మద్యం పాలసీని పున:సమీక్షించాలి..

 విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు..కల్తీ మద్యం మృతులు, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 40 మంది సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించేందుకు సిఎం చంద్రబాబు వెళ్లినపుడు సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ కార్యదర్శి సిహెచ్‌.బాబూరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కల్తీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర పదవికి రాజీనామా చేయాలని బాబురావు డిమాండ్‌ చేశారు. బార్‌ యజమానులును అరెస్టు చేయడంతో పాటు సంబంధిత ఎక్సైజ్‌ అధికారులనూ సస్పెండ్‌ చేసి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ మద్యం పాలసీని పున:సమీక్షించాలన్నారు. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు.