోచోటికి బదిలీ చేసి వాలంటీర్లతో నడుపుతోంది. ఇప్పుడు కొత్తగా పాఠశాలల విలీనం ప్రతిపాదనతో మరో 6,000 నుంచి 7,000 పాఠశాలలు మూతకు రంగం సిద్ధం చేసింది. 
మరోవైపు సంక్షేమ హాస్టళ్ల మూసివేతకూ నడుం బిగించింది. భవిష్యత్తులో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండవనీ, అన్నీ గురుకులాలు అయిపోతాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ హాస్టళ్ళు మనకున్నాయి. వీటిలోని వసతులు పరమ అధ్వానంగా ఉండడంతో పిల్లలు తగ్గి పోతున్నారు. ఈ సాకుతో ప్రభుత్వం వీటిలోని పిల్లల్ని ఎంపిక చేసిన ప్రస్తుత గురుకులాల్లో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నది. కొత్తగా 77 గురుకులాలు ప్రారంభించి అన్ని హాస్టళ్ళ పిల్లలను వీటిలోకి సర్దవచ్చునని ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కానీ అందుబాటులో ఉన్న హాస్టళ్లలోని పిల్లలను దూరంగా ఉన్న గురుకులాల్లో చేర్చితే సగం మంది డ్రాపవుతారు. గురుకులాల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల మూడింట రెండొంతులకు సీట్లు రాక డ్రాపవుతారు. చాలా హైస్కూళ్ళకు అనుంబంధంగా ప్రస్తుత హాస్టళ్ళు ఉన్నాయి. హాస్టళ్ళ వల్లనే వీటిలో ఎక్కువ మంది పిల్లలున్నారు. హాస్టళ్ళను మూసివేస్తే వందలాది జిల్లా పరిషత్‌ స్కూళ్ళు వెలవెల పోతాయి. టీచర్లు, భవనాలు మిగిలి పోతాయి.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నత విద్య చాలా వరకు ప్రైవేటీకరించబడింది. ఇక మిగిలిన ప్రాథమిక విద్యారంగానికి కూడా పాడె కట్టడానికి ప్రముఖ విద్యావ్యాపారవేత్త అయిన నారాయణను మంత్రిగా పెట్టుకున్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని మున్సిపల్‌ స్కూళ్లలో టీచర్లకు నారాయణ విద్యా సంస్థల నుంచి 'శిక్షణ' ఇప్పిస్తున్నారంటేనే ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతుంది. చంద్ర బాబునాయుడు ఈ విధంగా విద్యను ప్రైవేటీకరించడం ద్వారా రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయగలరా? అనేది ప్రశ్న. ఈ విషయంలో మధ్యతరగతిలో కొందరికి భ్రమలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ ప్రపంచంలో ఏ దేశమూ ప్రాథమిక విద్యను ప్రయివేటు వారికి అప్పగించి అభివృద్ధి కాలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత విద్యను ప్రయివేటు రంగంలో పెట్టి ఉండవచ్చుగాక కానీ ప్రాథమిక విద్యను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మరి అలాంటి స్థితిలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి విద్యను వ్యాప్తిచేయడం సాధ్యమా?
ఇక్కడ మన ప్రజలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను మనం గమనించాలి! 1. దేశంలో నూటికి 80 మంది ప్రజలు రోజుకు రూ. 20 కన్నా తక్కువ ఆదాయాలతో బతుకీడుస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీల సర్వేలు కోడై కూస్తున్నాయి. 2. గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఆదాయాలు మరింత ఘోరంగా ఉన్నాయని ఇటీవల విడుదలైన సామాజికార్థిక నివేదిక తెలిపింది. దాని ప్రకారం దేశంలో.. మన రాష్ట్రంలో కూడా నూటికి 80 గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.5,000 కన్నా తక్కువ ఆదాయంతో బతుకుతున్నాయి. 95 శాతం కుటుంబాలు నెలకు పదివేల లోపు ఆదాయంతో బతుకుతున్నాయి. గ్రామాల్లో సుమారు సగం (48.46 శాతం) కుటుంబాలు దినసరి కూలీ మీద ఆధారపడి బతుకుతున్నట్లు అదే సర్వే తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రయివేటు విద్యను ఎంతవరకు భరించగలరు? భరించలేరు. కానీ భరించాల్సిన పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. 'ఇంగ్లీషు మీడియం', 'పోటీ పరీక్షలు' పేరుతో ప్రయివేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేశాయి. ఉపాధ్యాయుడు, విద్యార్థి, చదువు అన్నీ వ్యాపార వస్తువులుగా మారారు. దీంతోపాటు తీవ్రమైన అసమానతల్ని ఇవి తెచ్చాయి. ప్రైవేటు స్కూళ్ళు విద్యను కృతకంగా మార్చాయి. భట్టీపెట్టడం, పరీక్షలకు సిద్ధంగావడం విద్యగా మార్చాయి. విలువలకు చెల్లుచీటీ ఇచ్చాయి. వ్యక్తిగత ధోరణిని పెంచాయి. సమాజం పట్ల ఏ బాధ్యతా లేని పిల్లల్ని తయారు చేస్తున్నాయి. వినిమయ సంస్కృతి విస్తరించి ప్రయివేటు పాఠశాలల్లో చదవడం ప్రతిష్టగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం చిన్న చూపుగా తయారైంది. అందువల్ల అతి తక్కువ ఆదాయాలతో రోజులు వెళ్ల దీస్తున్న ప్రజలు కూడా ప్రయివేటు విద్య కోసం తమ ఆదాయంలో చాలా భాగం ఖర్చు చేయాల్సి వస్తోంది. పిండికొద్దీ రొట్టె అన్నట్లు ప్రయివేటు విద్యా సంస్థల్లో కూడా 'మంచి' పాఠశాలల్లో చేర్చాలన్న తపనలో మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవుతున్నారు. గ్రామాల్ని వదిలి పట్టణాలకు పిల్లల చదువుల కోసమే రావల్సి వస్తోంది. గ్రామీణ వ్యవసాయ రంగం కుదేలవడంతో, పట్టణ పేదరికం పెరగడంతో, అరకొర జీతాల ఉద్యోగాలు మాత్రమే దక్కుతుండడంతో పిల్లల చదువులు మొయ్యలేని భారంగా మారాయి. దాంతో ప్రయివేటు విద్య ఒక సామాజిక సంక్షోభాన్ని తెచ్చిపెడుతోంది. 
