' మన్‌ కీ బాత్‌ ' మహామాయ

 ప్రజలందరూ తనను దేశ ప్రధానిగా చేశారని, తనలోని సాధారణ మనిషి లక్షణాల వల్ల కొన్నిసార్లు ప్రజల్లో ఒక్కడై పోతానని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. 60 ఏళ్ళలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తామనడానికి ఎంతో ధైర్యం కావాలని గత నెల 28న ఆకాశవాణి ద్వారా ప్రచారమయ్యే మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమంలో అన్నారు. తనను తానే గొప్పవాడిగా పొగుడుకునే వారికి ఎవరైనా పోటీలు నిర్వహిస్తే ప్రపంచంలో మోడీకి ప్రథమ బహుమతి లభించవచ్చు. మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పఢావో (బాలికను కాపాడండి, చదివించండి) అంటూ బాలికలను రక్షించడానికి ప్రచారం చేయలన్నారు. బేటీ పఢావో అంటున్న ప్రధాని దేశంలో అయిదు లక్షల ఉపాధ్యాయుల కొరత ఉంటే పేద పిల్లలకు విద్య అందుబాటులో ఎలా ఉంటుంది? మరోపక్క 60 ఏళ్ళ క్రితం బాలలతో చాకిరి చేయించడాన్ని నిషేధించిన రాజ్యాంగంలోని 24వ అధికరణకు వ్యతిరేకంగా చట్ట సవరణ చేస్తూ తన మంత్రివర్గంతో తీర్మానం చేయించారు. కుటుంబ వ్యాపారాలు, కుటుంబ వృత్తులలాంటి పరిశ్రమల్లో 14 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయించుకొనడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాదకరమైన పనుల్లో 14-18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయించరాదు. చట్టాన్ని ఉల్లఘించిన తల్లిదండ్రులకు, సంరక్షకులకు గతంలో యజమానితో సమానంగా శిక్ష ఉండేది. తాజా బిల్లు ప్రకారం మొదటిసారి చేసిన తప్పుకు శిక్షలు లేకుండా సవరించినట్లు తెలిసింది. రెండవసారి, ఆపైనా పిల్లలతో పనిచేయిస్తే కేవలం రూ.10 వేలు మాత్రమే జరిమానా చెల్లిస్తేచాలని చట్ట సవరణ చేశారు. దేశంలో లక్షలాది మంది బాల కార్మికులు 10 నుంచి 15 గంటలు పనులు చేస్తూ ఆస్తమా, క్షయ రోగాల బారినపడుతున్నారని అనేక స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి బాలకార్మికుల బాధలు పట్టలేదు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 60 ఏళ్లలో ఎవరూ చేయని, ఒక సంవత్సరంలో మోడీ చేసిన గొప్ప పని ఇదేనా?
దేశంలో కోటి మంది బాలకార్మికులు కడుపు నింపుకోవడం కోసం పనులు చేస్తున్నారు. ప్రతి గంటకు 15 మంది చిన్నారులు కన్పించకుండా పోతుండగా, వారిలో ఏడుగురి ఆచూకీ ఎప్పటికీ తెలియడం లేదని బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యర్థి రెండు నెలల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అయితు కోట్లకు పైగా బాలకార్మికులు న్నారన్నారు. అనేక వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేస్తున్న 12 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలకార్మికులకు బచ్‌పన్‌ బచావో సంస్థ విముక్తి కల్పించింది. వీరితో ఇనుప కడ్డీలు కోయడం, వెల్డింగ్‌ లాంటి పనులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయిస్తున్నందున వారి చేతులకు గాయాలయ్యాయని సంస్థ తెలిపింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఎనిమిది వేల మంది బాల కార్మికులున్నారని నివేదిక తయారుచేసి ఢిల్లీ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ద్వారా వివరాలను విడుదల చేయించారు. ఇందులో 70 శాతం బాలికలే ఉన్నారని తెలిపింది. మరో సర్వే ప్రకారం శివకాశిలో సుమారు 16 బాణాసంచా ఫ్యాక్టరీల్లో నాలుగు వేలకు పైగా బాలకార్మి కులున్నారు. వీరిలో దాదాపు 90 శాతం బాలకార్మి కులు మందు గుండు సామాగ్రి తాకడం వల్ల ఆస్థమాతోపాటు, క్షయ రోగాలకు గురౌతున్నట్లు తెలిపింది. జాతీయ గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 55 వేల మంది పిల్లలు అదృశ్యమౌతున్నారు. వీరితో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. కొందరిని వృభిచార వృత్తిలో దించుతున్నారు. మరికొందరిని బిచ్చమెత్తిం చడం, ఇళ్ళలో చాకిరికి వినియోగిస్తున్నారు.
కన్నబిడ్డకు పాలు ఇవ్వడానికి యజమాని అనుమతినివ్వనందున కన్నతల్లి కళ్ళ ఎదుటే పాల కోసం ఏడుస్తూ ప్రాణాలొదిలింది ఓ పసికందు. కర్నూలు జిల్లాలో పడమటి ప్రాంతానికి చెందిన అనసూయమ్మ అనే మహిళ తన ఇద్దరు బిడ్డలతో బ్రతుకుతెరువు కోసం నాలుగు నెలల క్రితం ప్రకాశం జిల్లాకు వలస వెళ్ళింది. సంవత్సరం వయస్సు బిడ్డను కాలువగట్టుపై పడుకో బెట్టి మూడేళ్ల బిడ్డను కాపలా పెట్టింది. పత్తి సేకరించే పనిలో ఉన్న అనసూయమ్మ తన బిడ్డకు పాలిద్దామని కాలువగట్టు దగ్గరకు వెళ్లి చూడగా కాలువగట్టుపై పడుకోబెట్టిన పసిబిడ్డ దొర్లుకుంటూ కాలువలో పడి మరణించి నీళ్ళలో కొట్టుకొనిపోతూ కనిపించింది. ఇలాంటి వలస కూలీల తల్లుల కడుపుకోతలు జనంలో ఒకడైన ప్రధాని మోడీకి కనిపించదా?
గత 60 ఏళ్లలో చేయని పని సంవత్సరంలో చేశా నని చెప్పుకుంటున్న మోడీ పాలనలో కట్టుబానిసలు ఎందుకున్నట్లు? గత మార్చి నాటికి దేశంలో 3,00,175 మంది కట్టుబానిసలున్నారని కేంద్ర కార్మికశాఖా మంత్రి బండారు దత్తత్రేయ గత లోక్‌సభలో ప్రకటించారు. వీరందరికీ విముక్తి కలిగించారని మంత్రి తెలిపారు. దేశంలో ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండి, చేయడానికి పని, పనికి తగిన ఫలితం దొరికే విధానాలు అమలు జరపాలి. ఆర్థిక అసమానతలు రూపుమాపకుండా ఆడ పిల్లను కాపాడండి, చదవించండి అంటూ మన్‌ కీ బాత్‌ పేరుతో ప్రజలను మాయ చేయడం తప్ప మరొకటి కాదు.
- ఇరిగినేని పుల్లారెడ్డి 
(వ్యాసకర్త సిపియం కర్నూలు జిల్లా కమిటీసభ్యులు)