మద్దతుధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలి, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, అదే క్రమంలో రైతులకు కల్పించాల్సిన కనీస మద్దతు ధరను కూడా కల్పించకపోవడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. మండలంలోని కాజా గ్రామంలో సింహాద్రి బసవపున్నయ్య జయంతి సందర్భంగా సింహాద్రి శివారెడ్డి మోమొరియల్‌ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం గ్రామంలోని సుందరయ్య భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపిటిసి ఈదా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ సుందరయ్య స్ఫూర్తి, సేవా తత్పరితతో శివారెడ్డి, ఆయన కుటుంబం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ కొనసాగడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులుగా పని చేసిన శివారెడ్డి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపించారన్నారు. సర్పంచ్‌ పదవిని అన్ని తరగతుల వారికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఒక్కొసారి ఒక్కొక్కరికి పదవిని చేపట్టేలా చేసిన నిర్ణయం ఆదర్శనీయమన్నారు. సిపిఎం పరిపాలన కాలంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చేసిన తీరు పలువురికి స్ఫూర్తిదాయకమన్నారు. తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ విద్యను పేదలకు అందించాలనే ఉద్దేశంతో శివారెడ్డి కుటుంబం కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది ఉపాధిని పొందాలని ఆకాంక్షించారు. ఉపాధి లభించేలా శిక్షణ అందించేందుకు అత్యంత సమర్థులైన అధ్యాపకులను నియమించినట్లు వెల్లడించారు. మహిళలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. నేడు అనేక ప్రాంతాల్లో మట్టిని, ఇసుకను అమ్ముకుని కోట్లు గడిస్తున్నారన్నారు. పంచాయతీ సర్పంచ్‌లుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా గెలుపొంది, మరింత అక్రమాలకు పాల్పడేందుకు వ్యవహరిస్తున్నారు. కాజ గ్రామం మాత్రం మహానుభావుల ఆదర్శనీయమైన ఆచరణలతో ముందుకు సాగాలని కోరారు. అక్రమమార్గంలో కోట్లు సంపాదించిన వారంతా నేడు బయటకు రావాల్సిన పరిస్థితులు రాబోతున్నాయని చెప్పారు. మిర్చి, పసుపు, ధాన్యం వంటి రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక రైతులు ఆందోళన చేస్తున్నారని, ప్రభుత్వానికి మాత్రం ఇవేమీ పట్టడం లేదన్నారు. కనీస మద్దతుధర కల్పించడంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉందన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించాలంటే ఇతర పార్టీల వల్ల కాదని, కేవలం కమ్యూనిస్టులు మాత్రమే వాటిని ప్రశ్నిచగలరనే చర్చ సర్వత్రా వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, ఉపాధి కల్పనలో వెనకడుగు వేస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అనేక సంస్థలు, ఎన్‌జిఒలు ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుంతుందన్నారు. ప్రభుత్వం అందరికీ అవకాశాలు కల్పించి విద్యను, ఉపాధిని కల్పించడం ద్వారా మాత్రమే పూర్తిస్థాయి అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, కానీ పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందుతున్న విద్యను కూడా నిర్లక్ష్యం చేస్తూ, పాఠశాల విద్యను నీరుగారుస్తున్నారని, తద్వారా పేద వర్గాలకు విద్య అందకుండాపోతుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ సేవను అందించడంలో సుందరయ్య స్ఫూర్తితో శివారెడ్డి కొనసాగారన్నారు. అదే క్రమంలో వారి కుటుంబం గ్రామంలో కంప్యూటర్‌ విద్యను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంతర్జాలాన్ని ప్రజలకు అందించేందుకు చేస్తున్న కృషి పలువురికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణంలోనూ, పార్టీని విస్తృతం చేయడంతో చేసిన కృషి, కాజా గ్రామానికి ప్రముఖ పాత్ర ఉందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు ఈదా నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ శివారెడ్డికి బంధుప్రీతిగాని, అవినీతి మచ్చలు లేవని, ఆయన దృష్టిలో ప్రతిఒక్కరూ సమానమేనని ఆ విధంగానే ఆయన సేవలు అందించారని పేర్కొన్నారు. సిపిఎం మంగళగిరి డివిజన్‌ కార్యదర్శి జెవి రాఘవులు మాట్లాడుతూ కంప్యూటర్‌ విద్యను రానున్న కాలంలో మరింత విస్తృత పరుస్తామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. తొలుత గ్రామంలోని మహాప్రస్థానంలో సింహాద్రి శివారెడ్డి-రత్తమ్మ పేర్లతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని పి.మధు ప్రారంభించారు. తొలుత గ్రామంలోని సుందరయ్య విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.