ప్రభుత్వ పాఠశాలలు నాసిరకంగా ఉండడం వల్లనే ప్రజలు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారన్న దాంట్లో సందేహం లేదు. ప్రభుత్వం కూడా ఇదే ప్రచారం చేస్తోంది. కానీ ప్రభుత్వ విద్య నాసిరకంగా తయారవడానికి కారణమెవరు? పాతికేళ్లకు ముందు.. విద్య ప్రయివేటీకరణకు ముందు అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. అక్కడ చదివిన వారే విద్యావేత్తలైనారు, శాస్త్రవేత్తలూ అయినారు. అన్ని రంగాల్లోనూ రాణించారు. విద్య ప్రైవేటీకరిం చబడిన తరువాతనే ప్రభుత్వ విద్యకు ఆదరణ తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రభుత్వమే కారణం. 
ఉదాహరణకు మంచి ప్రాథమిక పాఠశాలలకు 5+1 టీచర్లు, ఆరు తరగతి గదులు, 150 మంది పిల్లలు ఉండాలి. కానీ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో 4 శాతం మాత్రమే ఉన్నాయి. కేరళలో ఇలాంటివి 98 శాతం, తమిళనాడులో 82 శాతం. అందుకే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య పటిష్టంగా ఉంది. మన రాష్ట్రంలో కునారిల్లుతోంది. ఒకరిద్దరు టీచర్లతో ఉన్న స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం. ఇద్దరిలో ఒకరు సెలవు పెట్టినప్పుడు, మీటింగులకు వెళ్ళినపుడు ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఈ స్కూళ్ళు సరిగా పనిచెయ్యవు. టీచర్లురారు. సామాజిక ఒత్తిడిలేదు. ఎంఇవోల పోస్టులు భర్తీ కానందున, పాఠశాల నిర్వహణ కమిటీలు కాగితంపై ఉన్నందున వాటికెలాంటి పర్యవేక్షణా లేదు. ఈ కారణాల వల్ల ఈ పాఠశాలల్లోని పిల్లల విద్యా ప్రమాణాలు నాసిరకంగా తయారయ్యాయి. ఉన్నత పాఠశాలలు, మున్సిపల్‌ స్కూళ్లు కొంత మెరుగ్గా ఉన్నా వాటిని కూడా సమస్యలు తీవ్రంగా వెన్నాడుతున్నాయి.
అందువల్ల విద్యా హబ్‌, నాలెడ్జ్‌ కేంద్రాలు వంటి నినాదాలతో విద్యను మరింత ప్రయివేటీకరించడం వల్ల ఉపయోగం లేకపోగా మన విద్యారంగం నాశనమవుతుంది. విద్యా భారం మోయలేక సామాన్య ప్రజలు కుంగిపోతారు. ఈ మార్గంలో వెళితే అంతిమంగా మన రాష్ట్రం విద్యారంగంలో వెనుకబడే ఉంటుంది మినహా అభవృద్ధి కావడం కల్ల. అందుకనే చంద్రబాబు విద్యా విజన్‌ పనికిమాలినది. ఐటి రంగాన్ని తానే అభివృద్ధి చేశానని ఆయన గొప్పలు చెబుతుంటారు. కానీ ఐటి పేరుతో రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయివేటు ఇంజినీరింగు కాలేజీలకు అనుమతిచ్చింది ఆయనే. ఇప్పుడా ఇంజనీరింగ్‌ విద్య రాష్ట్రంలో ఎలా అఘోరిస్తున్నదో చూస్తున్నాం. అందువల్ల చంద్రబాబు 'విజన్‌'కు భిన్నమైన ప్రత్యామ్నాయ విజన్‌ ఇప్పుడు విద్యారంగంలో మనకవసరం. బలమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏర్పాటు ఈ విజన్‌కు మూలస్తంభంగా ఉండాలి. అటువంటి విద్యావ్యవస్థను ఏర్పాటు చేసుకునే లక్ష్యం చుట్టూ ప్రజలు సమీకృతులైనప్పుడు మాత్రమే మన విద్యారంగం బాగుపడుతుంది, ప్రజలూ బాగుపడతారు. 
- ఎస్‌ వెంకట్రావు